Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి నాందేడ్‌లోని తఖ్త్ సచ్ కండ్ గురుద్వారాను సందర్శించారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటైన హజూర్ సాహిబ్‌లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్‌కు వచ్చిన పవన్ కళ్యాణ్, మధ్యాహ్న సమయంలో సచ్ కండ్ గురుద్వారాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గురుద్వారా ఛైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో సిక్కు మత పెద్దలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
సంప్రదాయ సిక్కు ఆచారాలతో స్వాగతం
గురుద్వారాలో పవన్ కళ్యాణ్‌కు సంప్రదాయ సిక్కు తలపాగాను ధరింపజేసి గౌరవించారు. అనంతరం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి ప్రధాన మందిరంలో ప్రవేశించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబాకు ప్రార్థనలు చేశారు. పవిత్ర చాదర్‌ను సమర్పించి నమస్కరించారు. ఈ సందర్భంగా గురుద్వారా గ్రంథీలు పవన్ కళ్యాణ్‌కు, సీఎం ఫడ్నవిస్‌కు పవిత్ర వస్త్రాన్ని ధరింపజేసి ఆశీర్వదించారు. అనంతరం సమాధి మందిరం అంతర్భాగంలో ప్రదక్షిణ పూర్తి చేసి వెలుపలికి వచ్చారు.
నిషాన్ సాహిబ్‌కు నమస్కారం
గురుద్వారా ఎదుట అత్యంత పవిత్రంగా భావించే నిషాన్ సాహిబ్ వద్ద ఏర్పాటు చేసిన ధ్వజానికి పవన్ కళ్యాణ్ భక్తిపూర్వకంగా నమస్కరించారు. దర్శనం అనంతరం గురుద్వారా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషీన్‌ను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి ప్రారంభించారు.
పవన్ కళ్యాణ్‌కు ఘన సత్కారం
మొదటిసారి సచ్ కండ్ గురుద్వారాను సందర్శించిన పవన్ కళ్యాణ్‌ను సిక్కు మత పెద్దలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గురుద్వారా జ్ఞాపికతో పాటు సిక్కులు ధరించే పవిత్ర ఆయుధం కిర్పాన్‌ను బహూకరించారు. “శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ త్యాగం యుగయుగాలకు స్ఫూర్తి” గురుద్వారా దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
“శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ దేశమంతటికీ స్ఫూర్తిని అందించారు. ఆయన త్యాగం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. అలాంటి మహానీయుని 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనడం నాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను” అని తెలిపారు.
ఇవీ చదవండి: Pawan Kalyan : ఉగాది నుంచి 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు.. అన్ని శాఖలు భాగస్వాములవ్వాలి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Pawan Kalyan : తీర ప్రాంత అడవుల రక్షణకు యుద్ధప్రాతిపదికన చర్యలు.. గ్రేట్ గ్రీన్ వాల్, 50% గ్రీన్ కవర్ లక్ష్యాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Pawan Kalyan : కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : పవన్ కల్యాణ్
