Andhra Pradesh: ఏపీలో పోలింగ్ ముందు రోజు, పోలింగ్ జరిగిన రోజు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడు, మాచర్ల, రాయలసీమలోని తాడిపత్రి, చంద్రగిరి, కుప్పం, తిరుపతి తదితర ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఎన్నికల్లో ఆధిపత్యమే ఏకైక అజెండాగా ఇరు వర్గాలూ చెలరేగాయి. పోలీసులకు పెద్ద సవాల్‌గా ఈ ఘటనలు మారాయి. అయితే, పోలింగ్ ముగిసిన మరుసటి రోజు కూడా ఇదే పరిస్థితి. చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, పల్నాడు జిల్లాల్లో శాంత్రిభద్రతలకు భంగం కలిగించేలా ఇరు పార్టీల శ్రేణులు సంయమనం కోల్పోయి రాళ్ల దాడులకు తెగబడ్డాయి.
తాడిపత్రిలో ఉద్రిక్తత
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాళ్లదాడికి టీడీపీ, వైసీపీ వర్గాలు పాల్పడ్డాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరుడిపై జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు దాడి చేశారు. జేసీ అనుచరుడు సూర్యముని ఇంటిపై పెద్దారెడ్డి వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఇరువర్గాలు పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. సూర్యమునిని ఇంట్లో ఉంచి రూరల్ సీఐ మురళీకృష్ణ తాళం వేశారు. ఇరువర్గాల రాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణ తలకు గాయం అయ్యింది. పీఎస్ వద్ద బైఠాయించి టీడీపీ శ్రేణులు ఆందోళన చేశాయి.
చిత్తూరులో టెన్షన్ టెన్షన్
శ్రీ పద్మావతి మహిళాయూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. నానిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. పులివర్తి నాని భద్రతా సిబ్బందికి కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించేందుకు వెళ్లిన నానిని వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాదోపవాదాలు, ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
మాచర్లలో ఘర్షణ వాతావరణం..
మాచర్లలో మారణహోమాన్ని తలపించేలా మూడు రోజులుగా ఘటనలు జరుగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పరస్పరం ఇరు వర్గాలూ దాడులకు పాల్పడ్డాయి. మాచర్లలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో అదనపు బలగాలను రంగంలోకి దింపారు. మాచర్ల ఆర్టీసీ గ్యారేజీ సమీపంలో వైసీపీ శ్రేణులు సమావేశం నిర్వహించారు. మాచర్ల నుంచి సాగర్ కు వెళ్లే దారిలో ఇరు వర్గాలూ దాడులకు తెగబడ్డారు. పోలింగ్ తదుపరి దాడుల్ని నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు. అందుకే అదనపు బలగాలను మోహరించారు.
ఇవీ చదవండి: Andhra Pradesh: ఏపీలో పోటెత్తిన ఓటరు.. అర్బన్, రూరల్లోనూ భారీగా పోలింగ్ నమోదు
SAMARTH APP: క్విక్ పోలీసింగ్ కోసం సమర్థ్ మొబైల్ యాప్ తీసుకొచ్చిన ఈసీ
EC Serious: పేరులేని రాజకీయ హోర్డింగ్‌లపై ఈసీఐ కొరడా
ECI: ఓటర్లకు అవగాహన పెంచేలా ఈసీఐ ప్రత్యేక చర్యలు ఇవీ..
