Nara Lokesh : పూణే (మహారాష్ట్ర): ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రంలో దీర్ఘకాలిక అభివృద్ధి సాధ్యమవుతుందని, పాలసీల్లో స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పూణేలో Gokhale Institute of Politics and Economics ఆధ్వర్యంలో నిర్వహించిన Public Policy Festivalలో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి ఫెస్టివల్ కన్వీనర్ సిద్ధార్థ్ దేశాయ్ సంధానకర్తగా వ్యవహరించారు.
గతంలో పాలసీ అస్థిరత వల్ల పరిశ్రమల నష్టం
2019–24 మధ్య కాలంలో గత ప్రభుత్వం పీపీఏలను రద్దు చేయడంతో అనేక పరిశ్రమలు భయపడి పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని మంత్రి లోకేష్ గుర్తుచేశారు. పాలసీల్లో స్థిరత్వం లేకుంటే పెట్టుబడులు నిలబడవని, ప్రజలు ఈ అంశాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. 1995, 1999లో వరుసగా రెండుసార్లు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు హైదరాబాద్ ఐటీ హబ్‌గా ఎదగడం ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.
మనమిత్రతో సులభతర గవర్నెన్స్
రాష్ట్రంలో టెక్నాలజీ వినియోగంతో పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 36 శాఖలకు చెందిన వెయ్యికి పైగా సేవలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. జనరేటివ్ ఏఐ వినియోగంతో సేవలను మరింత మెరుగుపరుస్తున్నామని చెప్పారు.
మంగళగిరిలో స్కిల్ సెన్సస్‌ను ఏఐ ఆధారంగా విజయవంతంగా అమలు చేస్తున్నామని, కార్పెంటర్, ఏసీ మెకానిక్ వంటి వృత్తుల నైపుణ్య స్థాయిని కాన్వర్సేషనల్ ఏఐ ద్వారా అంచనా వేస్తున్నామని వివరించారు.
ల్యాండ్ రికార్డులు బ్లాక్‌చెయిన్‌పైకి
భూమి రికార్డులు దేశవ్యాప్తంగా పెద్ద సవాలుగా ఉన్నాయని, దీనికి పరిష్కారంగా ఏఐ + బ్లాక్‌చెయిన్ ద్వారా ల్యాండ్ రికార్డులను డిజిటల్‌గా మార్చుతున్నామని తెలిపారు. ఈ విధానంతో 24 గంటల్లోనే టైటిల్ ట్రాన్స్‌ఫర్ పూర్తి చేసి భూ యజమానికి అందించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. త్వరలోనే ఇవి మనమిత్ర ద్వారా అందుబాటులోకి రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వైపు పరిశ్రమల ప్రవాహం – మూడు కారణాలు
గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి బడా సంస్థలు ఏపీ వైపు రావడానికి మూడు ప్రధాన కారణాలున్నాయని లోకేష్ చెప్పారు.
నిరూపితమైన నాయకత్వం – చంద్రబాబు నాయుడి విజన్
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ – వేగవంతమైన అనుమతులు
డబుల్ ఇంజిన్ సర్కార్ – కేంద్రం, రాష్ట్రం సమన్వయం
ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి ఒకే ఒక జూమ్ కాల్‌లో సమస్య పరిష్కరించి, ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు.
‘లిఫ్ట్’ పాలసీతో పరిశ్రమలకు ప్రోత్సాహం
పరిశ్రమల అనుమతుల కోసం అమలు చేస్తున్న “లిఫ్ట్” పాలసీ ద్వారా పెట్టుబడిదారులకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఐటీ రంగంలో ఒక్క ఉద్యోగం వస్తే పరోక్షంగా మరో ఐదు ఉద్యోగాలు వస్తాయని, దీంతో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని వివరించారు. పరిశ్రమల కోసం సింగిల్ పోర్టల్, వాట్సాప్ గ్రూపుల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.
చంద్రబాబుకు ఇష్టమైన క్వాంటమ్ వ్యాలీ
అమరావతిలో దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాసు వంటి సంస్థలతో కలిసి క్వాంటమ్ ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు.
రెన్యువబుల్ ఎనర్జీ, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, స్పేస్, మెడికల్ డివైసెస్ వంటి 22 రంగాలతో ఈ ప్రాజెక్టును అనుసంధానిస్తున్నామని తెలిపారు.
రాజకీయ సంకల్పమే కీలకం
చివరగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ— రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం గెలుస్తుందని, ఎఫ్‌డీఐ రాకకు పాలసీల స్థిరత్వమే కీలకమన్నారు. ముఖ్యమంత్రి విజన్‌ను అమలు చేయడానికి మంత్రివర్గం అంతా కలిసికట్టుగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: Andhra Pradesh : మోదీ తర్వాత ప్రధానిగా చంద్రబాబు లేదా లోకేష్! రాయిటర్స్ కథనంపై సెటైర్లే సెటైర్లు!
Breaking News : ఏపీ కేబినెట్ భేటీ.. ఢిల్లీకి లోకేష్.. నేటి ప్రధాన వార్తలు (04.09.2025)
