ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ (Family Doctor) కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. ఈ పథకంలో (Family Doctor) భాగంగా గ్రామాల్లో పల్లెలకు వైద్యులు వెళ్లి ఉచితంగా టెస్టులు చేయడంతో పాటు మందులు కూడా అందజేస్తారు.
దేవతలకు ధన్వంతరి అనే ఇంటి వైద్యుడు ఉండేవాడని మన పురాణాలు చెప్తాయి. ఆ తర్వాత చక్రవర్తులు, రాజులు, జమీందార్లు వంటివాళ్లకు కుటుంబ వైద్యుడు ఉన్నట్లు మన చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. అంతెందుకు? ధనవంతులకు ఇంటి దగ్గరికే వెళ్లి, వైద్యం చేసే డాక్టర్లు ఇప్పటికీ ఉన్నారు. వీళ్లనే ఫ్యామిలీ డాక్టర్ అంటారు.
నేరుగా ఇంటివద్దకు వచ్చి, ఆ కుటుంబంలోని వాళ్లకు వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందులు, చికిత్స చేయడం వీళ్ల డ్యూటీ. మరి ఇలాగే పేదల ఇంటి వద్దకు డాక్టర్లు వచ్చి వైద్యం చేస్తే? మందులు ఇచ్చి, చికిత్స చేసి ప్రాణాలు కాపాడితే? అద్భుతంగా ఉంటుంది కదా? ఏపీలో వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫ్యామిలీ డాక్టర్’ (Family Doctor) పథకం అచ్చంగా ఇలాంటిదే. లక్షలాది ప్రజల ఇంటి వద్దకే వచ్చి, వాళ్లను రోగాల బారి నుంచి కాపాడుతున్న సంజీవని ఇది.
నెలకు రెండుసార్లు ప్రతి గ్రామంలోకి..
పేద, మధ్యతరగతి ప్రజలకు అంతో ఇంతో అందుబాటులో ఉండేవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (ప్రైమరీ హెల్త్ సెంటర్స్-పీహెచ్ సీ). ఒక్కో పీహెచ్ సీలో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది కలిపి 14 మంది వరకు ఉంటారు. ఇందులోని ఇద్దరు డాక్టర్లకు ఆ పీహెచ్ సీ పరిధిలోని గ్రామ సచివాలయాలను కేటాయించారు. డాక్టర్లు తమ పరిధిలోని ఈ సచివాలయాలకు నెలకు రెండుసార్లు వెళ్లాలి.
వీళ్లకు తోడుగా మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) సిద్ధంగా ఉంటుంది. ఈ ఎంఎంయూలతో కలసి డాక్టర్లు గ్రామాలకు వెళ్తారు. అక్కడ ప్రజలకు అవసరమైన వైద్యం అందిస్తారు. మందులు ఇస్తారు. చికిత్సలు చేస్తారు. ఇలా రోజంతా ఆ గ్రామాల్లోనే ఉండి జనానికి అవసరమైన వైద్యసేవలు అందిస్తారు. సచివాలయం పరిధిలో జనాభా మూడువేలకు పైనే ఉంటే నెలలో మూడోసారి కూడా డాక్లర్లు గ్రామాలకు వెళ్తారు.
డాక్టర్ల షెడ్యూల్ ఇలా..
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ 104 ఎంఎంయూ వద్ద ఓపీ సేవలు ఉంటాయి. మంచానికి పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగులకు మధ్యాహ్నం నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం అందిస్తారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యం పరిశీలిస్తారు. 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో విలేజ్ క్లినిక్లకు అనుసంధానంగా ఈ ఫ్యామిలీ డాక్టర్ పథకం ఉంటుంది.
అందించే వైద్య సేవలు…
* జనరల్ ఒపి ( ఔట్ పేషెంట్) సేవలు.
* బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసులు చెక్ చేసి పర్యవేక్షించడం.
* గర్భిణులకు ప్రసవానికి ముందు అవసరమైన పరీక్షలు, పర్యవేక్షణ; బాలింతలకు అవసరమైన పరీక్షలు, ప్రసవానంతర సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స చేయడం. చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాలు గుర్తించడం.
* రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు అందించడం. అవసరమైన మందులు , ఏమి తినాలో సూచించడం
* ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్స జరిగిన రోగులు, దీర్ఘకాలిక (క్యాన్సర్ వంటివి) జబ్బులతో మంచానికే పరిమితమైన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం చేయడం.
14 రకాల వైద్య పరీక్షలు..
‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమంలో 14 రకాల పరీక్షలు చేస్తారు. మూత్ర పరీక్ష, హిమోగ్లోబిన్ టెస్ట్, షుగర్ టెస్ట్, మలేరియా , హెచ్‌ఐవీ, డెంగ్యూ టెస్టులు, మల్టీపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్), అయోడిన్ టెస్ట్, వాటర్ టెస్టింగ్, హెపటైటిస్-బి, పైలేరియా టెస్ట్, సిఫిలిస్ ర్యాపిడ్ టెస్ట్, చూపు సంబంధ టెస్ట్, ఏఎఫ్‌బీ టెస్టులు చేస్తారు. అలాగే మొత్తం 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయి.
పదివేలకు పైగా విలేజ్ క్లినిక్స్
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవల కోసం ప్రవేశపెట్టిన ‘ఫ్యామిలీ డాక్టర్’ప్రోగ్రాం అక్టోబర్ 21, 2022 నుంచి అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా విలేజ్ క్లినిక్స్ లో 24 గంటలపాటు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని 6,313 సబ్ సెంటర్స్ ఉండగా, వాటికి అనుబంధంగా 10032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేసింది. అలాగే ప్రతి 5 వేలమంది జనాభాకు హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేసింది. వీటన్నిటినీ అనుసంధానం చేసింది. ‘ఫ్యామిలీ డాక్టర్’ద్వారా ప్రతి పౌరుడి ఇంటి వద్దకు డాక్టర్లు వెళ్లి పరీక్షలు చేస్తారు. వారి అనుమతితో ఆరోగ్య సమాచారం డిజిటలైజ్ చేస్తారు. డిజిటల్ హెల్త్ ఐడీ క్రియేట్ చేస్తారు. అవసరమైతే కొన్ని కేసులకు ఫ్యామిలీ డాక్టర్ తరచూ వైద్య సేవలు అందిస్తుంటాడు.
పథకం గురించి ముఖ్యమంత్రి మాటలివీ..
సామాన్యుడికి వైద్యం అందించే విషయంలో దేశంలోనే కనీవినీ ఎరుగని ఒక గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టాం. ఈ రోజు పెన్షన్లు ఏ మాదిరిగా మీ ఇంటికి నడిచి వస్తున్నాయో.. అదే మాదిరిగా వైద్య సేవలు కూడా మీ గ్రామానికి, మీ సమీపానికి.. అవసరమైన సందర్భాల్లో మీ ఇంటికి కూడా కదిలివచ్చే కార్యక్రమే ‘ఫ్యామిలీ డాక్టర్’. ఏ పేదవాడు కూడా వైద్యం కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, ఆరోగ్య భరోసా కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నాం.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
Read Also : Andhra Pradesh: ధాన్యం కొనుగోళ్లలో గత ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి తేడా ఇదే..