గురువారం, 24 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

YS Jagan with Governor: డీఎస్సీ అక్ర‌మాల‌పై గవర్నర్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు.. కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ సీఎం

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 24 సెప్టెంబర్ 2026

YS Jagan with Governor: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, పరీక్షలు రాయకుండానే 372 మందికి టీచర్ ఉద్యోగాలు కల్పించారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ న‌జీర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. డీఎస్సీ నియామకాల్లో తాము గుర్తించిన అవకతవకలు, స్పోర్ట్స్ కోటా నియామకాలు, నకిలీ ధ్రువపత్రాలు, మెరిట్ జాబితాల మార్పులు, నిరుద్యోగులపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం లోక్‌భవన్ వెలుపల మీడియాతో మాట్లాడిన వైయ‌స్ జగన్.. డీఎస్సీ అక్రమాలపై ఇప్పటికే రెండు విడతలుగా ఆధారాలతో సహా ప్రజల ముందుకు వచ్చామని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అనేక ప్రశ్నలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఒకే అధికారి చేతుల్లో ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ

డీఎస్సీ అక్రమాలకు పునాది ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారి చేతుల్లో పెట్టడంతోనే పడిందని జగన్ ఆరోపించారు. ఈ రెండు కీలక బాధ్యతలను ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు అప్పగించారని, అనంతరం పరీక్షల నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారని విమర్శించారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన నవీన్ అనే అభ్యర్థికి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు వచ్చినప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదని తెలిపారు. తొలుత మెరిట్ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న నవీన్ పేరును అనంతరం తొలగించారని, అతని లాగిన్ ఐడీని బ్లాక్ చేసి కాల్ లెటర్ కూడా పంపించలేదని ఆరోపించారు. తనకు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని నవీన్ ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని వివరించారు. ఈ పరిణామాలన్నీ డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై అనుమానాలను బలపరుస్తున్నాయని జగన్ పేర్కొన్నారు.

372 మందికి పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?

స్పోర్ట్స్ కోటా పేరుతో టీచర్ నియామకాల్లో నిబంధనలను మార్చారని జగన్ ఆరోపించారు. గతంలో ఉన్న జీవోను రద్దు చేసి జీవో నంబర్లు 4, 47 తీసుకువచ్చారని, వాటి ఆధారంగా డీఎస్సీ పరీక్ష రాయకుండానే 372 మందికి టీచర్ ఉద్యోగాలు కల్పించారని పేర్కొన్నారు. ఆ నియామకాలు పూర్తయిన తర్వాత మళ్లీ జీవో నంబర్లు 23, 25, 56 తీసుకువచ్చి పరీక్ష తప్పనిసరి చేశారని విమర్శించారు. 372 మందికి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్లీ పరీక్ష తప్పనిసరి చేస్తూ నిబంధనలు ఎందుకు మార్చారు? ఆ మధ్యకాలంలో నియమితులైన వారికి ప్రత్యేక మినహాయింపులు ఎందుకు కల్పించారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో నకిలీ ధ్రువపత్రాలు ఉపయోగించారని, జరగని క్రీడా పోటీలను జరిగినట్లు చూపించి ఉద్యోగాలు కల్పించారని జగన్ ఆరోపించారు. విశాఖ ఎంపీ భరత్‌కు సంబంధించిన జూడో ధ్రువపత్రాల వ్యవహారంతో పాటు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్ పాత్రపైనా గతంలోనే ఆధారాలు వెల్లడించామని తెలిపారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు సంబంధించిన 38 ఉద్యోగాల విషయంలో అక్రమాలు జరిగాయని, అసోసియేషన్ జిల్లా కార్యదర్శుల కుటుంబ సభ్యులకు కూడా ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించారు.

ఆడియోలు బయటపడినా చర్యలు ఎందుకు తీసుకోలేదు?

డీఎస్సీ నియామకాలకు సంబంధించిన ఆడియో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ ప్రభుత్వం సమగ్ర విచారణ జరపడం లేదని జగన్ విమర్శించారు. వైరల్ అయిన సంభాషణల్లో ఫోన్ నంబర్ స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎఫ్‌ఐఆర్‌లో సంబంధిత వ్యక్తిని అనుమానితుడిగా మాత్రమే పేర్కొన్నారని ఆరోపించారు. ఆ వ్యక్తిని అరెస్టు చేయలేదని, కానీ అసెంబ్లీలో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని విమర్శించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు వివరించినట్లు జగన్ తెలిపారు.

శాప్ కార్యాలయం వద్ద నిరుద్యోగులపై దాడులు

డీఎస్సీ నియామకాల్లో అవకతవకలకు నిరసనగా సెప్టెంబర్ 21న శాప్ కార్యాలయం వద్ద శాంతియుత ధర్నా నిర్వహించాలని వైయస్సార్‌సీపీ నిర్ణయించిందని జగన్ తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ముందుగానే మీడియాకు వెల్లడించడంతో పాటు శాప్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారని చెప్పారు. అయితే, అదే సమయంలో మరో వర్గంతో సమాంతర ధర్నా నిర్వహించేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. టీడీపీకి చెందిన వ్యక్తులను అక్కడికి తీసుకువచ్చి వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, నిరుద్యోగులపై దాడులు చేయించారని విమర్శించారు. గతంలో సాక్షి కార్యాలయంపై జరిగిన దాడిలో పాల్గొన్న వ్యక్తులే శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలోనూ ఉన్నారని జగన్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా చూపించినట్లు తెలిపారు.

దాడి చేసిన వారిని వదిలి.. బాధితులపైనే రివర్స్ కేసులా?

శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా బాధితులపైనే కేసులు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. దాదాపు 350 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు ఎఫ్‌ఐఆర్‌లో ‘అండ్ అదర్స్’ అని చేర్చి మరింత మందిని కేసుల్లో ఇరికించే అవకాశం కల్పించారని ఆరోపించారు. రాత్రివేళ నిరుద్యోగుల ఇళ్లకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అరెస్టులతో వారి కుటుంబాలను వేధిస్తున్నారని విమర్శించారు. ఈ కేసుల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని నిరుద్యోగులకు బెయిల్ మంజూరు చేశాయని తెలిపారు. నిరసనల్లో పాల్గొన్న వారిపై రౌడీషీట్లు తెరవడం ద్వారా వారి భవిష్యత్తును దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

సీబీఐ విచారణ జరిపించాలి

డీఎస్సీ నియామకాలపై విద్యార్థులు, నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జగన్ పేర్కొన్నారు. నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరగాలంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని, అప్పుడే పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియపై అభ్యర్థుల్లో విశ్వాసం కలుగుతుందని తెలిపారు. ఈ డిమాండ్ల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

సాయికృష్ణ లాకప్ డెత్‌పైనా గవర్నర్ దృష్టికి

సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఈ కేసులో పోలీసుల పాత్రపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణను గుర్తుచేశారు. పోలీసు ఉన్నతాధికారుల బాధ్యతపై న్యాయస్థానం ప్రశ్నలు లేవనెత్తిందని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని, రాష్ట్రంలో అధికార దుర్వినియోగానికి డీఎస్సీ నిరుద్యోగులపై కేసులు, సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారాలు ఉదాహరణలని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని, శాంతియుత నిరసనలను అణచివేసేందుకు కేసులు పెట్టడం సరికాదని జగన్ పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇవీ చ‌ద‌వండి: YS Jagan with Vizag Leaders: పోలీసు దౌర్జ‌న్యాల‌తో ప్ర‌జ‌ల‌ తీర్పును శాశ్వ‌తంగా అడ్డుకోలేరు: వైఎస్ జ‌గ‌న్
YS Jagan tweet on DSC: ఒక టీచర్‌ పోస్టు.. డీఎస్సీలో ఆరు మలుపులు! సీఎం చంద్రబాబును నిలదీసిన YS జగన్‌

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading