Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ‘32 మంది బలిదానాలు, 16 వేల మంది నిర్వాసితుల త్యాగాలు, 24 వేల ఎకరాలు భూ సేకరణతో ఏర్పాటైన పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమ కోసం అంతమంది చేసిన త్యాగాలను ఎవరూ మరచిపోకూడదు. వారి త్యాగాలతో ఏర్పడిన పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం ప్లాంట్ (Vizag Steel) లో పని చేసే ప్రతి ఒక్కరితోపాటు కార్మిక, ఉద్యోగ సంఘాల నేతల్లో కూడా ఉండాలి’ అని పవన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఈ పరిశ్రమను కాపాడుకొనేందుకు కార్మికులు, ఉద్యోగులు, భూ నిర్వాసితులు తెలియచేసిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఆదివారం సాయంత్రం విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన వివిధ కార్మిక సంఘాలు, ఉక్కు పరిరక్షణ సంఘాల ప్రతినిధులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ కాకుండా కాపాడాలని ఆ ప్రతినిధులు కోరారు. 12,500 మంది ఉద్యోగులు, 14 వేలమంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని, వారికి కొద్ది నెలలుగా పలు అలవెన్సులు కూడా అందటం లేదని తెలిపారు. తమ ఆవేదనను కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు.
పవన్ మాట్లాడుతూ..
‘పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ బతకాలని కోరుకొనేవాడిని. అలాగే సహకార విధానంలో ఉన్నవి నిలబడాలని ఆకాంక్షిస్తాను. విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి మాట్లాడాము. కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసి ఎన్ని త్యాగాలు, పోరాటాలతో ఈ పరిశ్రమ ఏర్పాటైందో తెలిపాము. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర సభ నిర్వహించి ఉద్యోగ, కార్మిక సంఘాలు అన్నీ ఒక తాటిపైకి వచ్చి అఖిల పక్షంతో కేంద్రం దగ్గరకు వెళ్ళి విజ్ఞాపన ఇద్దాము అని చెబితే ఎవరూ ముందుకు రాలేదు. ఆ రోజే అందరూ కలసి వచ్చి ఉంటే ఇప్పుడు ఇంత ఆందోళన చెందాల్సి ఉండేది కాదు.
ప్రస్తుతం మీ ఆందోళనను కేంద్ర ప్రభుత్వానికి తెలియచేస్తాము. విశాఖ ఉక్కును నిలబెట్టుకొనేందుకు కార్మిక, ఉద్యోగ సంఘాల తరఫున మీరు చేసే ప్రతిపాదనలు వివరించాలి. అదే విధంగా మన వైపు నుంచి ఉన్న ఇబ్బందులను కూడా మనం తెలుసుకొని సరిదిద్దుకోవాలి’ అని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసే వివరాలపై వారితో చర్చించి నివేదికను రూపొందించారు. ఈ సందర్భంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ను ప్రయివేటీకరణ కాకుండా ఎలా కాపిండింది వివరించారు.
స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేద్దామన్నారా?
ఈ సందర్భంగా చర్చల్లో పవన్ కళ్యాణ్ కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడుతూ ‘నాటి ముఖ్యమంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేద్దామని మీ ముందు ప్రతిపాదించిన మాట నిజమేనా?’ అని అడిగారు. ఆ ప్రతిపాదన వాస్తవమే అని ఆ నేతలు తెలిపారు.
ఇవీ చదవండి: YS Sharmila: సెక్యులర్ పార్టీ రైటిస్ట్ పార్టీ అయ్యింది.. పవన్‌పై వైయస్ షర్మిల ఫైర్
Pawan Kalyan: స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం: పవన్
Pawan on YSRCP: జగన్ అమాయకుడు కాదు.. పవన్ కీలక వ్యాఖ్యలు
Varahi Decleration: వారాహి డిక్లరేషన్.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
Sanathana Dharma: సనాతన ధర్మం గురించి పవన్ కీలక ఉపన్యాసం
