Vaazha 2: మలయాళం సినిమాల ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించినప్పటికీ కంటెంట్ బలంగా ఉంటే భారీ విజయాలు సాధించగలమని అక్కడి దర్శకులు పదేపదే నిరూపిస్తున్నారు. స్టార్ హీరోలు, భారీ యాక్షన్ సన్నివేశాలు, వీఎఫ్ఎక్స్ హంగులు లేకపోయినా కేవలం కథతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి మలయాళ చిత్రాలు.
ఇటీవల అలాంటి విజయాన్ని అందుకున్న సినిమాల్లో ‘వాళా 2’ ఒకటి. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన చిన్న సినిమా ‘వాళా’ సంచలన విజయాన్ని అందుకుంది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. యువతకు దగ్గరగా ఉండే కథ, సహజమైన పాత్రలు ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి.
సీక్వెల్‌గా వచ్చిన ‘వాళా 2’
మొదటి భాగం విజయం తర్వాత దర్శకుడు సవిన్ ‘వాళా 2’ ను తెరకెక్కించారు. ఈ సినిమాకు ‘బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్’ అనే ట్యాగ్ లైన్ పెట్టడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ స్పందనను అందుకుంది.
విడుదలైన కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.163.50 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న ‘ది గోట్ లైఫ్’ సినిమా ఆల్ టైమ్ కలెక్షన్లను కూడా దాటేసింది. ఆ చిత్రం రూ.158.50 కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే.
యూత్‌ను ఆకట్టుకున్న కథ
‘వాళా 2’ కథ ప్రధానంగా స్కూల్ లైఫ్, ఫ్రెండ్ షిప్ మరియు యువత భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. జీవితంలో ఏ దిశలో వెళ్లాలో తెలియని యువకులు ఎలా తమ లక్ష్యాన్ని కనుగొంటారు అన్నది ఆసక్తికరంగా చూపించారు. అందుకే ఈ సినిమా మలయాళ యువతలో భారీ క్రేజ్ సంపాదించింది.
ఈ సినిమాలో హషీర్, అలన్, వినాయక్, అజిన్, బిజు కుట్టన్, అజు వర్గీస్, విజయ్ బాబు, అల్ఫోన్స్ పుత్రేన్, అమీన్, ఏంజెల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సహజమైన నటన, రియలిస్టిక్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు పెద్ద బలం అయ్యాయి.
తెలుగు రిలీజ్‌కు ప్రయత్నాలు
ఇదిలా ఉండగా ఈ సినిమాను త్వరలోనే తెలుగులో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి నిర్మాతల్లో ఒకరైన సాహు గారపాటి ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన నిర్మించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది.
ఇప్పుడు ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉన్న ‘వాళా 2’ కూడా భారీ విజయాన్ని సాధించడంతో ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
కంటెంట్ బలంగా ఉన్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇవీ చదవండి: Mammootty: ‘లోక’ సీక్వెల్‌లో మమ్ముట్టి కనిపిస్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మలయాళ మెగాస్టార్
OTT Movies: ఈ వీకెండ్ మూవీ మజా.. థియేటర్లలో కొత్త సినిమాలు, ఓటీటీల్లో 14 రిలీజ్‌లు
OTT Movie: థియేటర్లలో మిస్సైన థ్రిల్లర్.. స్ట్రీమింగ్: ‘డార్క్ నైట్’ మూవీ ఓటీటీలో ట్రెండ్
