Andhra Pradesh : రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం పెంచుకుని ఏపీకి మరిన్ని నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు రాబట్టడమే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ సూచనలు చేశారు. జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి సంబంధించిన కీలక అంశాలను బలంగా ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు.
కేంద్ర నిధులపై ప్రత్యేక దృష్టి
ప్రతి ఎంపీ తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి అవకాశాలు, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి మేలు జరిగేలా నిధులు, ప్రాజెక్టులు సాధించాల్సిన బాధ్యత ఎంపీలదేనని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఎంపీలకు కొన్ని కేంద్ర శాఖలను ప్రత్యేకంగా అప్పగించినట్లు వెల్లడించారు. ఆయా శాఖలకు సంబంధించిన ఏపీ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మంత్రులు, సెక్రటరీలతో సమన్వయం పెంచుకోవాలని సూచించారు.
అమరావతికి చట్టబద్ధత – ఈ సెషన్‌లోనే బిల్లు
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ఇదే బడ్జెట్ సెషన్‌లో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ అంశంపై కేంద్రంలోని సంబంధిత మంత్రులు, అధికారులతో ఎంపీలు నిరంతరం టచ్‌లో ఉండాలని సూచించారు. అమరావతి నిర్మాణ పనులు వేగవంతమయ్యాయని, రెండో దశ అభివృద్ధి కూడా త్వరలో ప్రారంభమవుతుందని వెల్లడించారు.
పూర్వోదయ – నల్లమల సాగర్ కీలక అంశాలు
వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్, పూర్వోదయ పథకం, పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతాంశాలుగా తీసుకోవాలని సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.12 వేల కోట్లు ఇంకా కేంద్రం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. 2027 జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వివరించారు.
‘వివాదాలు వద్దు… నీళ్లు కావాలి’
జలవనరుల ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్రాలతో అనవసర వివాదాలు వద్దని సీఎం స్పష్టం చేశారు. అయితే నల్లమల సాగర్ వంటి అంశాలు పార్లమెంటులో ప్రస్తావనకు వస్తే ఏపీ వాదనలు గట్టిగా వినిపించాలని ఎంపీలకు సూచించారు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మంజీరాకు నీళ్లు తరలించినా ఏపీ అభ్యంతరం చెప్పలేదన్న విషయాన్ని కేంద్రానికి వివరించాలని చెప్పారు.
రూ.40 వేల కోట్లతో పూర్వోదయ అభివృద్ధి
పూర్వోదయ ప్రాజెక్టు కింద రూ.40 వేల కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇచ్చాపురం నుంచి తడ వరకు నాలుగు లైన్ల రైల్వే ట్రాక్, ఫ్లైఓవర్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి రైల్వే శాఖ ద్వారా ఎక్కువ నిధులు రాబట్టే అవకాశం ఉందన్నారు. వైద్య రంగంలో ఏపీ ప్రస్తుతం దేశంలో రెండో స్థానంలో ఉందని పేర్కొంటూ, పీపీపీ విధానంలో ఆస్పత్రుల నిర్మాణానికి కేంద్రం వీజీఎఫ్ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
జాతీయ అంశాలపైనా గళం వినిపించాలి
రాష్ట్ర అంశాలతో పాటు జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఎంపీలు మాట్లాడాలని సీఎం సూచించారు. విభజన సమస్యలు, జాతీయ రహదారులు, సాగరమాల ప్రాజెక్టుల పురోగతిపై పార్లమెంటులో చర్చ జరగాలన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పే విధంగా ఎంపీలు చురుకుగా వ్యవహరించాలని సూచించారు.
దావోస్‌లో ఏపీ అభివృద్ధిపై అంతర్జాతీయ చర్చ
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగిందని వెల్లడించారు. ప్రపంచ సంస్థలు, ప్రముఖులు ఏపీ అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిపారు. ఎంపీలు ఎమ్మెల్యేలతో సమన్వయం పెంచుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేయాలని ఆయన సూచించారు.
ఇవీ చదవండి: Chandrababu Naidu : నగరిలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: ఆ పాలన మళ్లీ వస్తే రాష్ట్రం నాశనమే
Chandrababu at Davos : విదేశీ పెట్టుబడులకు ఇండియానే భద్రమైన గమ్యం: దావోస్ వేదికపై సీఎం చంద్రబాబు
