గురువారం, 19 నవంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

YS Jagan: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌ ప్రశ్నలు.. ఒకే ఏడాదికి మూడు లెక్కల్లో ఏది నిజం?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 18 నవంబర్ 2026

YS Jagan: ఏపీలో 2024–25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఎంత చెల్లించారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. విద్యాశాఖ అసెంబ్లీకి ఇచ్చిన సమాధానానికి, ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్న మొత్తానికి పొంతన లేదని ఎక్స్‌ వేదికగా విమర్శించారు. కాగ్‌ పత్రాల్లో మరో మొత్తం ఉందంటూ మూడు లెక్కలనూ ప్రస్తావించారు. ఏ లెక్క సరైనదో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ విద్యార్థులకు వివరించాలని డిమాండ్‌ చేశారు.

2024–25లో చెల్లించింది ఎంత?

2024–25 విద్యా సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ప్రభుత్వం ఇప్పుడు చెబుతోందని జగన్‌ పేర్కొన్నారు. అదే ఏడాదికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు ఆగస్టు 18న విద్యాశాఖ అసెంబ్లీకి రాతపూర్వక సమాధానం ఇచ్చిందన్నారు. కాగ్‌ లెక్కల్లో ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లుగా ఉందని తెలిపారు. “ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్‌ పత్రాల్లో ఇంకో లెక్కా?” అని ప్రశ్నించారు.

రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు?

2025–26కు రాష్ట్ర బడ్జెట్‌ సవరించిన అంచనా రూ.1,200 కోట్లు కాగా, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రభుత్వం ప్రకటించిందని జగన్‌ పేర్కొన్నారు. అంచనాకు మించి చెల్లించినట్లు చెబుతున్న రూ.465 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగారు. 2026–27లోనూ డిసెంబర్‌ వరకు మూడు త్రైమాసికాలకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని ప్రభుత్వం చెబుతోందన్నారు. మూడో త్రైమాసికం ముగియకముందే, ఉన్నత విద్యలో ప్రవేశాలు కొనసాగుతుండగానే లబ్ధిదారుల సంఖ్యను ఎలా ఖరారు చేశారని ప్రశ్నించారు.

ఎన్నికల కోడ్‌తో ఒక్క త్రైమాసికం చెల్లింపులే నిలిచాయన్న జగన్‌

2023–24లో మొదటి మూడు త్రైమాసికాల ఫీజులు తమ ప్రభుత్వమే చెల్లించిందని జగన్‌ తెలిపారు. 2024 మార్చి 16న ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో జనవరి–మార్చి విడత మాత్రమే పెండింగ్‌లో పడిందన్నారు. 2019లో టీడీపీ ప్రభుత్వం వదిలివెళ్లిన సుమారు రూ.2,000 కోట్ల ఫీజు బకాయిలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించిందని పేర్కొన్నారు. 2017–18, 2018–19 నాటి బకాయిల గురించి 2026 ఫిబ్రవరి 11న ప్రస్తుత ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చిందని గుర్తుచేశారు.

విద్యా దీవెన, వసతి దీవెనపై జగన్‌ చెప్పిన రూ.9,600 కోట్ల లెక్క ఇదీ

2024 జనవరి–మార్చి విడత నుంచి 2027 మార్చి వరకు 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి సుమారు రూ.700 కోట్ల చొప్పున విద్యా దీవెనకు రూ.9,100 కోట్లు అవసరమని జగన్‌ లెక్కించారు. వసతి దీవెన కింద 2024, 2025, 2026 ఏప్రిల్‌ విడతలకు ఏటా రూ.1,100 కోట్ల చొప్పున మరో రూ.3,300 కోట్లు ఇవ్వాలన్నారు. ఆయన అంచనా ప్రకారం ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి రెండు పథకాలకు కలిపి అవసరమైన మొత్తం రూ.12,400 కోట్లు. ఇప్పటివరకు చెల్లింపులుగా చూపిన సుమారు రూ.2,800 కోట్లు తీసేస్తే మరో రూ.9,600 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలని ప్రశ్నిస్తూ, రెండు పథకాల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి: YS Jagan: ఏపీలో విద్యుత్‌ వినియోగం తగ్గింది.. నిరుద్యోగంలో రెండో స్థానానికి చేరింది: వైఎస్‌ జగన్‌
AP Medical Colleges PPP: ఏపీ మెడికల్ కాలేజీల పీపీపీపై జగన్‌ ఫైర్‌.. ఎకరా రూ.100కే లీజు ఎందుకని ప్రశ్న
YS Jagan Pressmeet: హే రామ్‌ సేవ్‌ ఆంధ్ర.. హే రామ్‌ సేవ్‌ డెమొక్రసీ: వైఎస్ జగన్ ప్రెస్‌మీట్‌లో కీలక వ్యాఖ్యలు

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.