YS Jagan Padayatra: వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి తాను పాదయాత్ర ప్రారంభిస్తానని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పర్చూరు నియోజకవర్గం మీదుగా కూడా తన పాదయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కార్యకర్తల ఎన్నికలని, అవి ఎప్పుడు, ఎలా జరిగినా పార్టీ శ్రేణులు గట్టిగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగం, పోలీసుల జులుంను ఎదుర్కొంటూ ప్రజలకు అండగా నిలబడాలని స్పష్టం చేశారు. జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామమని, అందుకు ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.
బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ విభాగాల బాధ్యులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. పర్చూరు నియోజకవర్గానికి చెందిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలికిన ఆయన.. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో తీసుకొచ్చిన మార్పులను వివరించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రసంగించారు.
ప్రతి ఇంట్లో రెండు పాలనలపై చర్చ
వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనకు, చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనకు మధ్య ఉన్న తేడా ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశంగా మారిందని వైఎస్ జగన్ అన్నారు. చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయాయని, కన్నుమూసి తెరిచేలోగా మరో ఏడాది కూడా పూర్తవుతుందని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని, పర్చూరు మీదుగా కూడా యాత్ర సాగుతుందని ప్రకటించారు. తమ ఐదేళ్ల పాలనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని, “ఫలానా వ్యక్తి మా నాయకుడు.. ఫలానా పార్టీ మా పార్టీ” అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి కల్పించామన్నారు. ప్రతి కార్యకర్త పేదవాడి ఇంటికైనా, రైతన్న ఇంటికైనా, అక్కచెల్లెమ్మల ఇంటికైనా చిరునవ్వుతో వెళ్లి తమ ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోగలుగుతున్నారని పేర్కొన్నారు.
మ్యానిఫెస్టోకు అర్థం చెప్పిన ప్రభుత్వం
రాష్ట్ర, దేశ రాజకీయ చరిత్రలో మ్యానిఫెస్టోకు అర్థం తీసుకొచ్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమేనని జగన్ అన్నారు. సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలు విడుదల చేసి, అధికారంలోకి వచ్చాక వాటిని చెత్తబుట్టలో పడేస్తాయని విమర్శించారు. చంద్రబాబు వంటి నేతలు ఏకంగా ప్రతి ఇంటికీ బాండ్లు పంపి, ఎన్నికలు ముగిశాక మ్యానిఫెస్టోను, అందులోని హామీలను గాలికి వదిలేస్తారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ మాత్రం మ్యానిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి అందులోని హామీలను 99 శాతం అమలు చేసిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, దాన్ని నిలబెట్టుకోవాలనే తపనతో తమ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే ఏ పథకాన్ని ఏ నెలలో అమలు చేస్తామో సంక్షేమ క్యాలెండర్ ద్వారా ముందుగానే ప్రకటించామని గుర్తుచేశారు. ప్రకటించిన నెలలో పథకాన్ని తప్పకుండా అమలు చేస్తూ బటన్ నొక్కిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ మాత్రమేనన్నారు. గతంలోగానీ, ప్రస్తుతం గానీ అలాంటి పాలన లేదని.. అది ఒక్క వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైందని చెప్పారు.
గడప వద్దకే పారదర్శక పాలన
రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు సంక్షేమ పథకాలను లంచాలు, వివక్షకు తావులేకుండా అందించవచ్చని తమ ప్రభుత్వం నిరూపించిందని జగన్ తెలిపారు. ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి, ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమించి ప్రభుత్వ సేవలను ఇంటి గడప వద్దకే తీసుకెళ్లామన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో పది మంది ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలను పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేశామన్నారు. వ్యవస్థలో కనీవినీ ఎరుగని మార్పులు వైఎస్సార్‌సీపీ పాలనలోనే జరిగాయని చెప్పారు.
ప్రభుత్వ బడులకు కొత్త రూపు
ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడగలవని తమ ప్రభుత్వం నిరూపించిందని వైఎస్ జగన్ అన్నారు. ఇంగ్లిష్ మీడియం, సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ను ఒక పీరియడ్‌గా ప్రవేశపెట్టామని, నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చామని చెప్పారు. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన అందించేందుకు డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. ఒక పేజీ తెలుగులో, మరో పేజీ ఇంగ్లిష్‌లో ఉండే బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు అందించామని చెప్పారు. ఎనిమిదో తరగతి విద్యార్థుల చేతుల్లో ట్యాబ్‌లు పెట్టిన ప్రభుత్వం తమదేనన్నారు. ‘జగనన్న గోరుముద్ద’ ద్వారా పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని వివరించారు. విద్యార్థులు ఏం తింటున్నారు? ఆ ఆహారం బాగుందా? లేదా? అని కూడా ముఖ్యమంత్రి స్థాయిలో పట్టించుకున్న పాలన తమదని పేర్కొన్నారు.
పేదల వైద్యానికి రూ.25 లక్షల భరోసా
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాకముందు ఆరోగ్యశ్రీ పరిధిలో కేవలం వెయ్యి ప్రొసీజర్లు ఉంటే, తమ ప్రభుత్వం వాటిని 3,300కు పెంచిందని జగన్ తెలిపారు. పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీని విస్తరించామన్నారు. నాడు–నేడుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను మార్చడంతోపాటు డబ్ల్యూహెచ్‌వో–జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందులను అందుబాటులో ఉంచామని చెప్పారు. జీరో వెకెన్సీ విధానంతో వైద్యులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేశామన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరత దాదాపు 60 శాతంగా ఉంటే, రాష్ట్రంలో దాన్ని నాలుగు శాతానికి పరిమితం చేశామని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టామని గుర్తుచేశారు.
గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్
ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్‌ను ఏర్పాటు చేశామని, ఆరు నెలలకు ఒకసారి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని నిర్వహించామని జగన్ తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా వైద్యులను గ్రామాలకు పంపామని చెప్పారు. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. వారిలో ఒకరు పీహెచ్‌సీలో సేవలు అందిస్తే, మరొకరు 104 వాహనంలో తనకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి వైద్యం అందించే వ్యవస్థను రూపొందించామని వివరించారు. ఒక్కో వైద్యుడికి నాలుగైదు గ్రామాలను కేటాయించి, ఆయా గ్రామాల్లోని రోగులను పేరుపెట్టి పిలిచే స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేశామన్నారు.
రైతన్నకు అడుగడుగునా అండ
పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర రాకపోయినా పట్టించుకునే నాథుడే లేడనే పరిస్థితిని మార్చామని జగన్ చెప్పారు. రైతును చేయిపట్టుకుని నడిపించాలనే తపనతో ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆర్బీకేల్లో వ్యవసాయ పట్టభద్రులను అగ్రికల్చర్ అసిస్టెంట్లుగా నియమించామని తెలిపారు. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ పరిధిలోకి తీసుకొచ్చి, పంటల గిట్టుబాటు ధరలను ఆర్బీకేల్లో ప్రదర్శించామని చెప్పారు. ప్రకటించిన ధర రైతుకు లభించకపోతే ఆర్బీకే అసిస్టెంట్ ‘కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్–సీఎం యాప్’ ద్వారా సమాచారం అందించే వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. వెంటనే జాయింట్ కలెక్టర్, మార్క్‌ఫెడ్ అధికారులు జోక్యం చేసుకుని కొనుగోళ్లు చేపట్టడం ద్వారా మార్కెట్లో పోటీని సృష్టించి, రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా చేశామని వివరించారు. ఇటువంటి వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదన్నారు.
మూడింతలు ఇస్తామంటూ మోసం
తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగించడంతోపాటు వాటికంటే మూడింతలు ఎక్కువ ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రచారం చేశారని జగన్ విమర్శించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిత్రాలు, సంతకాలతో కూడిన బాండ్లను ప్రతి ఇంటికీ పంపారని చెప్పారు. అమ్మ ఒడి కింద జగన్ ఎంత మంది పిల్లలున్నా తల్లికి రూ.15 వేలు మాత్రమే ఇస్తున్నాడని, తాము అధికారంలోకి వస్తే ప్రతి బిడ్డకూ రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18 వేలు, రైతులకు రూ.26 వేలు, 50 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.48 వేలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇస్తామని హామీలు ఇచ్చారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అమలు చేస్తున్న పథకాలన్నింటినీ కొనసాగిస్తూ, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో అదనంగా ఈ ప్రయోజనాలు కల్పిస్తామని ప్రజలను నమ్మించారని చెప్పారు. చివరకు వాలంటీర్లను కూడా మోసం చేశారని విమర్శించారు.
‘జగన్ మోసం చేయలేదు’ అని ప్రజలే అంటున్నారు
ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఈ హామీల గురించే చర్చ జరుగుతోందని వైఎస్ జగన్ అన్నారు. “వైఎస్సార్‌సీపీ మోసం చేయలేదు.. చెప్పిన మాటను చెప్పినట్టుగా అమలు చేసింది. చంద్రబాబును నమ్మి మోసపోయాం” అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో తమ బతుకులు బస్టాండ్ అయ్యాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారని చెప్పారు.
ఎన్నికల వాయిదాకే బీసీ రిజర్వేషన్ల డ్రామా
స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయో లేదో తనకు తెలియదని జగన్ అన్నారు. ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉంటే, కోర్టులో నిలబడదని తెలిసీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో జీవో ఇచ్చేవారు కాదన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇస్తే కోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు. ఆ తర్వాత రిజర్వేషన్లతో సంబంధం లేకుండా అంతకంటే ఎక్కువ పదవులను బీసీలకు ఇచ్చామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోనూ ఈ అంశంపై కోర్టు తీర్పులు ఉన్నాయని చెప్పారు. విషయం తెలిసీ మళ్లీ అదే తరహా జీవో ఇవ్వడం వెనుక ఎన్నికలను కోర్టు కేసుల పేరుతో వాయిదా వేయించాలనే ఉద్దేశం కనిపిస్తోందని ఆరోపించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ–సర్ ప్రక్రియలో 44 లక్షల ఓట్లు లేవని ప్రభుత్వమే చెబుతోందన్నారు. అలాంటప్పుడు పాత ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే దాన్ని ఎవరు అంగీకరిస్తారని ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నీ ఎన్నికలు నిర్వహించడానికి కాకుండా, వాయిదా వేయడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.
రోజుకో డ్రామా.. రోజుకో డైవర్షన్
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలు స్వేచ్ఛగా, సాఫీగా జరుగుతాయని తాను భావించడం లేదని వైఎస్ జగన్ అన్నారు. తనను ప్రశ్నించే ఏ గొంతునూ వినేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి దిగజారుడు రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో రోజుకో డ్రామా, రోజుకో నటన, రోజుకో డైవర్షన్‌తోపాటు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని చూస్తున్నామని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు సాఫీగా జరుగుతాయనే నమ్మకం లేదన్నారు.
ఎన్నికలు ఎలా జరిగినా గట్టిగా నిలబడాలి
ఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు వైఎస్సార్‌సీపీ తోడుగా ఉంటుందనే భరోసా కల్పించాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. ఎన్నికలు సాఫీగా జరిగితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సునాయాసంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు సాఫీగా జరగనివ్వకపోయినా ప్రజల కోసం పోటీలో గట్టిగా నిలబడాలని చెప్పారు. ఒక ఎంపీటీసీ, సర్పంచ్ లేదా వార్డు సభ్యుడిని ఓడించేందుకు కూడా ప్రభుత్వం పోలీసులను, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే.. అటువంటి చిన్నస్థాయి కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలా అండగా నిలవాలని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రతి నియోజకవర్గ సమన్వయకర్తకు చెబుతున్నానన్నారు. “ఇవి కార్యకర్తల ఎన్నికలు. ప్రజలకు కార్యకర్తలు తోడుగా నిలబడతారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందనే సంకేతాన్ని ఈ ఎన్నికల ద్వారా ఇవ్వాలి” అని దిశానిర్దేశం చేశారు.
ప్రతి కార్యకర్త రేపటి శ్రీకృష్ణుడు
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే కార్యకర్తే రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడిగా మారాలని జగన్ అన్నారు. ఒక చిన్న కార్యకర్తను ఓడించడానికి చంద్రబాబు పోలీసులను, అధికార వ్యవస్థను దుర్వినియోగం చేశారనే కసి అతడిలో పెరగాలని చెప్పారు. ఆ కసి రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రతిఫలించాలని ఆకాంక్షించారు. అందుకోసం ప్రతి కార్యకర్తకు పార్టీ అన్ని విధాలా తోడుగా, అండగా నిలవాలని నేతలకు సూచించారు.
నంద్యాల తర్వాత ఏం జరిగిందో గుర్తుంచుకోండి
దౌర్జన్యంతో పాలకులు ఎల్లకాలం రాజ్యం చేయలేరని జగన్ స్పష్టం చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో, తన పాదయాత్రకు ముందు జరిగిన నంద్యాల ఉప ఎన్నికను గుర్తుచేశారు. ఆ ఎన్నికలో పోలీసులు, అధికార యంత్రాంగాన్ని విపరీతంగా దుర్వినియోగం చేసి వైఎస్సార్‌సీపీని దాదాపు 34 వేల ఓట్ల తేడాతో ఓడించారని చెప్పారు. వైఎస్సార్‌సీపీని దెబ్బతీయడానికి తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. ఎన్ని కుయుక్తులు పన్నినా, ఆ తర్వాత జరిగిన తన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. అనంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజా సునామీ వచ్చిందన్నారు. అదే నంద్యాల స్థానాన్ని వైఎస్సార్‌సీపీ దాదాపు 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుచుకుందని గుర్తుచేశారు.
వైఎస్సార్‌సీపీ నుంచి తీసుకున్న 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల సంఖ్యకు సరిపడేలా చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో 23 ఎమ్మెల్యే, మూడు ఎంపీ స్థానాలే దక్కాయని చెప్పారు. పార్టీ మారిన వారిలో ఒకరు మినహా మిగిలిన వారంతా ఓడిపోయారని పేర్కొన్నారు. పైనుంచి దేవుడు అన్నీ చూస్తాడని వ్యాఖ్యానించారు.
మంచి చేసినప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు
పాలకుడు ప్రజలకు మంచి చేసి, తాను చేసిన మంచిని చూపిస్తూ ఓటు అడిగే నిబద్ధత, చిత్తశుద్ధి కలిగి ఉండాలని వైఎస్ జగన్ అన్నారు. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడని, ప్రజలు తోడుగా నిలబడతారని చెప్పారు. అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసం చేయడం, దౌర్జన్యాలకు పాల్పడటం, సమస్యలను పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ రాజకీయాలు చేయడాన్ని దేవుడు, ప్రజలు హర్షించరని స్పష్టం చేశారు. అధికారం ఎల్లకాలం ఎవరికీ శాశ్వతం కాదని, తమ సమయం వచ్చినప్పుడు ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.
రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పర్చూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలంతా ప్రజలకు అండగా నిలబడి పోరాడాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
Read also: YS Jagan tweet: ఉద్యోగాలు అడిగితే కేసులా?.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్ జగన్ ఫైర్
YS Jagan on Veligonda: వెలిగొండపై క్రెడిట్ వార్.. చంద్రబాబుపై జగన్ సంచలన ట్వీట్, ప్రాజెక్టు చరిత్రను గుర్తు చేసిన వైసీపీ అధినేత
YS Jagan PC: కరువుతో రైతు విలవిల.. బీసీలకు వెన్నుపోటు.. రాష్ట్రంలో గంజాయి మాఫియా: ప్రెస్ మీట్లో వైఎస్ జగన్






