HomeAndhra PradeshTirumala Laddu : లడ్డు రాజకీయాలకు స్వస్తి పలికి అభివృద్ధి దిశగా పయనించాలి.. పౌర సంస్థల...

Tirumala Laddu : లడ్డు రాజకీయాలకు స్వస్తి పలికి అభివృద్ధి దిశగా పయనించాలి.. పౌర సంస్థల చర్చా గోష్టిలో వక్తల ఏకగ్రీవ తీర్మానం

Tirumala Laddu : అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే విద్వేష, విధ్వంస రాజకీయాలకు స్వస్తి పలకాలని పౌర సంస్థలు ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశాయి. విద్య, వైద్య రంగాల బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పాలన సాగాలని, ప్రజల దృష్టిని మళ్లించే “లడ్డు రాజకీయాలను” తక్షణమే విరమించుకోవాలని హితవు పలికాయి.

ఈనెల 7వ తేదీన విజయవాడలోని దాసరి భవన్‌లో పౌర సంస్థల ఆధ్వర్యంలో “రాష్ట్ర రాజకీయాలు – చట్టబద్ధ పాలన” అనే అంశంపై చర్చా గోష్టి జరిగింది. ఈ సమావేశానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.

రాష్ట్రం 16 లక్షల కోట్ల అప్పుల్లో మునిగింది
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా|| పి.వి. రమేష్ మాట్లాడుతూ రాష్ట్రం దాదాపు 16 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రతి పౌరుడిపై మూడు లక్షల రూపాయలకు పైగా రుణభారం ఉందని పేర్కొన్నారు. అక్షరాస్యతలో 36వ స్థానం, తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలలో అట్టడుగు స్థానం రాష్ట్ర దయనీయ పరిస్థితిని ప్రతిబింబిస్తోందన్నారు. గత నలభై ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న అనేక సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర దూషణలు, ఘర్షణలు విడనాడి విద్య, వైద్య రంగాల్లో ముందున్న కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి ఆంధ్రప్రదేశ్‌ను తీసుకెళ్లాలని సూచించారు.

రాజ్యాంగ బద్ధ పాలనకు భిన్నంగా రాజకీయ పాలన
మాజీ ఐఏఎస్ అధికారి, లిబరల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ జి.ఎస్.ఆర్.కె.ఆర్. మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన రాజ్యాంగ బద్ధంగా కాకుండా రాజకీయ పాలనగా మారిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక చర్యలను దాచిపెట్టేందుకు మతోన్మాదాన్ని రెచ్చగొట్టే లడ్డు రాజకీయాలను పదేపదే తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. ఒకప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో ఆటవిక రాజ్యంపై చర్చించేవారని, నేడు ఆంధ్రప్రదేశ్‌ను కూడా ఆ కోవలోకి నెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు.

డైవర్షన్ పాలిటిక్స్‌కు వ్యతిరేకంగా పోరాటం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పినట్లు పాలకులు వ్యాపారులైతే ప్రజలు బిక్షగాళ్లుగా మారతారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను పక్కన పెట్టి, లేని సమస్యలను సృష్టిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ నడపడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు.

జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ నివేదిక ప్రకారం 2024లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల్లో 79 శాతం మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. శాసనసభ్యుల సగటు ఆస్తులు 65 కోట్ల రూపాయలకు చేరడం ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.

ప్రజాస్వామ్య విలువలు గౌరవించాలి
శాసనమండలి మాజీ సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ అధికార పార్టీ ప్రతిపక్షాల సద్విమర్శలను స్వీకరించాలని, ప్రతిపక్షం శాసనసభలో ప్రజావాణిని బలంగా వినిపించాలని కోరారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను గౌరవించినప్పుడే ప్రజాస్వామ్యం వికసిస్తుందని అన్నారు.

రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగంలో పేర్కొన్న లౌకికవాదం, ఫెడరలిజం, సామ్యవాదాలకు నేడు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందని హెచ్చరించారు. చర్చా గోష్టిలో పాల్గొన్న వక్తలందరూ సంఘీభావంగా చేతులు కలిపి లడ్డు రాజకీయాలను నిరసిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు పోరాడతామని నినదించారు.

ఇవీ చదవండి: Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదంపై మరో డ్రామా.. సీబీఐ నివేదిక నచ్చక కొత్త కమిటీ.. న్యాయ నిపుణులు విస్తుపోయే స్పందన

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు