YS Jagan Pressmeet: రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా స్థానిక ఎన్నికల్లో ప్రతి దశలోనూ అంతులేని అక్రమాలు చేసిన సీఎం చంద్రబాబు ఈ ఎన్నికల్లో గెల్చినా తాను ఓడినట్లే అని.. అదే తాము ఓడినా ప్రజల మనసులో గెల్చామని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు హైజాక్ చేశారని, ఈ ప్రక్రియలో ప్రభుత్వం. పోలీసులు, ఎస్‌ఈసీ కుమ్మక్కయ్యారని.. ఇలా రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఎక్కడా జరిగి ఉండదని ఆయన గుర్తు చేశారు.
ఎన్నికల్లో ప్రతి దశలోనూ యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారన్న వైయస్ జగన్.. నామినేషన్ల రిగ్గింగ్. నామినేషన్ల స్క్రుటినీ రిగ్గింగ్. పోలింగ్ బూత్‌ల రిగ్గింగ్. పోలింగ్ సైక్లింగ్ రిగ్గింగ్. పోలింగ్ పర్సంటేజ్ రిగ్గింగ్. రాత్రిపూట బ్యాలెట్ బాక్స్‌ల రిగ్గింగ్. ఎక్కడైనా తమ పార్టీ వాళ్లు గెలిస్తే ఫలితాల్లోనూ రిగ్గింగ్ చేశారని వెల్లడించారు. ఇన్ని అక్రమాలతో గెల్చిన చంద్రబాబు గొప్పగా మాటలు చెబుతుంటే, వాటిని భుజాన మోస్తూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని ఆక్షేపించారు.
తమ హయాంలో ‘సేఫ్ ఆంధ్రా’ అనే పరిస్థితి ఉండగా, ఇప్పుడు ‘సేవ్ ఆంధ్రా’ అంటున్న పరిస్థితి వచ్చిందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని, రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు ‘దక్షిణాది బీహార్’ (సౌత్ బీహార్)లా మార్చారని జగన్ అన్నారు ఇంకా తన స్వార్థం కోసం దారుణంగా దిగజారిన చంద్రబాబు రాష్ట్ర పరువుతో పాటు, ప్రజాస్వామ్యాన్ని ఫణంగా పెట్టారని.. ఇది కేవలం ఎన్నికల ప్రక్రియను ఖూనీ చేయడమే కాకుండా, ప్రజల ఓటు హక్కు, వారు ఎన్నికల్లో పోటీ చేసే హక్కులకూ భంగం కలిగించడమే అని చెప్పారు. అంతే కాకుండా ఒక వ్యవస్థీకృతంగా ప్రజాస్వామ్య వ్యవస్థనూ ఖూనీ చేయడమే అన్న ఆయన, ఇది చట్ట ప్రకారం హేయమైన నేరం అని ధ్వజమెత్తారు.
అన్నీ ఎదుర్కొని నిలబడిన పార్టీ నాయకులు, కార్యకర్తలు
వారందరికీ సెల్యూట్ చెప్పిన శ్రీ వైయస్ జగన్, అన్యాయం జరిగితే ప్రశ్నించడం, ఫిర్యాదు చేయడమూ నేరమా? అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినా కేసులు పెడతారా? అని నిలదీసిన ఆయన, కేసులతో తమను అడ్డుకోలేరని, అన్నీ çసమర్థంగా ఎదుర్కొంటామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్ జగన్ తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో జగన్ ఇంకా ఏమేం మాట్లాడారంటే..:
ఎన్నికల సూత్రమే ఏకంగా హైజాక్ అసలు ఇవి ఎలక్షన్లా? లేక సెలక్షన్లా?:
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ అత్యంత దారుణం. ప్రతి చోటా యథేచ్ఛగా అధికార దుర్వినియోగం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ ఎన్నికల ప్రక్రియపై ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర చరిత్రలోనే కాదు. దేశ చరిత్రలోనే ఇలా ఎప్పుడూ జరిగి ఉండదు. చంద్రబాబు జరిపించిన ఈ ఎన్నికలను అసలు ఎన్నికలు అంటారా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న హక్కు. స్వేచ్ఛాయుత ఎన్నికలు. ఈ సూత్రాన్నే మొత్తంగా హైజాక్ చేసిన ఎన్నికలు ఇవి. ఇలాంటి ఎన్నికలను నిజంగా ఎన్నికలు అనగలమా? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. పూర్వం శకుని మాయా పాచికల గురించి విన్నాం. వాటి వల్ల ఏకంగా కురుక్షేత్ర యద్ధం జరిగింది. ఈరోజు కూడా శకుని మాయ పాచికల మాదిరిగానే.. అధికారం, రౌడీయిజమ్‌తో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, జరిగే వాటిని ఎన్నికలు అంటారా? అసలు ఇవి ఎన్నికలా? లేక సెలక్షన్సా?.
ప్రజాస్వామ్యం ఖూనీ:
ఇదే చంద్రబాబునాయుడుగారిని అడుగుతున్నా. ఇలా ఎన్నికలు జరిపించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రాబోయే తరాలకు ఒక చెడు సంప్రదాయం మొదలుపెట్టిన దయనీయ స్థితికి చంద్రబాబు చేరాడు. ఎందుకంటే, ఎన్నికల ముందు సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్ అన్నాడు. ఇంటింటికీ బాండ్లు పంపాడు. జూన్, 2024 నుంచి ఆ డబ్బులన్నీ మీకు వస్తాయని చెప్పాడు. కానీ, అధికారంలోకి వచ్చాక అవన్నీ మోసాలుగా మారాయి. చంద్రబాబు అలా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు ఆ బాండ్లు చూపి, ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో చంద్రబాబునాయుడు నేరుగా ఎన్నికలకు వెళ్లడం లేదు. అందుకే ఎన్నికలను హైజాక్ చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు. ఒకసారి గమనించమని కోరుతున్నా.
స్థానిక ఎన్నికల హైజాక్. క్రమం ఇలా:
చంద్రబాబు ఏ విధంగా మొత్తం ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేశారనేది చూస్తే.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే, రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి, బెదిరించడం, బైండోవర్ చేశారు. అందుకు పోలీసులను వాడుకున్నారు. టీడీపీ గుండాలతో పోలీసులు కలిసిపోయి, వారితో కుమ్మక్కై, మా అభ్యర్థులను అసలు నామినేషన్లు వేయనివ్వలేదు. ఆ తర్వాత కూడా స్క్రుటినీ సమయంలో ఆర్వోలు నామినేషన్లలో పత్రాలు మాయం చేయడం, లేని కారణాలు చూపడం, చివరకు ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు తిరస్కరించారు.
ఆ తర్వాత బలవంతపు ఉపసంహరణలు..
సీఎం, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, అధికారులు, ఆర్వోలు అంతా ఒక మాఫియా ముఠాగా మారి, మొత్తం ఎన్నికలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) కూడా సీఎం తొత్తుగా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన రిఫరీ పాత్ర పూర్తిగా మర్చిపోయారు. ఇవన్నీ చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు సంస్కరణలు ఎంత అవసరం అన్నది తేటతెల్లం అవుతుంది.
వైయస్సార్‌సీపీ పై దౌర్జన్యాల పర్వం.
కాళ్లు చేతులు కట్టేసి పోటీలోకి దిగమన్నారు:
ఇవి పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు. రాష్ట్రంలో మాది మాత్రమే ఏకైక ప్రతిపక్షం. అయినా మాకు ఎన్నికల్లో స్వేచ్ఛగా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. మున్సిపాలిటీల్లో 17 చోట్ల ఛైర్మన్ పదవులకు మా పార్టీ నుంచి నామినేషన్లు వేయనివ్వలేదు. మరో 5 చోట్ల, స్క్రుటినీలో మా అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. అంటే 22 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్ల పర్వంలోనే పోటీ లేకుండా చేశారు. ఇలాంటి ప్రక్రియ ఎక్కడా జరిగి ఉండదు. ఎమ్మెల్యేలు, ఎంపీల ఎన్నికల్లో అయినా ఈ స్థాయిలో ఇన్ని తిరస్కరణలు ఉంటాయా?. కానీ, ఇక్కడ నామినేషన్ల పర్వంలోనే ఏకంగా 22 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పదవులకు పోటీ లేకుండా చేశారు. ఇంకా కొన్ని చోట్ల మా పార్టీ నుంచి అందరు అభ్యర్థులు పోటీలో లేకుండా చేశారు. కేవలం కొందరే ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పోటీలో ఉండేలా చేశారు. అంటే వారికి కూడా కాళ్లు, చేతులు కట్టి పోటీలోకి దిగమన్నారు. మా పులివెందులలోనే 40 వార్డుల్లో 20 వార్డుల్లో మాత్రమే పోటీ ఉండేలా చేశారు. చివరకు ఇంత తీవ్రంగా కాళ్లు చేతులు కట్టేసి, పోటీ జరిగేలా చేసిన తర్వాత కూడా పోలింగ్ రోజున, మా పార్టీ ఏజెంట్లను బూత్‌ల్లో కూర్చోనివ్వలేదు. చివరకు పోలీసులు కూడా కుమ్మక్కై, మా పార్టీ ఏజెంట్లను రాకుండా చేసి, రిగ్గింగ్ చేశారు.
ప్రస్తుత పరిషత్ ఎన్నికల్లో పరిస్థితి చూస్తే..:
ఇక ఇప్పుడు (గురువారం) జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా 84 చోట్ల జడ్పీటీసీ ఎన్నికల్లో మేము పోటీలో లేకుండా చేశారు. అంటే నామినేషన్లు వేయనివ్వక పోవడమో.. ఒకవేళ వేసినా స్క్రుటినీలో వాటిని తిరస్కరించడమో, బలవంతంగా విత్‌డ్రా చేయించడమో చేశారు. మరో 2,109 ఎంపీటీసీ స్థానాల్లో కూడా నామినేషన్ల దశలోనే పోటీ లేకుండా చేశారు. నిన్న, ఈరోజు కూడా మా పార్టీ అభ్యర్థులను అరెస్టు చేశారు. పోలింగ్ ఏజెంట్లను బూత్‌ల్లోకి పోకుండా పోలీసులే అడ్డుకున్నారు. అసలు పార్టీ గుర్తుతో జరిగే ఈ ఎన్నికల్లో ఏకైక ప్రతిపక్షం పోటీలో లేకుండా చేసినప్పుడు, వీటిని ఎన్నికలు అంటారా? నేరుగా ఎంపికలు అనొచ్చు కదా?.
సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు:
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను చూసిన సుప్రీంకోర్టు, ఈ వ్యవహారంలో కలగ జేసుకుని ప్రభుత్వం, ఎస్‌ఈసీ, పోలీసులకు చీవాట్లు పెట్టింది. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు.. ఇలా అన్ని చోట్లా సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశించింది. కానీ, ఆ ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 11,378 పోలింగ్ కేంద్రాలు ఉంటే వాటిలో కేవలం 5,737 కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలు పెట్టారు. వాటిలో ఎన్ని పని చేస్తున్నాయో కూడా తెలియదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 31,460 కేంద్రాలు ఉంటే, వాటిలో కూడా కేవలం 16,064 కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలు అమర్చారు. మరి వాటిలోనూ ఎన్ని పని చేస్తున్నాయో తెలియదు. అలా యథేచ్ఛగా సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం పట్టించుకోవడం లేదు. ఆ ఆదేశాలు పాటించడం ఎస్‌ఈసీ డ్యూటీ కాదా? అవన్నీ పూర్తి చేశాకే, ఎన్నికలు నిర్వహించాలి కదా?. కానీ, ఎస్‌ఈసీ మాత్రం ఆ పని చేయడం లేదు.
యథేచ్ఛగా రిగ్గింగ్‌ల పర్వం:
స్థానిక ఎన్నికల్లో ప్రతి దశలోనూ యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారు. చేస్తున్నారు. తొలుత నామినేషన్ల రిగ్గింగ్. ఇక ఆ తర్వాత వరసగా నామినేషన్ల స్క్రుటినీ రిగ్గింగ్.. పోలింగ్ బూత్‌ల రిగ్గింగ్. పోలింగ్ సైక్లింగ్ రిగ్గింగ్.. పోలింగ్ పర్సంటేజ్ రిగ్గింగ్.. రాత్రిపూట బ్యాలెట్ బాక్స్‌ల రిగ్గింగ్.. విశాఖపట్నంలో ముందు బ్యాలెట్ బాక్సులు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌కు సీల్ వేయలేదు. మా పార్టీ వారు గొడవ చేశాకే స్ట్రాంగ్ రూమ్‌లు సీల్ వేశారు. ఇవన్నీ దాటుకుని మా వాళ్లు ఎక్కడైనా గెలిస్తే, ఆ ఫలితాలు కూడా రిగ్గింగ్ చేశారు. ఇలా ఇంత అన్యాయమైన పద్ధతులతో, ఎన్నికలు రిగ్గింగ్ చేసిన గెలుపును చంద్రబాబు గొప్పగా చెప్పుకోవడం, దాన్ని ఎల్లో మీడియా ఎత్తుకోవడం. జోరుగా ప్రచారం చేయడం. ఇంత కంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? గమనించండి.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి?
ఒక్కసారి చూడండి:
ఇక ఇప్పుడు ఈరోజు (గురువారం) ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏం జరుగుతోంది? ఒక్కసారి చూడండి.
(అంటూ ఎన్నికల్లో అధికార పార్టీ, పోలీసుల దమనకాండ వీడియోలు, ఫోటోలు పీపీటీలో చూపారు)
ఇవీ ఆ దారుణ ఘటనల క్రమం:
– అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం సోదనపల్లిలో మా పార్టీ ఏజెంట్లను బయటకు లాగేసిన టీడీపీ గుండాలు రిగ్గింగ్ చేశారు
– ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో మా పార్టీ ఏజెంట్లను సీఐ పోలీస్ స్టేషన్‌లో బంధించారు.
– అదే ఉరవకొండ నియోజకవర్గం మరుట్లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తుంటే, సీఐ రాజు కాపలా కాశాడు.
– కనిగిరి నియోజకవర్గం, వెలిగండ్ల మండలంలో మా పార్టీ ఏజెంట్లను పోలీసులు లాగి పడేశారు.
– కర్నూలు రూరల్ మండలం, సుంకేశుల గ్రామంలో మా పార్టీ ఏజెంట్ల ఫామ్‌లు చింపిన టీడీపీ గుండాలు దాడి చేశారు.
– తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గం, సాయినగర్‌లో టీడీపీ తీసుకొచ్చిన దొంగ ఓటర్లను మా పార్టీ నాయకులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
– అన్నమయ్య జిల్లా పీలేరులో అందరూ చూస్తుండగానే రిగ్గింగ్.
– పులివెందుల మండలం, అచ్చివెల్లిలో ఓటు వేసేందుకు వెళ్తున్న గ్రామస్తులపై పోలీసుల లాఠీఛార్జ్.
– పులివెందుల నియోజకవర్గం వేములలో ఓటు వేయకుండా స్లిప్‌లు ఇచ్చి వెళ్లిపోమని టీడీపీ గుండాలు, పోలీసులు బెదిరించారు.
– పులివెందుల నియోజకవర్గం లింగాలలో మా పార్టీ వారిపై దాడి చేయడానికి రాడ్లు, కర్రలు బస్సుల్లో తెచ్చారు. టీడీపీ గుండాలు.
– పులివెందుల నియోజకవర్గం, వేముల జడ్పీ హైస్కూల్ పోలింగ్ బూత్ వద్ద మా పార్టీ ఏజెంట్లను పోలీసులే అడ్డుకుని వెళ్లగొట్టారు.
– పులివెందుల నియోజకవర్గం మోటునూతలపల్లిలో ఇళ్లలోకి వచ్చి టీడీపీ గుండాలు దాడి చేశారు. ఓటు వేసేందుకు వస్తున్న మహిళా ఓటర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
– రైల్వే కోడూరు నియోజకవర్గం, నల్లపురెడ్డిపల్లెలో పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో టీడీపీ గుండాల దాడి.
– శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో పట్టుపురంలో ఓట్ల రిగ్గింగ్‌ను టీడీపీ నేతలు ప్రయత్నిస్తే, వారిని అడ్డుకున్న మా పార్టీ నేతలను అరెస్టు చేశారు. ఇది మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం.
– అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దాదేపల్లిలో వైయస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు గెంటేసిన టీడీపీ నేతలు.
– ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం, తాళ్లూరు మండలం, శివరాంపురంలో వైయస్సార్‌సీపీ బయటకు పంపేసిన టీడీపీ గుండాలు.
– ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం, అదే మండలంలోని వత్సవాయిలో ఉ.7 గం.కే వైయస్సార్‌సీపీ ఏజెంట్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.
– ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం, అదే మండలంలోని తానంచింతలలో వైయస్సార్‌పీపీ ఏజెంట్లను బయటకు గెంటేసి తమను ఓట్లు వేయనివ్వకుండా టీడీపీ గుండాలు అడ్డుకొని రిగ్గింగ్ చేస్తున్నారని గ్రామస్థుల ఆగ్రహం.
– ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం, హెచ్‌ఎం పాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి, లింగంగుంట్లలో వైయస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు.
– కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం, చిప్పగిరి మండల కేంద్రంలో వైయస్సార్‌సీపీ ఏజెంట్లను దౌర్జన్యంగా పోలీసుల జీపులోకి ఎక్కించిన ఎస్‌ఐ నరసింహులు.
– వైయస్సార్ కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం, లింగాల మండలం, కొమ్మనూతలలో వైయస్సార్‌సీపీ ఏజెంట్లను పోలీసులు పోలింగ్ బూత్‌లోకి అనుమతించక పోవడంతో, పోలీసుల తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ, రోడ్డుపై బైఠాయించిన మహిళలు. గ్రామస్తులు.
– చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం, వి.కోట మండల కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన ఎన్టీవీ రిపోర్టర్ అక్రమ్‌పై సీఐ సోమశేఖర్ దాడి.
– ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం, టంగుటూరు మండలం, కొలిజేడులో వైయస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి రాకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు. వారికి వంత పాడుతూ వైయస్సార్‌సీపీ ఏజెంట్లను బెదిరిస్తున్న పోలీసులు.
– ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గాల్లోని మద్దిపాడు, తాళ్లూరు మండలాల్లోని గురువారెడ్డిపాలెం, కొర్రపాటివారిపాలెంలో తమను ఓటు వేయనివ్వకుండా రిగ్గింగ్ చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేసిన ఆయా గ్రామాల వాసులు.
– మార్కాపురం జిల్లా, మార్కాపురం నియోజకవర్గం, కొనకమిట్ల మండలం, చినమనగుండంలోని 175వ బూత్‌లో దొంగ ఓట్లు వేయిస్తున్న టీడీపీ కార్యకర్త.
– శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం, టెక్కలి–4 నుంచి ఎంపీటీసీగా పోటీ చేస్తున్న మా పార్టీ అభ్యర్థి జ్యోతి భర్తను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు. అడ్డుకున్న కృష్ణ చెల్లెలిపై పోలీసుల దాష్టికం..
ఇలా ఆయా ఘటనలకు సంబంధించిన ఫోటోలను పక్కా సాక్ష్యాలతో సహా శ్రీ వైయస్ జగన్, మీడియాకు పీపీటీలో చూపారు.
రీక్యాప్..:
– అనంతపురం 30వ డివిజన్ 3వ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అనుచరుడు ఆదిశేషు యథేచ్ఛగా రిగ్గింగ్ చేశాడు.
– ఆ వీడియో జాతీయస్థాయిలో వైరల్ కావడంతో, రీపోలింగ్ నిర్వహించారు. అయినా అదే మనిషి దర్జాగా వచ్చి మళ్లీ ఓటేశాడు. అతణ్ని కనీసం అరెస్టు కూడా చేయలేదు.
– చిత్తూరు జిల్లా వళియప్పనగర్‌లో టీడీపీ రిగ్గింగ్.
– తిరుపతిలో సిరా గుర్తు చెరిపేయడానికి బూత్ పక్కన నీట్‌గా కెమికల్ పెట్టుకున్నారు. సైక్లింగ్ కోసం చంద్రబాబు చేసిన ప్రత్యేక ఏర్పాట్లు ఇవి.
– పులివెందుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 80 బూత్‌ల్లో ఏకంగా 70 చోట్ల ఏజెంట్లు లేకుండా చేశారు.
– ఆ తర్వాత కూడా బూత్‌లు ఆక్రమించి, రిగ్గింగ్ చేశారు. దొంగ ఓట్లు వేశారు. టీడీపీ నాయకుడు దొంగ ఓట్లు వేయించాడు
– ఈ అన్యాయాన్ని రిపోర్టు చేస్తున్న జర్నలిస్టులపైనా దాడి చేశారు.
అలా ప్రజాస్వామ్యంతో పాటు, పత్రికా స్వేచ్ఛను కూడా ఖూనీ చేశారు. అవన్నీ జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ ఫుటేజ్ ఎందుకు బయటకు తీయడం లేదు?. బాధ్యులను ఎందుకు అరెస్టు చేయడం లేదు?. అని శ్రీ వైయస్ జగన్ గట్టిగా నిలదీశారు.
అంతులేని రిగ్గింగ్. దారుణంగా పెరిగిన పోలింగ్ శాతం:
మున్సిపల్ ఎన్నికల్లో మ. 3 గం. తర్వాత ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు రాష్ట్రమంతా అన్ని చోట్లా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రిగ్గింగ్ చేశారు. మరోవైపు పోల్ కాని ఓట్లు పోల్ అయినట్లుగా, తమకు అనుకూలంగా పోలింగ్ పర్సంటేజీలు పెంచుకున్నారు.
‘సర్’ ప్రకారం పాత జాబితాలో 46 లక్షల ఓట్లు లేవని చెప్పారు. అయినా దాంతోనే ఎన్నికలకు పోయారు. కానీ, విచిత్రంగా రాత్రికి రాత్రి ఓట్లు పెరిగాయి. అదెలా సాధ్యం!. ఒక్కసారి ఓట్ల శాతం ఎక్కడ, ఎలా పెరిగిందో చూడండి.
– గత ఆదివారం పోలింగ్ జరిగిన రోజు, విశాఖపట్నంలో సా. 5 గం.కు 9,19,367 ఓట్లు పోలయ్యాయని చెప్పారు. ఆ తర్వాత రాత్రి 9.30 గం.కు 9,45,915 ఓట్లు పోలయ్యాయని చెప్పారు.
– కానీ, విచిత్రంగా మర్నాడు సోమవారం ఉ. 10 గం.కు ఏకంగా 10,35,154 ఓట్లు పడ్డాయని చెప్పారు. అంటే ఆదివారం రాత్రి 9.30 గం.కు పోలింగ్ 51.46 శాతం ఉంటే సోమవారం ఉదయానికి అది కాస్తా 56.32 శాతానికి పెంచారు. అంటే 1.15 లక్షల ఓట్లు పెంచారు.
– నిజానికి విశాఖలో బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్‌రూమ్‌లకు సీల్ వేయకపోతే మేము ధర్నా చేశాం.
– చీమకుర్తిలో రాత్రి 11 గం.కు 78.28 శాతం. అర్ధరాత్రి 2 గంకు. 85 శాతం పోలింగ్ చూపారు.
– జమ్మలమడుగులో ఉ.11 గం.కు 60 శాతం పోలింగ్ ఎలా సాధ్యం?.
– అద్దంకిలో ఉ.11 గం. నుంచి మ. 1 గం. వరకు కేవలం 2 గంటల్లో 11,958 ఓట్లు పడ్డాయి. అంతకు ముందు కేవలం 19 శాతం ఉన్న ఓట్లు, రెండు గంటల్లో 56.7 శాతానికి పెరిగినట్లుగా చూపారు.
– ధర్మవరంలో ఉ.9 నుంచి 11 గం. మధ్య 30,157 ఓట్లు పోలైనట్లు చెప్పారు. అంటే కేవలం రెండు గంటల్లో పోలింగ్ 8 శాతం నుంచి 36.36 శాతానికి పెరిగినట్లు చూపారు.
– చిలకలూరిపేటలో కూడా ఉ. 9–11 గం. మధ్య 20,772 ఓట్లు పెరిగినట్లు చెప్పారు. అంటే పోలింగ్ 7 శాతం నుంచి రెండు గంటల్లోనే ఏకంగా 37 శాతానికి పెరిగింది.
– పార్వతీపురంలో ఉ. 11 గం. మధ్యాహ్నం 1 గం. మధ్య 13,042 ఓట్లతో, పోలింగ్ శాతం 12 నుంచి 44 శాతానికి పెరిగినట్లు చూపారు.
అంటే, పోలింగ్ శాతాలు తమకు తామే ఇష్టానుసారం పెంచుకుని, ఆ మేరకు రికార్డులు సృష్టించుకుని, యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారనేది స్పష్టంగా అర్ధం అవుతుంది.
పోలింగ్‌కు మించి పెరిగిన ఓట్లు:
చివరకు, వారు ప్రకటించిన పోలింగ్ శాతానికి మించి లెక్కింపులో ఆ సంఖ్య పెరిగింది. చిత్తూరు కార్పొరేషన్‌లో మొత్తం 92,910 ఓట్లు పోలైతే, కౌంటింగ్ టేబుల్స్ మీదు 7 వేల ఓట్లు ఎక్కువ కనిపించాయి. అవి బయటకు రాకుండా, ఏజెంట్లను వెళ్లగొట్టి, గెలుపు టీడీపీదే అని ప్రకటించారు.
అసలు చంద్రబాబు గెలిచే అవకాశం ఉందా?: ఎన్నికలు సజావుగా జరిగితే, చంద్రబాబు ఎలా గెలుస్తాడు? ఈ రెండున్నర ఏళ్లలో ఆయన ఏం చేశాడని ప్రజలు ఓటేస్తారు? ప్రతి ఇంటిని చంద్రబాబు మోసం చేశాడు. చివరకు ఆడబిడ్డ నిధి అంటూ అడ్డగోలుగా మోసాలు చేయడమే కాకుండా, అంతకు ముందు ఉన్న పథకాలు కూడా ఆపేశాడు. చివరకు సున్నా వడ్డీ కూడా ఎగ్గొట్టేశాడు. వాటిపై అక్కచెల్లెమ్మలు చంద్రబాబును నిలదీసే పరిస్థితి. చిన్న పిల్లలను మోసం చేశాడు. నిరుద్యోగులను కూడా మోసం చేశాడు. నెలకు రూ.3 వేలు అన్నాడు. రైతులకు నిలువునా మోసం. ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. సున్నా వడ్డీ లేదు. పంటలకు ధర లేదు. సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం అయింది. పారదర్శక పాలన పూర్తిగా పోయింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు కూడా లేవు. అంతకు ముందు ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వ్యయం వరకు ఉచిత వైద్య సేవలు అందితే ఇప్పుడు పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఉద్యోగస్తులనూ చంద్రబాబు మోసం చేశాడు. వారికి ఐఆర్ లేదు. పీఆర్‌సీ లేదు. 5 డీఏలు పెండింగ్. ఉద్యోగులకు పలు రూపాల్లో ఏకంగా రూ.40 వేల కోట్ల బకాయిలు.
నాడు ‘సేఫ్ ఆంధ్రా’.. నేడు ‘సేవ్ ఆంధ్రా’.. ‘రాష్ట్రం ఫర్ సేల్’. ‘దక్షిణాది బీహార్’:
ఈ రెండున్నర ఏళ్లలో చంద్రబాబు ఏమేం చేశాడనేది చూస్తే.. ఏకంగా 17 మెడికల్ కాలేజీలను పప్పు బెల్లానికి అమ్మకానికి పెట్టాడు. పోర్టులు, హార్బర్లు స్కామ్‌లు చేస్తూ అమ్మకానికి పెట్టాడు. ప్రభుత్వ భూములను రూపాయికే కావాల్సిన వారికి ఇస్తున్నారు. అలా ‘రాష్ట్రం ఫర్ సేల్’ అనేది కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఊరూరా, వాడవాడనా లిక్కర్. గంజాయి. ఎక్కడ పడితే అక్కడ అవి దొరుకుతున్నాయి. రాజధాని పనుల్లో స్కామ్. మట్టి, ఇసుక, ల్యాటరైట్ స్కామ్. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. మా హయాంలో ‘సేఫ్ ఆంధ్ర’ అనగా.. ఇప్పుడు ‘సేవ్ ఆంధ్రా’ అనాల్సి వస్తోంది. అయ్యా, చంద్రబాబుగారూ.. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే చాలా గౌరవం ఉండేది. కానీ ఈరోజు ఇదే ఆంధ్రప్రదేశ్‌ను ‘దక్షిణాది బీహార్’ (సౌత్ బీహార్)గా మార్చేశారు.
వీటన్నింటిపై ట్యూషన్లు పెట్టి మరీ నేర్పిస్తున్నారు.. వాటి విశ్వసనీయతపై ప్రజల్లో నమ్మకం పోయింది:
డిజిటల్ విప్లవం నడుస్తున్న ఈ యుగంలో, ప్రపంచ వ్యాప్తంగా జెన్ జీ ప్రజాస్వామ్య హక్కుల కోసం గొంతెత్తుతున్న ఈ సమయంలో కూడా అలాంటి జెన్ జీ తరంలో కూడా.. రిగ్గింగ్ ఎలా చేయాలో, సైక్లింగ్ ఎలా చేయాలో, ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేయాలనేది ఏకంగా ట్యూషన్లు పెట్టి మరీ నేర్పిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన స్థానంలో ఉన్న ఎన్నికల కమిషన్, పోలీసులు, అధికార యంత్రాంగం పట్ల ప్రజల్లో పూడ్చలేని అగాధాన్ని సృష్టించింది. వాటి విశ్వసనీయత మీద ప్రజలకు ఈరోజు నమ్మకం పోయిన పరిస్థితి.
స్వార్థం కోసం దిగజారిన చంద్రబాబు.. ‘హే రామ్ సేవ్ ఆంధ్ర’.. ‘హే రామ్ సేవ్ డెమొక్రసీ’:
చంద్రబాబు తన స్వార్థం కోసం దారుణంగా దిగజారాడు. రాష్ట్ర పరువుతో పాటు, ప్రజాస్వామ్యాన్ని కూడా ఆయన ఫణంగా పెట్టారు. ఇది కేవలం ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియను మాత్రమే ఖూనీ చేయడమే కాదు.. ప్రజల ఓటు హక్కు, వారు ఎన్నికల్లో పోటీ చేసే హక్కులకూ భంగం కలిగించడమే. ఒక వ్యవస్థీకృతంగా ప్రజాస్వామ్య వ్యవస్థనూ ఖూనీ చేయడమే. ఇది చట్ట ప్రకారం హేయమైన నేరం.
ఇలాంటి పాలనతో రాష్ట్ర ప్రజలంతా నానా అగచాట్లు పడుతున్నారు. అందుకే.. ‘హేరామ్ సేవ్ ఆంధ్రా. హే రామ్ సేవ్ డెమొక్రసీ.’
చంద్రబాబు గెల్చి ఓడారు. మేం ఓడి గెల్చాం.
రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా బహుషా ఎప్పుడు, ఎక్కడ చూడని విధంగా అణిచివేతను ఎదుర్కొని ఈరోజు నిలబడ్డాం. «ధైర్యంగా ఎన్నికల్లో పాల్గొనడం, నిలబడడం చేశాం. చంద్రబాబు అక్రమాలు దేశం దృష్టికి తీసుకెళ్లగలిగాం. మా నాయకులు, కార్యకర్తలు పోరాడారు. వారందరికీ నా సెల్యూట్. చంద్రబాబు ఈ ఎన్నికల్లో గెల్చి ఓడాడు. మేము ఓడి గెల్చాం. ప్రజల మనసులో నిలబడ్డాం.
ఎన్నికల బుల్డోజ్ చంద్రబాబు లక్ష్యం:
రాష్ట్రంలో వరసగా తుపాన్లు. అర్నబ్, మురసు వస్తున్నా.. ఎన్నికలు వాయిదా వేయడం లేదు. ఎందుకంటే చంద్రబాబు ఈ ఎన్నికలను బుల్డోజ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోకుండా ప్రభుత్వం చూడాలి. అది కనీస బాధ్యత. అర్నబ్ తుపాన్ వల్ల 10 మంది చనిపోయారు. 10 రోజులైనా 150 గ్రామాల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు. ఇప్పుడు తాజాగా మురసు తుపానులో కూడా ఇద్దరు చనిపోయారు. అయినా ఎవ్వరికీ రూపాయి సాయం చేయలేదు. ఏడాది క్రితం మోంథా తుపాన్ వస్తే, ఇప్పటికీ ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. ఈరోజు రైతులకు ఉచిత పంటల బీమా లేదు. పంటలకు గిట్టుబాటు ధర లేదు. ఇలా చంద్రబాబు పాలనలో అందరూ అగచాట్లు పడుతున్నారని శ్రీ వైయస్ జగన్ వివరించారు.
మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. ఫిర్యాదు చేయడం కూడా నేరమా?:
పులివెందులలో తనపై కేసు నమోదు గురించి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన శ్రీ వైయస్ జగన్, ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం లేదని ఆర్వోకు ఫిర్యాదు చేయడం కూడా నేరమా? మేము అక్కడ శాంతియుతంగా కూర్చోవడం కూడా తప్పేనా? అని ప్రశ్నించారు. అధికారం ఉంది కదా.. అని పోలీసులు పోలీసులు కేసులు పెట్టుకుంటారా? పెట్టుకోమనండి. ఈ కేసులకు భయపడేది లేదని చెప్పారు.
ప్రజల హక్కులు కాపాడబడతాయా!:
ఇంత జరిగిన తర్వాత ఎవరైనా కూడా, ఈ ఎన్నికలు చూశాక కూడా, ఇక్కడ ప్రజల హక్కులు కాపాడపడతాయా ? అని ఎవరైనా అనుకుంటే వారిని ఏమనుకోవాలి. మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఈరోజు ఓటు హక్కు లాగేసుకున్నారు. ఇప్పటికే లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో 22–ఏలో చేర్చారు. రేపు పొద్దున సబ్ రిజిస్టార్ ఆఫీసులో మీ ఆస్తి పత్రాలు లాగేసుకుంటారు. మీ ఆస్తులన్నీ వారివే అంటారు.. కాబట్టి ఇకనైనా ప్రజలు ఈ విషయాలు గుర్తించాలని జగన్ కోరారు.
ఇవీ చదవండి: YS Jagan Mohan Reddy: పదా.. దేశానికి చెబుదాం! చంద్రబాబు సర్కార్‌పై జగన్ న్యాయపోరాటం..
YS Jagan PC: రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తున్న చంద్రబాబు.. స్థానిక ఎన్నికల్లో అష్ట కుట్రల పర్వం: జగన్ ఫైర్






