HomeAndhra PradeshBCG Vaccine: 16వ తేదీ నుంచి 12 జిల్లాల్లో వయోజనులకు బీసీజీ టీకా

BCG Vaccine: 16వ తేదీ నుంచి 12 జిల్లాల్లో వయోజనులకు బీసీజీ టీకా

BCG Vaccine: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 నాటికి టీబీ కేసులను (TB Cases) పూర్తిగా నిర్మూలించటంతో పాటు కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 18 ఏళ్లు పైబడిన వయోజనుల్లో బీసీజీ టీకా అందించే కార్యక్రమాన్ని ఈనెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తొలి విడతగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రత్యేకించి ఆరు కేటగిరీల వారికి ఈ టీకాలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఐదేళ్ల క్రితం టీబీ మందులు వాడి వ్యాధి తగ్గించుకున్న వారు, 2021 సంవత్సరంలో టీబీ మందులు వాడిన రోగుల కాంటాక్ట్స్, మధుమేహ వ్యాధిగ్రస్తులు, ధూమపానం అలవాటు ఉన్న వారు, 60 ఏళ్లు పైబడిన వారు, BMI <18KGS/m2 ఉన్న కేటగిరీల్లోని వ్యక్తులకు బీసీజీ టీకాను వేస్తారు.

రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 6 కేటగిరీలకు చెందిన అర్హులైన వ్యక్తులకు మూడు నెలల వ్యవధిలో ఈ బీసీజీ టీకా అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని జిల్లా క్షయ నివారణ , జిల్లా ఇమ్యునైజేషన్ అధికారులు సంయుక్తంగా అమలు చేస్తారు. క్షేత్ర స్థాయిలో ఏఎన్ఎం, ఆశా, సీహెచ్ఓ, టీబీ ఛాంపియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు 12 జిల్లాలకు ఇప్పటికే నోడల్ అధికారులను నియమించినట్లు వైద్య శాఖ వెల్లడించింది.

బీసీజీ టీకా వయోజనులకు ఏ మాత్రం ఇబ్బందికరం కాదని, పూర్తిగా సురక్షితమైనదని వైద్య శాఖ తెలిపింది. టీబీ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే ఈ టీకా వేసుకోవాలని అధికారులు కోరారు. బీసీజీ టీకాలు వేసే ప్రక్రియను 12 జిల్లాలకు నియమించిన నోడలాఫీసర్లు పర్యవేక్షిస్తారని వైద్య శాఖ వెల్లడించింది.

ఇవీ చదవండి: Apple: రోజుకో యాపిల్‌ తినడం వల్ల వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన పని లేదు.. ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..
ST Commission: గిరిజనులకు వారి గ్రామంలోనే ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా మెరుగైన వైద్యం
AP Medical News: ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి వాకిన్‌ రిక్రూట్‌మెంట్‌
Vitamin D Deficiency: విటమిన్‌-డి కోసం రోజూ ఎంతసేపు ఎండలో ఉండాలి? వైద్యులు ఏం చెబుతున్నారు?
Family Doctor: ఫ్యామిలీ డాక్టర్‌.. మీ ఇంటి వద్దకే వచ్చి వైద్యం చేస్తాం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు