AP Medical Colleges PPP: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో అప్పగించే నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పేదలకు ఉచిత వైద్యం అందించే టీచింగ్ ఆస్పత్రులను, వాటికి చెందిన ప్రజా ఆస్తులను పీపీపీ ముసుగులో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎక్స్ వేదికగా ఆరోపించారు. సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ఈ వ్యవహారాన్ని ‘భారీ స్కాం’గా అభివర్ణించారు.
17 మెడికల్ కాలేజీలు.. ఐదు ప్రారంభించాం
తమ ప్రభుత్వ హయాంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని, వాటిలో ఐదింటిని ప్రారంభించి మరో మూడింటిని తరగతులకు సిద్ధం చేశామని జగన్ పేర్కొన్నారు. ఏటా రూ.1,000 కోట్లు కేటాయిస్తే మిగిలిన తొమ్మిది కాలేజీల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయవచ్చని చెప్పారు. ఇప్పటికే కొన్ని పూర్తయి, మరికొన్ని వివిధ దశల్లో ఉన్న కాలేజీలను ప్రభుత్వమే పూర్తి చేయకుండా పీపీపీకి ఎందుకు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు.
ఎకరా రూ.100 లీజు.. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌కు రూ.1,630 కోట్లు
వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఎకరా రూ.100కే లీజుకు ఇవ్వడంతో పాటు, సగానికి పైగా మెడికల్ సీట్లను ప్రైవేటు సంస్థలు విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలను అప్పగించడంతో పాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద రూ.1,630 కోట్లు ఇవ్వనున్నారని పేర్కొన్నారు. వైద్యులు, ప్రొఫెసర్లు, సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వమే జీతాలు చెల్లించే ప్రతిపాదన ఉందని, ఇందుకు ఒక్కో కాలేజీకి నెలకు రూ.5 కోట్లు చొప్పున రెండేళ్లలో రూ.120 కోట్లు ఖర్చవుతాయని లెక్క చెప్పారు.
సగం సీట్లు కన్వీనర్ కోటాలో.. పేదలకు ఉచిత వైద్యం
తమ ప్రభుత్వం రూపొందించిన విధానంలో సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేసి, మిగిలిన సీట్లను ప్రైవేటు కాలేజీల కంటే తక్కువ ఫీజుకే అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశామని జగన్ తెలిపారు. ఫీజుల ద్వారా వచ్చే ఆదాయాన్ని నిర్వహణకు వినియోగించేలా ప్రణాళిక రూపొందించామని, నిధుల కోసం బ్యాంకులతో అనుసంధానం చేశామని చెప్పారు. ప్రొఫెసర్లు, వైద్య, నర్సింగ్ విద్యార్థులు సేవల్లో భాగమయ్యే టీచింగ్ ఆస్పత్రులను ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్స్‌తో అనుసంధానిస్తే గ్రామస్థాయి వరకు ఉచిత మల్టీస్పెషాల్టీ వైద్యం అందించవచ్చన్నారు. ప్రభుత్వ వైద్యసేవలు మెరుగైతే ప్రైవేటు ఆస్పత్రులు కూడా సరసమైన ధరలకు సేవలు అందించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీకి రూ.3 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఆరోపణ
రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని జగన్ విమర్శించారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు బాండ్ల రూపంలో చెల్లింపులు చేసిన తర్వాత కూడా రూ.3 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, దీంతో ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలకు దూరమవుతున్నాయని ఆరోపించారు. తమ హయాంలో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల మందులు అందించామని, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, దూది కూడా కొరతగా ఉన్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా స్పెషలిస్టు వైద్యుల కొరత 61 శాతంగా ఉండగా, జీరో వేకెన్సీ విధానంతో ఏపీలో ఆ ఖాళీలను 4 శాతానికి తగ్గించామని, ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు నిలిచిపోయాయని, విలేజ్ క్లినిక్స్‌తో పాటు 108, 104 సేవలు దెబ్బతిన్నాయని విమర్శించారు.
కోటి సంతకాలతో నిరసన.. అధికారంలోకి వస్తే చర్యలు
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి మంది సంతకాలతో నిరసన తెలిపినా ప్రభుత్వం ముందుకెళ్తోందని జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అరెస్టులకూ వెనుకాడబోమని అన్నారు.
ఇవీ చదవండి: Jagan Pressmeet : వైఎస్ జగన్ సుదీర్ఘ ప్రెస్ మీట్.. రైతులు, ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, లడ్డూ, పరకామణి, చంద్రబాబు కేసులు..
YS Jagan Pressmeet: హే రామ్ సేవ్ ఆంధ్ర.. హే రామ్ సేవ్ డెమొక్రసీ: వైఎస్ జగన్ ప్రెస్‌మీట్‌లో కీలక వ్యాఖ్యలు






