Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకుడు’ జులై 23న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత వెంకట్ కె. నారాయణ సినిమా విశేషాలు, విజయ్‌తో తన అనుబంధం, ఎదురైన సవాళ్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రిలీజ్ ఆలస్యానికి ఊహించని పరిణామాలు.. విజయ్ సీఎం కావడం ప్రత్యేకం
మొదట ఈ సినిమాను జనవరిలో విడుదల చేయాలని భావించినప్పటికీ అనేక అనుకోని పరిణామాల కారణంగా విడుదల జులై 23కు వాయిదా పడిందని నిర్మాత తెలిపారు. థియేటర్ల సమస్యలు వస్తాయని ముందే ఊహించినా, పైరసీ, కోర్టు వ్యవహారాలు వంటి ఇబ్బందులు ఎదురవుతాయని అనుకోలేదన్నారు. అయితే ఇప్పుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సినిమా విడుదల కావడం అభిమానులకు మరింత ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రి నటించిన సినిమా థియేటర్లలో చూడడం అరుదైన సందర్భమని అన్నారు.
సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రయాణం.. కోవిడ్ సేవా కార్యక్రమాల నుంచి ప్రొడక్షన్ వరకు
తనకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఎంతో ఇష్టమని వెంకట్ కె. నారాయణ తెలిపారు. సినిమాల ద్వారా సమాజానికి గొప్ప సందేశాలు ఇవ్వవచ్చనే నమ్మకంతోనే సినీ రంగంలోకి వచ్చానని చెప్పారు. కోవిడ్ సమయంలో ‘ఫీడ్ మై సిటీ’ కార్యక్రమం ద్వారా వేలాది మంది నిరుపేదలకు ఆహారం అందించామని గుర్తు చేశారు. అదే సమయంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న కష్టాలను చూసి ముందుగా ఫిల్మ్ ఫైనాన్స్, అనంతరం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించామని చెప్పారు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని కర్ణాటకలో పంపిణీ చేసిన తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించారు.
‘భగవంత్ కేసరి’ నుంచి రెండు సన్నివేశాలే.. మిగతా కథ పూర్తిగా కొత్తది
‘జన నాయకుడు’ కథపై వస్తున్న పోలికల గురించి స్పందించిన నిర్మాత, ‘భగవంత్ కేసరి’ చిత్రంలోని కేవలం రెండు సన్నివేశాల స్ఫూర్తి మాత్రమే తీసుకున్నామని స్పష్టం చేశారు. అమ్మాయిని ఆర్మీలో చేరే అంశం తప్పితే మిగతా కథ, కాన్ఫ్లిక్ట్, పాత్రలు అన్నీ పూర్తిగా కొత్తవేనని చెప్పారు. ట్రైలర్‌లో కూడా ఆ విషయాన్ని దాచలేదని, కానీ పూర్తి సినిమా చూస్తే ప్రేక్షకులకు కొత్త ప్రపంచం, కొత్త అనుభూతి కలుగుతుందని వివరించారు. గర్ల్ చైల్డ్ ఎంపవర్‌మెంట్‌తో పాటు సమాజానికి బలమైన సందేశం ఇచ్చే చిత్రంగా ఇది నిలుస్తుందని అన్నారు.
సెన్సార్ వివాదం.. విజయ్ క్రమశిక్షణపై నిర్మాత ప్రశంసలు
ఈ చిత్రానికి మొదట యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చి, తర్వాత ఏ సర్టిఫికెట్ ఇవ్వడం కొంత నిరాశ కలిగించిందని వెంకట్ కె. నారాయణ తెలిపారు. కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా చూడాల్సిన సందేశాత్మక చిత్రానికి అలాంటి నిర్ణయం బాధ కలిగించిందన్నారు. మరోవైపు విజయ్ గురించి మాట్లాడుతూ ఆయన అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని కొనియాడారు. సమయపాలన, పనిపై అంకితభావం, వృత్తిపరమైన నిబద్ధత తనను ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పారు. విజయ్‌తో కలిసి పనిచేయడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమని పేర్కొన్నారు.
7,000కు పైగా స్క్రీన్లలో విడుదల.. చిరంజీవితో సినిమా కూడా అద్భుతంగా వస్తోంది
‘జన నాయకుడు’ను ప్రపంచవ్యాప్తంగా 7,000 నుంచి 8,000 స్క్రీన్లలో విడుదల చేస్తున్నామని నిర్మాత వెల్లడించారు. విజయ్ సినీ ప్రయాణానికి ఇది ఓ ట్రిబ్యూట్‌లా ఉండేలా ప్లాన్ చేశామని చెప్పారు. ప్రస్తుతం విజయ్ పూర్తిస్థాయిలో ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారని, భవిష్యత్తులో మళ్లీ సినిమాల్లోకి వచ్చే అవకాశం తక్కువేనని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్న తన తదుపరి తెలుగు చిత్రం కూడా అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. చిన్నప్పటి నుంచే చిరంజీవి తనకు స్ఫూర్తి అని, ఆయనతో సినిమా చేయడం తన కల నెరవేరినట్టేనని వెంకట్ కె. నారాయణ ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: Jana Nayagan Advance Booking: విజయ్ చివరి సినిమాకు భారీ క్రేజ్.. ఒక్కరోజే అన్ని టికెట్లా?
Jana Nayagan Release Date: ఎట్టకేలకు తెరపైకి వస్తోందా? జూలై 24పై భారీ బజ్.. ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్!
Jana Nayagan: ఆ ఘటనపై చాలా కోపం వచ్చింది.. నాకూ ఆ బాధ తెలుసు: విజయ్ దేవరకొండ
