బుధవారం, 23 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

YS Jagan with Vizag Leaders: పోలీసు దౌర్జ‌న్యాల‌తో ప్ర‌జ‌ల‌ తీర్పును శాశ్వ‌తంగా అడ్డుకోలేరు: వైఎస్ జ‌గ‌న్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 23 సెప్టెంబర్ 2026

YS Jagan with Vizag Leaders: ప్రజాస్వామ్యంలో అధికార దుర్వినియోగం, పోలీసుల సహాయంతో దౌర్జన్యాలు చేయడం ద్వారా తాత్కాలిక ఫలితాలు సాధించవచ్చేమో కానీ, ప్రజల తీర్పును శాశ్వతంగా అడ్డుకోలేరని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్‌ విశాఖకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీల అమలు, విశాఖలో భూముల కేటాయింపులు, తాగునీటి ఎద్దడి, పోలవరం ప్రాజెక్టు, డీఎస్సీ నియామకాలు, పోలీసుల వ్యవహారశైలిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, ఉత్తరాంధ్ర అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను గుర్తుచేశారు.

ప్రజలకు చేసిన మంచే తమకు శ్రీరామరక్షగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో జరిగే ప్రతి అన్యాయాన్నీ డిజిటల్‌ డైరీలో నమోదు చేయాలని, భవిష్యత్తులో వాటిని పరిశీలించి చట్టప్రకారం బాధ్యతను నిర్ధారిస్తామని చెప్పారు. జగన్‌ 2.0లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని, పార్టీ అగ్రనాయకత్వం నుంచి తన వరకు ప్రతి ఒక్కరూ కార్యకర్తలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

ఈరోజు ప్రతి ఇంట్లో అదే చర్చ

మన ఐదేళ్ల పాలనకు, ప్రస్తుతం రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనకు మధ్య ఉన్న తేడాను ఈరోజు ప్రతి ఇంట్లో చర్చించుకుంటున్నారు. మన హయాంలో ప్రజలకు అందిన పాలనకు, ఇప్పటి పాలనకు మధ్య వ్యత్యాసం ప్రతి కుటుంబానికీ స్పష్టంగా కనిపిస్తోంది. మన ఐదేళ్ల పాలనలో గతంలో ఎన్నడూ జరగని మార్పులు తీసుకొచ్చాం. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను మార్చాలన్న చిత్తశుద్ధితో పని చేశాం. రాజకీయాల్లో నాయకుడి మీద, పార్టీ మీద విశ్వసనీయతను పెంచేందుకు కృషి చేశాం. గతంలో మేనిఫెస్టో అంటే ఎన్నికల సమయంలో ఇష్టానుసారంగా హామీలు ఇవ్వడం, ఎన్నికలు ముగిసిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో పడేయడం అనే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితిని మార్చింది వైయస్సార్‌సీపీ ప్రభుత్వం. మేనిఫెస్టోను కేవలం రెండు పేజీల్లో, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా తీసుకొచ్చాం. దాన్ని ఒక భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా భావించి 99 శాతం హామీలను అమలు చేశాం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అంతటి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం మనది.

విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు

నాడు మనం కేవలం మేనిఫెస్టో అమలుతోనే సరిపెట్టుకోలేదు. గతంలో సాధ్యం కాదనుకున్న ఎన్నో కార్యక్రమాలను సాధ్యం చేసి చూపించాం. ప్రభుత్వ బడులను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడగలవా అనే సందేహం గతంలో ఉండేది. మన ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాం. నాడు–నేడు (మనబడి) కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాం. ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాం. మూడో తరగతి నుంచే టోఫెల్‌ను ఒక పీరియడ్‌గా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఒక పేజీ ఇంగ్లిష్, మరో పేజీ తెలుగు ఉండేలా ద్విభాషా (బైలింగ్వువల్‌) పాఠ్య పుస్తకాలను అందించాం. ఆరో తరగతి నుంచి డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేశాం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించాం. పిల్లలు ఏం తింటున్నారు, వారికి ఎలాంటి పౌష్టికాహారం అందుతోంది అనే విషయాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఈ మార్పులతో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు అవసరమయ్యే పరిస్థితి వచ్చింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు ఖాళీ లేవని బోర్డులు పెట్టే స్థాయికి తీసుకెళ్లగలిగాం. ఒక వ్యవస్థలో చిత్తశుద్ధితో పనిచేస్తే ఎంతటి మార్పులైనా తీసుకురావచ్చని మన ప్రభుత్వం నిరూపించింది.

వైద్య–ఆరోగ్య రంగం

వైద్య రంగంలో గతంలో ఎన్నడూ లేని మార్పులు తీసుకొచ్చాం. వైద్య రంగంలోనూ మనం తీసుకొచ్చిన మార్పులు గతంలో ఎన్నడూ జరగలేదు. మన ప్రభుత్వం రాకముందు ఆరోగ్యశ్రీ కేవలం 1000 ప్రొసీజర్లకే పరిమితమై ఉండేది. దాన్ని 3,300 ప్రొసీజర్లకు విస్తరించాం. పథకంలో పేదవారికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందేలా చేశాం. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను మార్చాం. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దేందుకు కృషి చేశాం. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండని పరిస్థితి ఉండేది. దేశవ్యాప్తంగా స్పెషలిస్టు వైద్యుల కొరత 61 శాతం ఉంటే, మన ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆ కొరతను కేవలం 4 శాతానికి పరిమితం చేయగలిగాం.

జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. మందులు దొరకని పరిస్థితిని మార్చి, డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందులు మాత్రమే అందుబాటులో ఉండేలా చేశాం. గ్రామస్థాయి వరకు విలేజ్‌ క్లినిక్‌లను తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టాం. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు, ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా వ్యవస్థను రూపొందించాం. మండలానికి నలుగురు వైద్యులు, రెండు 104 వాహనాలను అందుబాటులో ఉంచాం. ఒక వైద్యుడు పీహెచ్‌సీలో సేవలు అందిస్తుంటే, మరో వైద్యుడు 104 వాహనంలో తనకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి ప్రజలకు వైద్య సేవలు అందించేలా చేశాం. దీంతో ప్రజలకు గ్రామస్థాయిలోనే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స చేయడమే కాకుండా, ముందుగానే గుర్తించి నివారించే ప్రివెంటివ్‌ కేర్‌లోనూ కీలక మార్పులు తీసుకొచ్చాం. ఇవన్నీ సాధ్యమవుతాయా అని గతంలో ఎవరైనా అడిగితే సాధ్యం కాదనే సమాధానం వచ్చేది. కానీ వాటిని సాధ్యం చేసి చూపించింది మన ప్రభుత్వం.

గ్రామ స్వరాజ్యం

గ్రామస్థాయిలోనే పరిపాలనను ప్రజలకు చేరువ చేశాం. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చాం. ప్రతి 60 నుంచి 70 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే చేర్చాం. లంచం లేకుండా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పేదవారికి సేవలు అందించగలమని నిరూపించాం. సంక్షేమ పథకాల సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రతి ఇంటికీ ప్రభుత్వ సాయం అందేలా వ్యవస్థను రూపొందించాం. కుల ధ్రువీకరణ పత్రం వంటి సేవలను కూడా వాలంటీర్లు ప్రజల ఇంటి వద్దకే తీసుకొచ్చే పరిస్థితి కల్పించాం.

వ్యవసాయం పండగ

గ్రామస్థాయిలో రైతులకు అండగా ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చాం. వ్యవసాయ రంగంలోనూ గతంలో ఎన్నడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. ప్రతి ఎకరాను ఈ–క్రాప్‌ నమోదు చేసి, ఉచిత పంటల బీమా అమలు చేశాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలోనే రైతులకు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతి ఆర్బీకేలో ఒక వ్యవసాయ గ్రాడ్యుయేట్‌ను నియమించాం. ప్రతి పంటకు ప్రకటించిన గిట్టుబాటు ధరలను రైతులకు తెలిసేలా ఆర్బీకేల్లో ప్రదర్శించాం. ఎక్కడైనా రైతులకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితి ఉంటే, ఆర్బీకే సిబ్బంది సీఎం–యాప్‌ ద్వారా వివరాలను నమోదు చేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేశాం. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించే విధానాన్ని తీసుకొచ్చాం. అవసరమైన చోట జాయింట్‌ కలెక్టర్, మార్క్‌ఫెడ్‌ అధికారులు జోక్యం చేసుకొని కొనుగోళ్లకు చర్యలు చేపట్టేలా చేశాం. రైతులకు సరైన ధర దక్కేలా కొనుగోలు వ్యవస్థలో పోటీని పెంచేందుకు కృషి చేశాం.

కోవిడ్‌ సంక్షోభంలోనూ..

మన ఐదేళ్ల పాలనలో రెండున్నరేళ్లపాటు కోవిడ్‌ పరిస్థితులు ఎదురైనా ఏనాడూ సాకులు చెప్పలేదు. కోవిడ్‌ కారణంగా హామీలు అమలు చేయలేకపోతున్నామని చేతులెత్తేయలేదు. ఒకవైపు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ, మరోవైపు వ్యవస్థల్లో గతంలో ఎన్నడూ లేని మార్పులు తీసుకొచ్చాం.

ఇప్పుడు అంతా ‘రివర్స్‌’

మన హయాంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసు అందుబాటులో ఉండేవారు. దిశ యాప్‌ను తీసుకొచ్చాం. ఆపదలో ఉన్న మహిళలు ఫోన్‌ చేసినా, ఫోన్‌ను షేక్‌ చేసినా పోలీసులు వెంటనే స్పందించి సహాయం చేసే వ్యవస్థను ఏర్పాటు చేశాం. కానీ, ఇప్పుడు పరిస్థితులన్నీ రివర్స్‌ గేర్‌లోకి వెళ్లిపోయాయి. రాష్ట్రంలో రూపాయికి చాక్లెట్‌ వస్తుందో లేదో తెలియదు. కానీ విశాఖపట్నంలో మాత్రం చంద్రబాబు తనకు కావాల్సిన వారికి 99 పైసలకే భూములు ఇస్తున్నారు. ఒకవైపు భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు గ్రామాలు, పట్టణాల్లో గంజాయి, మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తున్నాయి. గుడి పక్కన, బడి పక్కన, వీధి చివర ఎక్కడపడితే అక్కడ మద్యం, గంజాయి అందుబాటులోకి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో గ్రామస్థాయిలో మహిళా పోలీసులు ఉండటంతో ఇలాంటి ఘటనలపై వెంటనే సమాచారం అందేది. వాటిని అరికట్టేందుకు ఒక వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి, అక్రమ కార్యకలాపాలకు మరింత అవకాశం ఇస్తున్నారు. గతంలో సచివాలయానికి వెళ్తే లంచం లేకుండా పనులు జరిగేవి. వాలంటీర్లు ఇంటికి వచ్చి ప్రజలకు అవసరమైన సేవలు అందించేవారు. ఇప్పుడు కుల ధ్రువీకరణ పత్రం కావాలన్నా, జనన ధ్రువీకరణ పత్రం కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజలు చెబుతున్నారు.

హామీలతో ప్రతి కుటుంబానికి మోసం

ఎన్నికల హామీలతో ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరి ఫొటోలు, సంతకాలతో బాండ్లు ఇచ్చారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అంటూ హామీల వర్షం కురిపించారు. జగన్‌ ఇచ్చే పథకాలన్నీ కొనసాగించడమే కాకుండా, వాటికి మూడింతలు అదనంగా ఇస్తామని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పారు. జూన్‌ 2024 నుంచే తమ హామీల అమలు ప్రారంభమవుతుందని ప్రచారం చేశారు. అమ్మ ఒడి కింద జగన్‌ ఒక కుటుంబానికి రూ.15 వేలు ఇస్తుంటే, చంద్రబాబు మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తలా రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికీ, నలుగురు పిల్లలుంటే నలుగురికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇంట్లో మహిళ కనిపిస్తే నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. ఒక కుటుంబంలో ఎంతమంది అర్హులైన మహిళలు ఉంటే అంతమందికీ ఈ సాయం అందుతుందని ప్రచారం చేశారు. నిరుద్యోగ యువకుడు కనిపిస్తే నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇస్తామని చెప్పారు. ఒక కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు నిరుద్యోగులు ఉన్నా అందరికీ ఈ సాయం అందుతుందని హామీ ఇచ్చారు. రైతుల దగ్గరకు వెళ్లి, జగన్‌ రైతు భరోసా కింద పీఎం కిసాన్‌తో కలిపి రూ.13,500 ఇస్తుంటే, తాము అన్నదాత సుఖీభవ పేరుతో పీఎం కిసాన్‌తో కలిపి రూ.26 వేలు ఇస్తామని చెప్పారు. మన ప్రభుత్వం వైయస్సార్‌ చేయూత కింద మహిళలకు రూ.18,750 చొప్పున సాయం అందిస్తే, చంద్రబాబు మాత్రం 50 ఏళ్లు దాటిన మహిళలకు ఏడాదికి రూ.48 వేల పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. అలా ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రతి కుటుంబ సభ్యుడికీ విడివిడిగా లెక్కలు చెప్పి హామీలు ఇచ్చారు. వాటిపై బాండ్లు రాసిచ్చారు. సంతకాలు పెట్టారు. ప్రమాణాలు చేశారు. ఇప్పుడు ఆ బాండ్లకు విలువ ఏమిటి? ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలకు విలువ ఏమిటి? రాజకీయాల్లో విశ్వసనీయత అంటే ఏమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

డీఎస్సీలో అక్రమాలు. ప్రశ్నిస్తే వేధింపులు

డీఎస్సీ నియామకాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. స్పోర్ట్స్‌ కోటా పేరుతో పరీక్ష లేకుండానే టీచర్‌ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు ఏ స్థాయికి చేరాయో చెప్పడానికి ఇవే ఉదాహరణలు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులతో వేధిస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రెడ్‌ బుక్‌ పాలన సాగిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను పక్కనపెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, బాండ్ల పేరుతో ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోయేలా ప్రచారం చేస్తున్నారు. హామీలన్నీ అమలైపోయాయని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి

ఉత్తరాంధ్ర అభివృద్ధికి మన ప్రభుత్వం చేసిన కృషి అందరికీ తెలిసిందే. దాని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన హయాంలో ఏం చేశామో మీరే ప్రజలకు వివరించగలరు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మూలపేట పోర్టు వరకు, అదానీ డేటా సెంటర్‌ నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాల వరకు ఉత్తరాంధ్రలో మన ప్రభుత్వం చేపట్టిన పనులు కనిపిస్తాయి. విశాఖపట్నంలో ఏకంగా 1.30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు మంజూరు చేశాం. కేజీహెచ్‌ అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులను మెరుగుపరిచేందుకు నాడు–నేడు కార్యక్రమాన్ని అమలు చేశాం. ఎన్నో ఏళ్లుగా ఉద్దానం ప్రాంత ప్రజలను వేధిస్తున్న కిడ్నీ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను తీసుకొచ్చాం. కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో హీర మండలం నుంచి గ్రావిటీ ద్వారా ఉద్దానం వరకు నీరు తీసుకొచ్చాం. ఇందుకోసం రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేశాం. ఇంకా గిరిజన విశ్వవిద్యాలయం, గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల, వైద్య కళాశాలలు వంటి విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేశాం. పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, వైద్య కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు.. ఇలా ఏ రంగాన్ని చూసినా మన ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు కనిపిస్తాయి. అందుకే మన హయాంలో చేసిన మంచి మనకు శ్రీరామరక్షగా ఉంటుంది. దేవుడి దయ, ఆశీస్సులు ఎప్పుడూ మనకు అండగా ఉంటాయి.

ఎన్నికల సక్రమ నిర్వహణ అనుమానమే

విశాఖపట్నంలో మేయర్, కార్పొరేషన్‌ వ్యవహారాల్లో చంద్రబాబు వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలను తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికలు ఎంతవరకు స్వేచ్ఛగా, సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం కలగడం లేదు. అయితే ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీసి, అధికార దుర్వినియోగానికి పాల్పడితే తాత్కాలికంగా ఏదైనా ప్రయోజనం కలగవచ్చేమో కానీ, అది శాశ్వతంగా నిలబడదు.

అందుకు ఇదే ఒక ఉదాహరణ

2019 ఎన్నికలకు ముందు నంద్యాల ఉప ఎన్నికను గుర్తు చేసుకోండి. నా పాదయాత్ర ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఆ ఉప ఎన్నిక జరిగింది. అప్పట్లో అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అందరం చూశాం. ఆ ఉప ఎన్నికలో మన పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత నా పాదయాత్ర జరిగింది. దాదాపు ఒకటిన్నర సంవత్సరానికి జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే నంద్యాలలో 36 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించాం. రాష్ట్రవ్యాప్తంగా కూడా మన పార్టీ ఘనవిజయం సాధించింది. ప్రజాస్వామ్యంలో అధికార దుర్వినియోగం, పోలీసుల సహాయంతో దౌర్జన్యాలు చేయడం ద్వారా తాత్కాలిక ఫలితాలు సాధించవచ్చేమో కానీ, ప్రజల తీర్పును శాశ్వతంగా అడ్డుకోలేరు.

మంచి చేశాం.. దానిపైనే ఆధారపడ్డాం

మన ప్రభుత్వ హయాంలో ఏనాడూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. పోలీసులను ఉపయోగించుకోలేదు. పోలీసుల మీద ఆధారపడి ఎన్నికలు నిర్వహించలేదు. ప్రజలకు మంచి చేయడంపైనే ఆధారపడ్డాం. బటన్‌ నొక్కి నేరుగా ప్రజల ఖాతాల్లో సంక్షేమ సొమ్ము జమ చేశాం. కోవిడ్‌ సమయంలోనూ సాకులు చెప్పకుండా ప్రజలకు అండగా నిలిచాం. అదే చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదు కాబట్టి, మొత్తం పోలీసులపై ఆధారపడుతున్నారు.

విశాఖను దోచి పెడుతున్నారు

గీతం వర్సిటీ. 55 ఎకరాల భూమి. కబ్జా చేశారు. దాని విలువ కనీసం రూ.5 వేల కోట్లు. దాన్ని అడ్డగోలుగా నచ్చిన వారికి, లోకేష్‌ తోడల్లుడికి ఇచ్చేశారు. ఆ స్థాయిలో బరి తెగించారు. విశాఖపట్నంలో 99 పైసలకే భూములు కేటాయించడం, గీతం భూముల వ్యవహారం వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంత అవినీతి ప్రభుత్వం ఇది. అయితే ఇవి ఊర్కే ఎక్కడికి పోవు. తప్పకుండా చుట్టుకుంటాయి. చేసిన పాపాలు, అక్రమాలు ఎక్కడికి పోవు. కచ్చితంగా అన్నింటికీ బాధ్యత వహించాల్సి ఉంటుంది.

కార్యకర్తలకు పార్టీ అండ

స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మీకు అన్ని విధాలా అండగా ఉంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి పార్టీ అగ్రనాయకత్వం వరకు, నా వరకు ప్రతి ఒక్కరూ కార్యకర్తలకు తోడుగా ఉంటాం. ఎన్నికల సమయంలో ఎవరైనా అన్యాయానికి పాల్పడితే, ఆ ఘటనల వివరాలను వెంటనే నమోదు చేయండి. ఏ అధికారి, ఏ పోలీసు అధికారి ఏ విధంగా వ్యవహరించారు? ఎలాంటి అన్యాయం జరిగింది? అనే వివరాలను మర్చిపోకముందే డిజిటల్‌ డైరీలో నమోదు చేయండి. భవిష్యత్తులో వాటిని పరిశీలించి చట్టప్రకారం బాధ్యతను నిర్ధారించేలా చర్యలు తీసుకుంటాం. పోలీసు అధికారులకు ముందుగా విజ్ఞప్తి చేయండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ తీర్పును స్వేచ్ఛగా ఇచ్చేలా సహకరించాల్సిన బాధ్యత పోలీసులదే. పోలీసులు తమ ధర్మాన్ని నిర్వర్తించాలి. వారి టోపీపై ఉన్న సింహాలకు మాత్రమే తలవంచాలి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అన్యాయం చేయకూడదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి ఎవరైనా అన్యాయానికి పాల్పడితే, వారి చర్యలను డిజిటల్‌ డైరీలో నమోదు చేయాలి. మన ప్రభుత్వం వచ్చాక ఆ డిజిటల్‌ డైరీలో నమోదైన అంశాలను పరిశీలించి, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. జగన్‌ 2.0లో కార్యకర్తకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. కార్యకర్తల ప్రయోజనాలకు అండగా పార్టీ నిలుస్తుంది.

విశాఖలో నీటి ఎద్దడి.. ప్రభుత్వ వైఫల్యం

విశాఖపట్నంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు రోజులకు ఒకసారి నీరు సరఫరా అయ్యే పరిస్థితి నెలకొంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించాలి. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తే అదనంగా 75 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ నీటిని గ్రావిటీ ద్వారా విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అందించే వెసులుబాటు కలుగుతుంది. కానీ ప్రాజెక్టు ఎత్తు తగ్గించే నిర్ణయంతో ఆ 75 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని జగన్‌ విమర్శించారు. అలా ఒకవైపు పోలవరంలో అదనపు నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతుంటే, మరోవైపు విశాఖపట్నంలో ప్రజలకు మూడు రోజులకోసారి తాగునీరు అందించే పరిస్థితి నెలకొంది.

మనం మంచి చేశాం.. ప్రజలకు వివరించాలి

మన ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, గ్రామస్థాయి పరిపాలనలో తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు వివరించాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వ పాలనపై మనం లేవనెత్తుతున్న అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. ఎన్నికల హామీల అమలు, భూముల కేటాయింపులు, డీఎస్సీ నియామకాలు, తాగునీటి సమస్య, ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరు వంటి అంశాలపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఆ దిశలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలందరూ సమన్వయంతో పని చేయాలి. చివరగా, పార్టీలో ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి పార్టీ అగ్రనాయకత్వం వరకు అందరూ అండగా ఉంటారని, అలాగే కార్యకర్తల ప్రయోజనాలకు పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని వైయస్‌ జగన్‌ వివరించారు.

Read also: YS Jagan tweet on DSC: ఒక టీచర్‌ పోస్టు.. డీఎస్సీలో ఆరు మలుపులు! సీఎం చంద్రబాబును నిలదీసిన YS జగన్‌
YS Jagan PC on DSC: మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ! తవ్వేకొద్దీ అక్రమాలు.. అడుగడుగునా నకిలీ సర్టిఫికెట్లు: YS జగన్‌ 

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading