రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఉక్రెయిన్ చీఫ్ జెలెన్‌స్కీ (Zelensky) మరోసారి మండిపడ్డారు. పుతిన్‌ను త్వరలోనే ఖైదీగా చూస్తామని జెలెన్‌స్కీ (Zelensky) జోస్యం చెప్పారు. పుతిన్ చేస్తున్న నేరాలకు తప్పనిసరిగా శిక్ష అనుభవించి తీరుతాడని తేల్చి చెప్పారు. త్వరలోనే ఇది జరుగుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఉన్న నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలోనే జెలెన్‌స్కీ ఈ కామెంట్లు చేయడం గమనార్హం. తాజాగా పుతిన్‌పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో జెలెన్‌స్కీ (Zelensky) ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వ్లాదిమిర్ పుతిన్ తన బలాన్ని చూసుకుని మిడిసి పడుతున్నారని జెలెన్‌స్కీ మండిపడ్డారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేసి తీవ్రమైన నేరం చేశారని, ఇది క్షమార్హం కాదన్నారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఉన్న ఈ హేగ్ సిటీలో పుతిన్‌ను చూడాలని ఉందని జెలెన్‌స్కీ వ్యాఖ్యలు చేశారు. ఆ కోర్టు విధించిన శిక్ష అనుభవిస్తూ పుతిన్ ఇక్కడే ఉండాలని తాము బలంగా కోరుకుంటున్నట్లు జెలెన్‌స్కీ తన మనసులో మాట చెప్పారు. అలాంటి శిక్షకు పుతిన్ అర్హుడేనని పేర్కొన్న జెలెన్‌స్కీ… కచ్చితంగా ఇది జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
తాము విజయం సాధించిన వెంటనే పుతిన్‌కు శిక్ష పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. యుద్ధానికి కారణమైన వారు ఇలాంటి పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఇక రష్యా రాజధాని నగరం మాస్కో నడిబొడ్డున క్రెమ్లిన్ భవనాలపై రెండు డ్రోన్లు దూసుకురావడం కలకలం రేపింది. అధ్యక్ష కార్యాలయం, నివాసం ఉన్న ఈ కీలక భవనాలపై ఈ తరహా దాడికి ప్రయత్నం జరగడంతో రష్యా (Russia) ఉలిక్కిపడింది. ఈ వ్యవహారంలో అమెరికాపై రష్యా తీవ్రంగా మండిపడింది. క్రెమ్లిన్‌పై జరిగిన డ్రోన్ దాడిని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సైతం ఖండించింది.
ఈ వ్యవహారంలో జెలెన్‌స్కీని, అతడి బృందాన్ని చంపడం మినహా తమ వద్ద మరో ప్రత్యామ్నాయం లేదని కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వదేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్లు దాడికి ప్రయత్నించడంతో అధ్యక్షుడి భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో పుతిన్‌ను బంకర్‌లోకి తరలించారు. ఆయనకు చెందిన నోవో-ఒగరెవో ప్రాంతంలోని నివాసంలో ఈ బంకర్‌ను నిర్మించారు. అధ్యక్షుడు అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని రష్యన్ మీడియాలో జోరుగా కథనాలు ప్రసారమయ్యాయి.
ఈ పరిణామాల అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో పర్యటిస్తున్నారు. మొదటినుంచి ఉక్రెయిన్‌కు నెదర్లాండ్స్ మద్దతుగా నిలుస్తోంది. ఆ దేశంలో అడుగు పెట్టిన వెంటనే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును జెలెన్‌స్కీ సందర్శించారు. కోర్టు బయట ఉక్రెయిన్ దేశ పౌరులు చాలా మంది జెలెన్‌స్కీని చూసేందుకు వచ్చారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు పుతిన్‌కు గట్టి షాక్ ఇచ్చింది. పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
పొరుగు దేశం ఉక్రెయిన్ పై జరిపిన యుద్దం, మారణకాండకు పుతిన్‌ను బాధ్యుడిని చేస్తూ క్రిమినల్ కోర్టు రష్యా అధినేతపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. త్వరలోనే తమకు న్యాయం జరుగుతుందని, రష్యాకు కోర్టులోనే శిక్ష పడుతుందని గతంలోనే ఉక్రెయిన్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, రష్యా మాత్రం ఈ నిర్ణయాన్ని ఖండించింది.
Read Also : ChatGPT: ఛాట్ జీపీటీతో గూగుల్‌కు ముప్పు తప్పదా? ఛాట్ జీపీటీ అంటే ఏంటి?