Telangana Weather Update: తెలంగాణలో ప్రస్తుతం చలి తీవ్రత ప్రజలను వణికిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. ఈ స్థాయి చలిని పదేళ్లలో ఎప్పుడూ చూడలేదని ప్రజలు అంటున్నారు. అయితే ఈ చలి తీవ్రత డిసెంబర్ 31 వరకే కొనసాగుతుందని, ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాల వాతావరణం కొనసాగనున్నప్పటికీ, సంక్రాంతి సమయానికి మళ్లీ చలి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. జనవరి చివరి వారం నుంచి చలి ప్రభావం క్రమంగా తగ్గుతుందని అంచనా. రాబోయే నాలుగు నుంచి ఐదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక చలితో పాటు వాయు కాలుష్యం హైదరాబాద్‌ను చుట్టుముట్టింది. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రమాదకర స్థాయికి చేరింది. అమీన్‌పూర్‌లో గరిష్టంగా 289, గచ్చిబౌలిలో 286, మాదాపూర్, విట్టల్‌రావు నగర్‌లలో 230 పాయింట్లు నమోదయ్యాయి. అలాగే సనత్‌నగర్, కూకట్‌పల్లి, బాలానగర్, సోమాజిగూడ, కోటి, బంజారా హిల్స్, మణికొండ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా సహా నగరంలోని పలు ప్రాంతాల్లో AQI 200 పాయింట్లు దాటింది.
చలి, పొగమంచు ప్రభావంతో పాటు వాహనాల ఉద్గారాలు, చెత్త దహనం కారణంగా గాలిలో సూక్ష్మ ధూళికణాలు భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం సమయంలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంటుందని, పారిశ్రామిక ప్రాంతాలు, ఐటీ జోన్లు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్ల పరిసరాల్లో AQI మరింత ఎక్కువగా నమోదవుతున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. గరిష్టంగా బాపట్లలో 31 డిగ్రీల ఉష్ణోగ్రత, కనిష్టంగా కళింగపట్నంలో 26.3 డిగ్రీలు నమోదైనట్లు సమాచారం.
ఇవీ చదవండి: Gold Rates: రికార్డు స్థాయికి బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతంటే?
Cold Waves: చలిపులి దెబ్బ.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు – వాతావరణశాఖ హెచ్చరిక
