Yamalokam: విపరీతమైన పాపాలుచేసే వారికి నరకంలో ఎలాంటి శిక్షలుంటాయి? అనేది చాలా మందికి ఆసక్తికర ప్రశ్న. గరుడ పురాణం, ఇతర గ్రంథాల్లో ఈ విషయాలు ఉంటాయి. ఏ తప్పులు చేస్తే ఏ శిక్ష పడుతుందనే ఉత్సుకత చాలా మందికి ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ కథనం.. (Yamalokam)
దేవుడు ప్రసాదించిన ఈ జన్మలో సకర్మలకు బదులుగా అకర్మలు చేయడం వల్ల మరు జన్మలో మరింత క్షీణ స్థితిని అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. చేయకూడని పాపాలు చేయడం వల్ల నరకానికి వెళ్తారని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే నరక లోకంలో విధించే శిక్షలు దారుణంగా ఉంటాయని చెబుతారు. పరుల ధనాన్ని, పరస్త్రీని ఆశిస్తే అంధకారంలో ఉంచి కర్రలతో బాదుతారట. మహిళల ధనాన్ని అక్రమంగా తీసుకుంటే చీకట్లో నరికిన చెట్ల మీద పడేస్తారట.
మానవ జీవితం అంటేనే కర్మఫలితం. కర్మలు చేయడం వరకే మన పని. దాని ఫలితం భగవంతుడికి వదిలేయాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు. ఈ క్రమంలో కర్మలు చేయడం అంటే కేవలం తప్పిదాలు, పాపాలు చేయమని కాదు. మనిషిని ఏ అవసరానికైతే, ఏ కర్మను అనుభవించడం కోసం అయితే దేవుడు భూమి మీదకు పంపాడో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. అలా కాకుండా దారుణమైన పాపాలు, క్షమించరాని నేరాలు చేసే వారికి కర్మఫలం మరింత పెరుగుతుంది.
తల్లిదండ్రుల బాగోగులు చూడని వారిని నిప్పులు చెరిగే సూర్యుని కింద పడేసి మాడి మసయ్యేలాగా చిత్రవధ చేస్తారట. సంభోగించకూడని వారితో సంభోగం చేసిన వారిని.. ధగధగ మండే స్త్రీమూర్తి ఇనుమ విగ్రహాన్ని కౌగిలించుకొనేలా చేస్తారట. మహిళలైతే మండుతున్న పురుష విగ్రహాన్ని కౌగిలించుకొనేలా చేస్తారట. ఇక తీవ్రమైన అబద్ధాలు చెప్పిన వారికి మరో విపరీతమైన శిక్ష విధిస్తారని చెబుతున్నారు.
గరుడ పురాణంలో ఏం చెప్పారు..
ఇలాంటి వారికి వంద యోజనాలు కలిగిన పర్వతం పై నుంచి కిందకు తోసేస్తారట. పర్వతం పైనుంచి బలవంతంగా తోసేసి పచ్చడి పచ్చడి అయ్యేలా చేస్తారట. ఇలా నరకంలో అనేక రకాల శిక్షలు అమలు చేస్తారని చెబుతున్నారు. ఇవన్నీ గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పారని పెద్దలు చెబుతున్నారు. మొత్తం 84 లక్షల రకాల శిక్షలు ఉన్నాయని, ఒక్కో పాపానికి ఒక్కో శిక్ష వేసేలా ప్రణాళిక ఉంటుందని చెబుతారు.