AP Council: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి నాణ్యతపై తీవ్ర చర్చ జరిగింది. ఈ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. లడ్డూ ప్రసాదం నెయ్యి విషయంలో పెద్ద ఆర్థిక కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. ఇందాపూర్ డెయిరీ మరియు హెరిటేజ్ కంపెనీల మధ్య సంబంధాలపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.
లడ్డూలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్య ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై మాజీ టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. 2024 జూలైలో ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిని నాణ్యత లేదని టిటిడి తిరస్కరించిందని, ఆ నాలుగు ట్యాంకర్లను సెప్టెంబర్‌లో మళ్లీ వినియోగించారని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని సీబీఐ సిట్ నివేదిక స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మీద తప్పుడు ఆరోపణలు చేయవద్దని హెచ్చరించారు. చంద్రబాబు ఎవరినీ ఆరోపించలేదని, ఆయా సంస్థల నివేదికలను మాత్రమే చదివారని చెప్పారు.
ఇక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ 2019–2024 మధ్య జరిగిన లడ్డూ నెయ్యి కల్తీ అంశంపైనే చర్చ జరగాలని అన్నారు. NDDB నివేదికలో లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నట్లు స్పష్టంగా ఉందని పేర్కొన్నారు.
ఈ అంశంపై ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైఎస్సార్సీపీ సభ్యులు మండలి వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. అధికారపక్షం తమ ప్రసంగాన్ని అడ్డుకుంటోందని ఆరోపించారు. సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇవీ చదవండి: Tirumala Laddu : లడ్డు రాజకీయాలకు స్వస్తి పలికి అభివృద్ధి దిశగా పయనించాలి.. పౌర సంస్థల చర్చా గోష్టిలో వక్తల ఏకగ్రీవ తీర్మానం
Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదంపై మరో డ్రామా.. సీబీఐ నివేదిక నచ్చక కొత్త కమిటీ.. న్యాయ నిపుణులు విస్తుపోయే స్పందన
