Chandrababu at Davos : ప్రపంచ వ్యాప్తంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అత్యంత సురక్షిత దేశంగా భారతదేశం నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే ఆశగా చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా రూపాంతరం చెందుతోందని తెలిపారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరుగుతున్న దావోస్‌లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంజ్ను కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. “Partner with India” అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ లాంజ్‌లో కొద్దిసేపు సమావేశం నిర్వహించారు.
నేషన్ ఫస్ట్… టీమ్ ఇండియా స్పూర్తి
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, దేశ ప్రయోజనాలే ముందుగా అన్న భావనతో అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. “నేషన్ ఫస్ట్ అనేదే టీమ్ ఇండియా నినాదం” అని స్పష్టం చేశారు. రాష్ట్రాలుగా వేరువేరుగా ఉన్నప్పటికీ దేశంగా మాత్రం మనమంతా ఒక్కటేనని తెలిపారు.
రాష్ట్రాల మధ్య పోటీ ఉన్నా, ఆ పోటీ దేశాభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్నారు. పరస్పరం సహకారం అందించుకుంటూ భారత్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ
ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా వేగంగా ఎదుగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే రెండేళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని, అలాగే 2047 నాటికి అగ్రస్థానానికి చేరుకునే దిశగా దేశం ప్రయాణిస్తున్నదని విశ్వాసం వ్యక్తం చేశారు.
శక్తివంతమైన నాయకత్వం కలిగిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ వేదికలపై భారత సామర్థ్యాన్ని స్పష్టంగా చాటిచెప్పారని సీఎం ప్రశంసించారు.
సంపదతో పాటు ప్రజల జీవన ప్రమాణాలపై దృష్టి
అభివృద్ధిలో సంపద సృష్టి ఎంత ముఖ్యమో, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కూడా అంతే కీలకమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబ జీవన స్థాయి మెరుగుపడేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి వేదికలు ప్రపంచం ఎలా ముందుకు వెళ్తోందో తెలుసుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతోందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: Chandrababu Naidu : రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పారిశ్రామికవేత్తలతో భేటీలు
Highways : హైవే నిర్మాణంలో భారత్‌కు ప్రపంచ గర్వకారణం.. అమరావతి–బెంగుళూరు కారిడార్‌కు ‘బీకేవీ’ పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు సూచన
