Sonia Gandhi Memoir: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ విడుదలైన రోజే ఎమర్జెన్సీపై రాజకీయ చర్చ మొదలైంది. ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని సమర్థించే ప్రయత్నం ఈ పుస్తకంలో కనిపిస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ విమర్శించారు. పుస్తకానికి ‘బిలాంగింగ్’ బదులు ‘తప్పులను కప్పిపుచ్చడం’ అనే పేరు పెట్టాల్సిందని ఎద్దేవా చేశారు. నవంబర్ 10న విడుదలైన ఈ పుస్తకాన్ని భారత్‌లో హార్పర్‌కాలిన్స్ ప్రచురించింది.
ఎమర్జెన్సీని ‘తప్పు’గా అభివర్ణించిన సోనియా
1975లో విధించిన ఎమర్జెన్సీ ఒక తప్పని సోనియా తన ఆత్మకథలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ కూడా అదే అభిప్రాయానికి వచ్చారని తాను భావిస్తున్నట్లు రాశారు. సంజయ్ గాంధీని అదుపులో ఉంచి ఉంటే ఎమర్జెన్సీ వల్ల జరిగిన నష్టంలో చాలా వరకు నివారించగలిగేవారమని అభిప్రాయపడ్డారు. ఈ వివరణపై స్పందించిన కేశవన్, పౌరుల ప్రాథమిక హక్కుల అమలుపై ఆంక్షలు విధించిన ఎమర్జెన్సీని సమర్థించేందుకు సోనియా ప్రయత్నించారని ఆరోపించారు. నెహ్రూ–గాంధీ కుటుంబం చేసిన చారిత్రక తప్పిదాలను తక్కువ చేసి చూపే ప్రయత్నంగా పుస్తకం కనిపిస్తోందన్నారు.
బాబ్రీ కూల్చివేత నుంచి 1984 సిక్కు వ్యతిరేక హింస వరకు
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతను టీవీలో చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నానని పుస్తకం విడుదలకు ముందు ది గార్డియన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియా గుర్తుచేసుకున్నారు. దీనిపై స్పందించిన కేశవన్, 1984 సిక్కు వ్యతిరేక హింసలో ప్రాణాలు కోల్పోయినవారి పట్ల కూడా ఆమె అదే ఆవేదన వ్యక్తం చేశారా అని ప్రశ్నించారు. బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల గురించి ప్రశ్నించారు. 26/11 ముంబయి ఉగ్రదాడుల తర్వాత యూపీఏ ప్రభుత్వం ఎందుకు ప్రతీకార చర్య తీసుకోలేదని నిలదీశారు. మరోవైపు, బోఫోర్స్ వివాదంపై పుస్తకం మౌనం వహించిందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు.
బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ జవాబు
సోనియా తన అనుభవాలను, అభిప్రాయాలను పుస్తకంలో రాశారని, వాటికి బీజేపీ రాజకీయ రంగు పులుముతోందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతను అటల్ బిహారీ వాజ్‌పేయీ కూడా విమర్శించారని, ఎల్‌కే అద్వానీ దాన్ని తీవ్ర తప్పిదంగా అభివర్ణించారని గుర్తుచేశారు. సోనియా వ్యక్తిగత జ్ఞాపకాలను రాజకీయ వివాదంగా మార్చాల్సిన అవసరం లేదన్నారు.
2004లో ప్రధాని పదవిని ఎందుకు వదులుకున్నారు?
ఇటలీలో బాల్యం, కేంబ్రిడ్జ్‌లో రాజీవ్ గాంధీతో పరిచయం, వివాహం తర్వాత భారత్‌లో జీవితం, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలతో ఎదురైన కుటుంబ విషాదాలను సోనియా ఈ పుస్తకంలో గుర్తుచేసుకున్నారు. 2004 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని పదవిని చేపట్టాలా వద్దా అన్న సందిగ్ధతను, ఆ సమయంలో కుటుంబంలో జరిగిన సంభాషణలను వివరించారు. చివరకు తాను పదవిని స్వీకరించకుండా, మన్మోహన్ సింగ్ పేరుకు పార్టీ అంగీకారం ఎలా సాధించారన్న విషయాన్నీ వెల్లడించారు.
ఇవీ చదవండి: Sonia Gandhi Autobiography: ప్రేమ, విషాదం, ప్రధాని పదవికి నిరాకరణ.. సోనియా ఆత్మకథలో ఏముంది?
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక మలుపు.. మళ్లీ విచారించాలన్న ఢిల్లీ కోర్టు






