OpenAI: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) రంగంలో అగ్రగామిగా ఉన్న OpenAIలో మరో భారతీయుడు అత్యున్నత సాంకేతిక నాయకత్వ బాధ్యతలు చేపట్టడం విశేషంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన ఉదయ్ రుద్రరాజు తాజాగా CTO – Computeగా పదోన్నతి పొందారు. చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT)లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన AI సంస్థల్లో ఒకదానిలో కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలకు నాయకత్వం వహించడం భారతీయ టెక్ రంగానికి గర్వకారణంగా నిలిచింది. ఈ పదోన్నతిని ఆయన స్వయంగా లింక్డ్‌ఇన్ ద్వారా ప్రకటించారు.
ఐఐటీ కాదు.. ప్రతిభే ఆయనను ప్రపంచస్థాయికి చేర్చింది
ఉదయ్ రుద్రరాజు ప్రయాణంలో ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఐఐటీ, ఐఐఐటీ లేదా ఎన్ఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో చదవలేదు. హైదరాబాద్‌లోని CBITలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, అనంతరం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేశారు. విద్యార్థి దశలోనే అమెజాన్‌లో ఇంటర్న్‌గా పనిచేసి పరిశ్రమ అనుభవాన్ని సంపాదించారు. తర్వాత eBayలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరి క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తన సాంకేతిక ప్రతిభను చాటుకున్నారు.
eBay నుంచి Robinhood.. అక్కడి నుంచి xAI వరకు
eBayలో ఐదేళ్లకు పైగా పనిచేసిన అనంతరం ఉదయ్ రుద్రరాజు 2018లో ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ Robinhoodలో చేరారు. అక్కడ స్టాఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ప్రారంభమైన ఆయన కెరీర్, సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఇంజినీరింగ్, హెడ్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్థాయికి ఎదిగింది. భారీ స్థాయి క్లౌడ్ వ్యవస్థలు, స్కేలబుల్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఎలాన్ మస్క్ స్థాపించిన xAIలో హెడ్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్‌గా పనిచేస్తూ భారీ GPU క్లస్టర్లు, హై-స్పీడ్ నెట్‌వర్క్‌లు, AI డేటా సెంటర్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి నాయకత్వం వహించారు.
OpenAIలో ఏడాదిలోనే CTO – Compute పదోన్నతి
2025లో OpenAIలో Compute & Infrastructure విభాగానికి నాయకత్వం వహించేందుకు చేరిన ఉదయ్ రుద్రరాజు, కేవలం ఏడాదిలోనే CTO – Computeగా పదోన్నతి పొందారు. OpenAI అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక AI మోడళ్లకు అవసరమైన కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విస్తరించడం, నెట్‌వర్క్, స్టోరేజ్, మెషిన్ లెర్నింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ఆయన ప్రధాన బాధ్యతగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద AI కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు.
భారతీయ యువతకు స్ఫూర్తి.. నైపుణ్యమే విజయానికి చిరునామా
ఉదయ్ రుద్రరాజు కెరీర్ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. విజయానికి కేవలం ప్రముఖ కళాశాలలో చదవడమే ప్రమాణం కాదని, నిరంతర అభ్యాసం, సాంకేతిక నైపుణ్యం, కృషి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉంటే ప్రపంచస్థాయి అవకాశాలు సొంతమవుతాయని ఆయన నిరూపించారు. హైదరాబాద్‌లోని CBIT నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణం, నేడు ప్రపంచ AI రంగంలో అత్యంత కీలకమైన నాయకత్వ స్థానానికి చేరుకోవడం భారతీయ విద్యార్థులు, యువ ఇంజినీర్లకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది.
Read also: Apple: యాపిల్ నుంచి కొత్త AI ఫీచర్ ‘Live Notes’.. Genius Barలో రిపేర్ ప్రక్రియ మరింత స్మార్ట్!
Android 18: కీలక మార్పులు.. Gemini తరహా అధికారాలు ఇతర AI అసిస్టెంట్లకూ!
Actress Laila: ఆ హీరో అంటే క్రష్.. ఆయన వైఫ్ కు తెలిస్తే చంపేస్తుందంటూ లైలా సరదా కామెంట్స్
