Bank Jobs: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచ్‌లలో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 4, తెలంగాణలో 41 పోస్టులు ఉన్నాయి. బ్యాంకింగ్ అనుభవం కలిగిన గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం లభించనుంది.
రాష్ట్రాల వారీగా ఖాళీలు.. ఎక్కడెన్ని పోస్టులు?
పీఎన్‌బీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం గుజరాత్‌లో 77, కర్ణాటకలో 78, మహారాష్ట్రలో 67, తెలంగాణలో 41, తమిళనాడులో 51, పశ్చిమ బెంగాల్‌లో 80, అస్సాంలో 85 పోస్టులు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 4, జమ్మూ కాశ్మీర్‌లో 9, లద్దాఖ్‌లో 2, అరుణాచల్ ప్రదేశ్‌లో 4, మణిపూర్‌లో 6, మేఘాలయలో 8, మిజోరంలో 5, నాగాలాండ్‌లో 5, సిక్కింలో 5, త్రిపురలో 18 పోస్టులు భర్తీ చేయనున్నారు. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపడుతున్నారు.
అర్హతలు, వయోపరిమితి ఎలా ఉండాలి?
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదనంగా కనీసం ఒక సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరి. దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం, పరీక్ష ఎలా ఉంటుంది?
అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాష ప్రావీణ్య పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు – 150 మార్కులు ఉంటాయి. ఇందులో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్ష ఆగస్టు లేదా సెప్టెంబర్ 2026లో నిర్వహించే అవకాశం ఉంది.
దరఖాస్తు గడువు, ఫీజు, జీతం
అర్హత కలిగిన అభ్యర్థులు 2026 ఆగస్టు 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,180, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.59గా నిర్ణయించారు. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ప్రాథమిక వేతనంతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, వైద్య సదుపాయాలు, లీవ్ బెనిఫిట్స్ వంటి బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.
దరఖాస్తు చేసేముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివిన తర్వాతే దరఖాస్తు చేయాలి. ముఖ్యంగా విద్యార్హతలు, అనుభవం, స్థానిక భాష అర్హత, అవసరమైన సర్టిఫికెట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయడం మంచిది. బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ మంచి అవకాశంగా చెప్పవచ్చు.
Read also: Gulf Jobs Crisis: గల్ఫ్‌లో ఉద్యోగాల సంక్షోభం.. భారతీయులకు గడ్డు పరిస్థితులు..
Reserve Bank of India: ఆర్బీఐలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు: మొత్తం 11 ఖాళీలు, మే 6 వరకు అప్లై చేసే అవకాశం
Bank Fraud: హైదరాబాద్‌లో బ్యాంక్ స్కామ్ షాక్.. కస్టమర్ ఖాతా నుంచి కోట్ల రూపాయలు డ్రా చేసిన మేనేజర్
