Singapore Govt: మనదేశంలో ఖైదీలకు సత్ప్రవర్తన కారణంగా ఆగస్టు 15 లేదా జనవరి 26న విడుదల చేయడం పరిపాటి. ఖైదీలు తమ ప్రవర్తన, ఆలోచనలు మార్చుకుని మంచి అలవాట్లు, సత్ప్రవర్తన అలవాటు చేసుకుని ఉంటే వారిని విడుదల చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. తాజాగా సింగపూర్ ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. Singapore Govt
సింగపూర్ ప్రభుత్వం తమ దేశంలో నేరాలను నియంత్రించేందుకు సరికొత్త చట్టాన్ని అమలు చేయనుంది. దీని ప్రకారం శిక్ష కాలం పూర్తయినా, ఆ నేరస్తుల నుంచి సమాజానికి ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వం భావిస్తే అలాంటి వారిని జైల్లోనే ఉంచేందుకు అవకాశం ఉంటుంది. అయితే, 21 ఏళ్లు వయసు పైబడినవారే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. సాధారణంగా కోర్టు విధించిన శిక్ష పూర్తయిన తర్వాత.. జైలు అధికారులు వారిని విడుదల చేయడం మనకు తెలిసిందే.
కానీ, హత్యలు, చిన్నారులపై అత్యాచారం తదితర కేసుల్లోని నేరస్తులను విడుదల చేసే ముందు న్యాయ, హోం మంత్రి అనుమతి తప్పనిసరిగా అవసరం. వారు విడుదలైన తర్వాత మళ్లీ అదేతరహా నేరాలు చేసేందుకు అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తే.. జైలు నుంచి వెళ్లేందుకు అనుమతి నిరాకరించవచ్చు.
ఈ చట్టం తీసుకొచ్చిన సందర్భంగా న్యాయ, హోంశాఖ మంత్రి షణ్ముగం కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ఓ ఘటనను ప్రస్తావించారు. ఆరేళ్ల కుమార్తెపై అత్యాచారం కేసులో జైలు కెళ్లిన ఓ వ్యక్తి శిక్ష పూర్తి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత 2015, 2017లో మళ్లీ ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడని గుర్తు చేశారు. వారిద్దరూ నిందితుడి సోదరి మనవరాళ్లే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.
ఇలాంటి ఘోరమైన ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆ దేశ మంత్రి చెప్పారు. ఈ తరహా కేసుల్లో నేరస్తులను విడుదల చేయాలా? వద్దా? అని నిర్ణయించేందుకు ఓ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, మానసిక నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారన్నారని తెలిపారు.
ఒకవేళ విడుదల చేసేందుకు కమిటీ నిరాకరించిన పక్షంలో.. ప్రతి ఏడాదీ ఆ నేరస్తుడి నడవడికను సమీక్షించి నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ తరహా చట్టం అగ్రరాజ్యం అమెరికా దేశంలోనూ అమల్లో ఉంది. అయితే, మొత్తం 50 రాష్ట్రాలకు గానూ 20 రాష్ట్రాలు, కొలంబియా జిల్లా పరిధిలోని నేరస్తులకు మాత్రమే ఈ చట్టాన్ని వర్తింపజేస్తున్నారట. సింగపూర్ తాజాగా తీసుకొచ్చిన ఈ చట్టానికి విపక్షాలు కూడా మద్దతు పలికాయి. అయితే, దీనిద్వారా నేరాలను అరికట్టడం సులభమేమీ కాదని, ఉద్దేశపూర్వకంగానే నేరస్తుల శిక్షా కాలాన్ని పెంచే అవకాశముందని పలువురు ప్రతిపక్ష నాయకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: Andhra Pradesh Elections: త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్.. శిక్షణలు ఈ నెలాఖరుకల్లా పూర్తి
Yamalokam: మానవుడు చేసే నేరాలకు నరకంలో ఏ శిక్షలుంటాయి? తప్పక తెలుసుకోండి..
Zelensky: పుతిన్‌కు త్వరలో శిక్ష తప్పదు.. పాపం అనుభవిస్తాడు!
Singapore new president: సింగపూర్ కొత్త అధ్యక్షుడిగా షణ్ముగరత్నం
IRR Scam: ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో కీలక పరిణామం.. ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్
