GWS Employees: ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లపై దురుసుగా మాట్లాడారు. వైసీపీ వాళ్లుగానీ, వాలంటీర్లు గానీ సచివాలయం మెట్లు ఎక్కితే అడ్మిన్ ను గూబ పగలగొట్టాలంటూ వ్యాఖ్యానించారు. దీనిపై గ్రామ,వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (GWS Employees) అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర అధ్యక్షుడు ఎండి.జానీ పాషా ఓ ప్రకటన విడుదల చేశారు.
’’రాజకీయ నేతలు ఐదేళ్ళకోసారి ప్రజల ఓటుతో ప్రజలకు సేవచేసే అవకాశం పొందుతారు. అదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 62 సంవత్సరాల వయసుకు చేరే వరకు ప్రజలకు సేవచేసే అవకాశం కలిగి ఉన్నారనే విషయం రాజకీయ నాయకులు గుర్తించాలి.
ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడడం, అసభ్యంగా దూషించడం వంటి సంఘటనలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఉద్యోగ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. ఉద్యోగులు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితులు లేని పక్షంలో చట్ట పరంగా రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబసభ్యులు సైతం ప్రజాస్వామ్యంలో ఓటర్లన్న విషయం మర్చిపోవద్దు.
గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన అత్యవసర సమావేశం మేరకు, ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ రాజకీయ పార్టీ కార్యకర్తల సమావేశంలో, వార్డు సచివాలయ అడ్మిన్ ఉద్యోగుల గూబ పగలకొట్టండి ఏ పోలీసోడు వచ్చి కేసు రాస్తాడో చూస్తా అంటూ ఒక రాజకీయ పార్టీ నేత ఎద్దు శశి భూషణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా గ్రామాలు మరియు పట్టణాలలో ప్రజలందరికీ అత్యంత చేరువగా ఉంటూ అనేక రకాల సేవలను అందిస్తున్నారు, ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఐదుకోట్ల రాష్ట్ర ప్రజలకు ముందుండి సేవలందిస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను కించపరుస్తూ, అవమానపరుస్తూ దుర్బషలాడుతూ వారిని గూబ పగుల కొట్టండి అంటూ హేళనగా ప్రభుత్వ ఉద్యోగులను అనుచిత వ్యాఖ్యలతో అవమానపరిచిన ఒక పార్టీ రాజకీయ నేత మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
సచివాలయ ఉద్యోగులు ఏం పాపం చేశారో తెలియడంలేదని, ఈ విధమైన మాటలతో ఉద్యోగులను తీవ్ర మనోవేదనకు గురి చేయడంతో పాటు ఉద్యోగులను భయభ్రంతులకు గురిచేయడం అత్యంత శోచనీయమని తెయజేస్తున్నాం. ఉద్యోగులను ప్రజాస్వామ్యంలో భాగమనే విషయం సైతం రాజకీయనేతలు గుర్తించి సమ సమాజం కోసం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం.
గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున ఉద్యోగులకు జరిగిన అవమానకర సంఘటనను ఉద్యోగుల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రకాశం జిల్లా రాజకీయ నేతను చట్టబద్ధంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.’’ అని ఎండి జానీ పాషా పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, రాష్ట్ర సహ అధ్యక్షుడు జి.హరీంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రోజా ప్రకాష్, కె.రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర కోశాధికారి బి.పుల్లారావు, రాష్ట్ర కార్యదర్శులు దారా సురేష్ బాబు, కె.మురళీ కృష్ణ, మహిళా విభాగం కన్వీనర్ బి.శ్వేత, న్యాయ విభాగం కన్వీనర్ యల్ అర్చన, తదితరులు రాష్ట్ర కమిటీ తరఫున ప్రకటన విడుదల చేశారు.
ఇవీ చదవండి: Software Employees: రోజుకు 16 గంటల పని.. సాఫ్ట్ వేర్ పిల్లల నడుములు వంగిపోతున్నాయ్..
Minister meeting on Employees: సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం భేటీ
Good News for employees: విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీపికబురు.. జీతం ఎంత పెంచారంటే..
Jawahar Reddy on employees: మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని స్ట్రీమ్ లైన్ చెస్తాం: సీఎస్ జవహర్‌రెడ్డి
AP Employees: ఏపీలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల కేటాయింపుపై కసరత్తు ?
