HomeAndhra PradeshBhogapuram Airport: పని మాది.. ప్రచారం చంద్రబాబుది.. భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు

Bhogapuram Airport: పని మాది.. ప్రచారం చంద్రబాబుది.. భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు

Bhogapuram Airport: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ.. దాని నిర్మాణ క్రెడిట్‌పై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం కీలకమైన పనులన్నీ తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ‘పని వైయస్సార్‌సీపీది.. ప్రచారం చంద్రబాబుది! క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్.. అదే చంద్రబాబు మార్కు రాజకీయం’ అంటూ జగన్ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు.

భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్రకు కొత్త ఊపు: జగన్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా నిలుస్తుందని జగన్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం ద్వారా భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని అభిప్రాయపడ్డారు. ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రావడం వల్ల వ్యాపారం, వాణిజ్యం, పర్యాటకం సహా ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.

‘2019లో చంద్రబాబు చేసింది శంకుస్థాపన మాత్రమే’

భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో చంద్రబాబు పాత్రపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావుడిగా శంకుస్థాపన చేయడం మినహా అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన కీలక ప్రక్రియలు తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని జగన్ పేర్కొన్నారు. 2020 జూన్‌లో GMRతో కన్సెషన్ అగ్రిమెంట్, భూసేకరణ, పునరావాసం, సైట్ క్లియరెన్స్, NOCలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్, అంతర్గత రోడ్లు, ఏరోనాటికల్ సర్వీసులు, ఆర్థిక సమీకరణ వంటి అంశాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిందని చెప్పారు.

‘భోగాపురం కోసం రూ.1,200 కోట్లు ఖర్చు చేశాం’

ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూసేకరణను తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని జగన్ పేర్కొన్నారు. నిర్వాసితులైన నాలుగు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించినట్లు తెలిపారు. తన పోస్టులో జగన్ పేర్కొన్న లెక్కల ప్రకారం.. భూసేకరణ, R&R కోసం రూ.967 కోట్లు, నీటి సరఫరాకు రూ.75 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్లకు రూ.7.29 కోట్లు, సబ్‌స్టేషన్‌కు రూ.2.35 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మొత్తంగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన పనుల కోసం తమ ప్రభుత్వం సుమారు రూ.1,200 కోట్లు వెచ్చించిందని జగన్ పేర్కొన్నారు.

‘కోవిడ్ ఉన్నా పనులను కీలక దశకు తీసుకెళ్లాం’

కరోనా సంక్షోభం వంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ విమానాశ్రయ పనులను ముందుకు తీసుకెళ్లామని జగన్ చెప్పారు. 2024 ఎన్నికల సమయానికి రన్‌వే పనులను కీలక దశకు తీసుకురావడంతో పాటు టెర్మినల్ నిర్మాణాన్ని కూడా వేగంగా చేపట్టామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేసిన పనుల కారణంగానే 2026 జూన్ నాటికి భోగాపురం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని అప్పట్లోనే ప్రకటించామని, ఇప్పుడు ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి సిద్ధమవడం తమ కృషికి ఫలితమని జగన్ వ్యాఖ్యానించారు.

విశాఖ-భోగాపురం రోడ్డుపై చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు

విమానాశ్రయ నిర్మాణ క్రెడిట్‌తో పాటు విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. విశాఖ నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు 77 మీటర్ల వెడల్పుతో, రూ.6,300 కోట్ల అంచనా వ్యయంతో 55 కిలోమీటర్ల ఆరు లేన్ల హైవే కోసం గతంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ రహదారిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని గుర్తుచేసిన జగన్.. ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నప్పటికీ రహదారి విషయంలో పురోగతి ఎందుకు లేదని చంద్రబాబును ప్రశ్నించారు. సరైన రోడ్డు కనెక్టివిటీ లేకపోతే విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినా విశాఖ నుంచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్ విమర్శించారు.

‘క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్’

భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో చంద్రబాబు ‘Credit Without Contribution’ రాజకీయాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, ఇతరులు చేసిన పనులను తమ ఖాతాలో వేసుకోవడం మానుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.

భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఎయిర్‌పోర్టు క్రెడిట్ పాలిటిక్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. జగన్ పోస్టులో పేర్కొన్న అంశాలు, ఖర్చులు, పనులపై టీడీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Read also: YS Jagan with Tobacco Farmers: చంద్రబాబు పాలనలో అంతా దళారులదే రాజ్యం.. పొగాకు రైతులతో భేటీలో వైఎస్‌ జగన్ కీల‌క వ్యాఖ్య‌లు
YS Jagan Delhi Tour: వచ్చేవారం ఢిల్లీకి వైఎస్ జగన్? మోడీ-అమిత్ షాతో భేటీ? రాజకీయ సమీకరణాలు మారనున్నాయా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు