Chandrababu Naidu : చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని రాష్ట్రాభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల పాలనను తీవ్రంగా విమర్శించిన సీఎం, చెడ్డ వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజం నష్టపోతుందని ప్రజలకు హితవు పలికారు.
నేరస్తులు రాజకీయాల్లోకి వస్తే పాలన ఎలా ఉంటుందో గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు అనుభవించారని పేర్కొన్నారు. మంచి–చెడుల మధ్య తేడా ప్రజలు గుర్తించాలని, స్వచ్ఛమైన ఆలోచనలతోనే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని ఆయన అన్నారు.
స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రభుత్వ పథకం కాదు… ప్రజా ఉద్యమం
స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, ప్రజల జీవన విధానంగా మారాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి నెల మూడో శనివారం ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని తెలిపారు.
స్వచ్ఛాంధ్రలో భాగంగా రూ.573 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు.
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద రూ.510 కోట్లతో 101 ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టులు,
హోమ్ కంపోస్టింగ్ కోసం 9,048 బిన్స్,
గ్రామాల్లో చెత్త సేకరణకు 200 ఈ-ఆటోలు, 12 వేల ట్రైసైకిళ్లు, 5 వేల పుష్‌కార్టులు సిద్ధం చేసినట్లు తెలిపారు.
పట్టణాల్లో ఇప్పటివరకు 105 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ తొలగించామని, 2026 మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 100 శాతం లక్ష్యం సాధిస్తామని సీఎం చెప్పారు.
వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు – కాలుష్యానికి శాశ్వత పరిష్కారం
వచ్చే నెల నుంచి కర్నూలు, రాజమండ్రి, కడప, నెల్లూరు జిల్లాల్లో నాలుగు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను పీపీపీ మోడల్‌లో ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రెండు సంవత్సరాల్లో ఇవి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తాయని తెలిపారు. విజయవాడ, తిరుపతిలో కూడా ఈ తరహా ప్లాంట్లకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ లక్ష్యం
ప్రజల సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని సీఎం ప్రకటించారు. ఇప్పటికే 17 మున్సిపల్ కార్యాలయాలు పూర్తిగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపివేశాయని తెలిపారు.
ఈ-వేస్ట్ సేకరణలో ఇప్పటివరకు 30 టన్నుల ఈ-వేస్ట్‌ను సేకరించినట్లు చెప్పారు.
రోజుకు 108 మిలియన్ లీటర్ల మురుగు నీటి శుద్ధి కోసం 33 ఎస్టీపీలను చేపట్టామని, త్వరలో మరో 82 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి
గత ఐదేళ్ల పాలనను తీవ్రంగా విమర్శించిన సీఎం చంద్రబాబు, ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారని ఆరోపించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం విముక్తం చేసిందన్నారు.
టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి 94 శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. అమరావతిపై గత ప్రభుత్వం విషం చిమ్మిందని, అయినా ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.
ప్రజల భూములకు పూర్తి భద్రత
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను “దుర్మార్గపు చట్టం”గా అభివర్ణించిన సీఎం, ఆ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులను కాపాడామని తెలిపారు. రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చి భూములకు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.
విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలపై భారం పడనివ్వమని హామీ ఇచ్చిన సీఎం, యూనిట్‌కు 39 పైసల ఖర్చు తగ్గించామని వెల్లడించారు. భవిష్యత్‌లో కరెంట్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు.
నగరిని కుప్పం తరహాలో అభివృద్ధి చేస్తాం
నగరి నియోజకవర్గాన్ని కుప్పం మాదిరిగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
2029 ఎన్నికల నాటికి నగరికి కృష్ణా జలాలు తీసుకొస్తామని, పరిశ్రమలు తీసుకొచ్చి వలసలను అడ్డుకుంటామని ప్రకటించారు.
అనంతరం పీ4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మార్గదర్శులను సీఎం సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: YS Jagan PC : రీసర్వేపై సంచలన విషయాలు వెల్లడించిన వైఎస్ జగన్.. చంద్రబాబు క్రెడిట్ చోరీపై హాట్ కామెంట్స్
Chandrababu at Davos : విదేశీ పెట్టుబడులకు ఇండియానే భద్రమైన గమ్యం: దావోస్ వేదికపై సీఎం చంద్రబాబు
