DSC Scam: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సీబీఐ విచారణ డిమాండ్ చేశారు. డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరితే ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. నియామకాలు పారదర్శకంగా జరిగాయని ప్రభుత్వం చెబుతున్నప్పుడు, నిష్పాక్షిక దర్యాప్తుకు అంగీకరించడంలో ఇబ్బంది ఏమిటని నిలదీశారు.
సీబీఐ విచారణ జరపాలి
డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి తప్పులు జరగలేదన్న నమ్మకం ప్రభుత్వానికి ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు ఒప్పుకోవడం లేదని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వమే తనకు తాను ఇచ్చుకునే క్లీన్‌చిట్‌ల కంటే స్వతంత్ర దర్యాప్తు ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాలు లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయని జగన్ అన్నారు. టీచర్ ఉద్యోగాల కోసం యువత ఏళ్ల తరబడి చదివి, లక్షల రూపాయలు ఖర్చు చేస్తారని పేర్కొన్నారు. అలాంటి నియామకాల్లో అభ్యర్థుల కష్టం, ప్రతిభకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండాలని అన్నారు.
విజయవాడ ఘటనలపై స్పందన
సీబీఐ విచారణ కోరుతూ విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి వైఎస్సార్‌సీపీ నాయకులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడం, లాఠీలతో అడ్డుకోవడం, అరెస్టులు చేయడం వంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ర్యాలీలు నిర్వహించే హక్కు లేదా అని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. డీఎస్సీ వ్యవహారంపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రతిపక్ష గొంతును అణిచివేయడం ద్వారా సమస్యను పరిష్కరించలేరని అన్నారు.
లోకేశ్ రాజీనామాకు డిమాండ్
డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు. పోలీసులను అడ్డుపెట్టుకుని డీఎస్సీ వ్యవహారాన్ని దాచలేరని, ప్రతిపక్ష గొంతును అణిచివేసి వాస్తవాలను దాచలేరని జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలని, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత ఉండాలని, అప్పటివరకు డీఎస్సీ బాధితుల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Read also: YS Jagan tweet on DSC: ఒక టీచర్ పోస్టు.. డీఎస్సీలో ఆరు మలుపులు! సీఎం చంద్రబాబును నిలదీసిన YS జగన్
YS Jagan PC on DSC: మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ! తవ్వేకొద్దీ అక్రమాలు.. అడుగడుగునా నకిలీ సర్టిఫికెట్లు: YS జగన్
YS Jagan Padayatra: వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి పాదయాత్ర: వైఎస్ జగన్






