గురువారం, 17 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

YS Jagan in Devarapalli: చంద్రబాబు పాలనలో ఒక్క గంజాయి పంట‌కే ధర.. దాన్ని సాగు చేస్తోంది వెన్నుపోటు పార్టీ వారే: వైఎస్ జ‌గ‌న్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 5 ఆగస్టు 2026
YS Jagan in Devarapalli:

YS Jagan in Devarapalli:  తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య నష్టపోతున్న పొగాకు రైతులతో స్వయంగా మాట్లాడేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు. స్థానిక పొగాకు కొనుగోలు కేంద్రం సందర్శించి, కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. పొగాకు పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర వివరాలు ఆరా తీశారు. రైతుల సమస్యలు, ఇబ్బందులపై వారితో నేరుగా చర్చించిన జగన్, అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్‌ ఏం మాట్లాడారంటే..

అన్నింటా విధ్వంసం.. ప్రశ్నిస్తే అరెస్టులు
ఈ 26 నెలల చంద్రబాబునాయుడుగారి పాలనలో ఈరోజు అన్ని వర్గాలు నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. ఈరోజు చంద్రబాబునాయుడుగారి పరిపాలన లో ఏం జరుగుతోంది అంటే, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు.. అన్నింటిలోనూ విధ్వంసమే కనిపిస్తోంది. ఇంకా చంద్రబాబునాయుడుగారి పరిపాలనలో పొద్దుట లేచినప్పటి నుంచి మనకు కనిపించేది ఏమిటి అంటే.. ఎవరైనా అన్యాయం అయిపోయిన పరిస్థితులలో ప్రశ్నిస్తే, అక్రమ కేసులు. అక్రమ అరెస్టులు. ఇవి మాత్రమే చంద్రబాబునాయుడుగారి పరిపాలనలో మనకు కనిపిస్తాయి.

రైతులు రోడ్డెక్కుతున్నారు
చంద్రబాబునాయుడుగారి పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ. ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నారు. రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో 26 నెలలు కనీసం ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధరలు వచ్చాయా అని అడుగుతున్నాను. 26 నెలలుగా వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, పెసర్లు, సజ్జలు, మిర్చి, పొగాకు, టమోటా, చీనీ పంటకు కానీ.. చివరకు మామిడి రైతులకు కూడా గిట్టుబాటు« ధర రాని పరిస్థితి. ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నా. ఈ పొగాకు రైతులు సంబంధించిన పంటను తీసుకున్నా, ఇవాళ కనిపిస్తున్నది ఏమిటి అని అంటే సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఆత్మహత్య చేసుకున్నా కనీస పరామర్శ లేదు
నా కళ్ల ఎదుటే జంగారెడ్డిగూడెం సమీపంలోని బుట్టాయిగూడెం మండలానికి చెందిన వెంకటేశ్వరరావుగారి కుటుంబం నిలబడి ఉంది. పది ఎకరాల్లో సాగు చేసి, గిట్టుబాటు ధర రాక, పంటను అమ్ముకోలేక ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భార్య ఈ రోజు నా ఎదుట నిలబడి ఉంది. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక్క ఎంపీ కానీ, ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క మంత్రి కానీ వెళ్లలేదు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కనీసం పరామర్శ కూడా చేయని ప్రభుత్వం ఇది.

నాడు పొగాకుకు అత్యధికంగా రూ.411.. ఇప్పుడు కేవలం రూ.214 మాత్రమే:
ఒక్కసారి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో పరిస్థితిని గుర్తు చేసుకుందాం. 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలు కలిపి పొగాకు సగటు ధర కిలోకు రూ.289 లభించింది. అత్యధిక ధర కిలోకు రూ.411 వరకు నమోదైంది. ఇవి నేను చెబుతున్న లెక్కలు కావు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) 2025, జనవరి 1న అధికారికంగా విడుదల చేసిన గణాంకాలు ఇవి. ఇప్పుడు పరిస్థితి ఏమిటని చూస్తే.. ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలు కలిపి రాష్ట్రంలో పొగాకు కిలో సగటు ధర కేవలం రూ.214 మాత్రమే.

అంటే ఒకప్పుడు రూ.289 వచ్చిన చోట ఇప్పుడు రూ.214 మాత్రమే వస్తోంది. అంటే ప్రతి కిలోపై రైతు సుమారు రూ.75 నష్టపోతున్నాడు. ఇదే ఉత్తరాది ప్రాంతంలో, ఇదే దేవరపల్లి ప్రాంతంలో, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో 2023–24లో పొగాకు కిలో సగటు ధర రూ.326 ఉండేది. ఇప్పుడు అదే ప్రాంతంలో ఆ సగటు ధర కేవలం రూ.236కి పడిపోయింది. ఒకవైపు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు, పెట్టుబడి వ్యయం అన్నీ పెరుగుతున్నాయి. మరోవైపు రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ధరలు కూడా ఇప్పుడు రైతుకు రావడం లేదు. అంతే కాదు, పండించిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

అతి తక్కువగా కొనుగోళ్లు
ఈ ఉత్తరాది ప్రాంతంలో సుమారు 83 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా, 105 రోజుల వేలం ముగిసే సమయానికి కొనుగోలు చేసినది కేవలం 10 మిలియన్‌ కిలోలు మాత్రమే. అంటే మొత్తం ఉత్పత్తిలో సుమారు 12 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. టొబాకో బోర్డు రైతులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. పంట వేయండి. మేము కొనుగోలు చేస్తామని చెప్పింది. ఆ హామీని నమ్మి రైతులు సాగు చేశారు. కానీ ఇప్పుడు హామీ ఇచ్చిన మేరకు కొనుగోలు జరగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 232 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా, ఇప్పటివరకు కొనుగోలు చేసినది కేవలం 47.3 మిలియన్‌ కిలోలు మాత్రమే. అంటే మొత్తం ఉత్పత్తిలో సుమారు 21 శాతం మాత్రమే కొనుగోలు చేశారు.

ఇది రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితి. ఈ పరిస్థితికి బాధ్యత ఎవరిది? రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఇంకా నేను అడుగుతున్నాను. రైతులు నమ్మి పంట వేస్తే, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. టొబాకో బోర్డు లిఖితపూర్వకంగా 142 మిలియన్‌ కిలోల పొగాకును కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నమ్మి రైతులు పంట వేశారు. కానీ చివరకు కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్‌ కిలోలు మాత్రమే. అంటే హామీ ఇచ్చిన పరిమాణంలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. 105 రోజుల వేలం ప్రక్రియ ముగిసిపోయినా రైతుల వద్ద ఇంకా పెద్ద మొత్తంలో పొగాకు నిల్వలు ఉన్నాయి. ఇది రైతులకు ఎంతటి దుర్భర పరిస్థితిని తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

నా పర్యటన ప్రకటన.. రూ.10 పెంపు
ఈరోజు నేను దేవరపల్లి వస్తున్నానని ప్రకటించిన తర్వాతే గత వారం, పది రోజులుగా కిలోకు సుమారు రూ.10 ధర పెరిగింది. నేను రాకపోయి ఉంటే ఆ పెంపు కూడా ఉండేది కాదు. ఈరోజు ఇక్కడ అత్యధిక ధర రూ.260 నుంచి రూ.262 వరకు మాత్రమే ఉంది. సగటు ధర రూ.174 వరకు పడిపోయింది. ఈ ధరలతో రైతు ఎలా బతుకుతాడు? ఎలా అప్పులు తీర్చుకుంటాడు? ఎలా మళ్లీ పంట వేస్తాడు?.

దళారుల సిండికేట్‌.. అయినా నో యాక్షన్‌
పంట కొనుగోలు సక్రమంగా జరగడం లేదు. ఎక్కడ చూసినా 30 నుంచి 40 శాతం వరకు పొగాకును రిజెక్ట్‌ చేస్తున్నారు. ‘నో బిడ్స్‌‘ పేరుతో వేలంలో కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీని వెనుక దళారుల సిండికేట్‌ పని చేస్తోందని రైతులే చెబుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఒక్క కొనుగోలుదారుని కూడా బ్లాక్‌లిస్ట్‌ చేయలేదు. ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. రైతుకు భరోసా కల్పించే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు.

గత మా ప్రభుత్వంలో ఏం చేశామంటే..
అదే మా ప్రభుత్వం హయాంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపాం. మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లు ప్రారంభించగానే ప్రతి గ్రేడ్‌కు కనీస ధర నిర్ణయించబడింది. కంపెనీల మధ్య పోటీ పెరిగింది. దాంతో రైతులకు మంచి ధర వచ్చింది. రిజెక్ట్‌లు తగ్గాయి. ‘నో బిడ్స్‌‘ పరిస్థితి తగ్గింది. అంతే కాదు.. నాడు మా ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. ఐదేళ్లలో రూ.7,800 కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. రైతు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని ఆదుకుంది.

ఇప్పుడు చేతులెత్తేసిన ప్రభుత్వం
కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది ఏమిటి? దళారులతో రాజీ పడింది. కంపెనీలతో సర్దుబాట్లు చేసుకుంది. మార్క్‌ఫెడ్‌ను పోటీ కొనుగోలుదారుగా మార్కెట్‌లోకి తీసుకురాలేదు. రైతును పూర్తిగా దళారుల దయాదాక్షిణ్యాలకే వదిలేసింది. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న మరో అన్యాయం ఏమిటంటే.. రాష్ట్రంలో 232 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తి అయినా, ప్రభుత్వం కేవలం 94 మిలియన్‌ కిలోలకు మాత్రమే మద్దతు ఇస్తామని చెబుతోంది. అంతే కాదు. కంపెనీలకు కిలోకు రూ.20 సబ్సిడీ ఇస్తామని ప్రకటిస్తోంది. ఈ సబ్సిడీ రైతుకు ఉపయోగపడేదా? అంటే కానే కాదు. కంపెనీలు రైతుకు ఇచ్చే ధరను మరింత తగ్గించే పరిస్థితి తీసుకొచ్చింది.

రైతు ప్రయోజనం కోసం ప్రభుత్వం పనిచేయాల్సింది పోయి, కంపెనీల ప్రయోజనాల కోసం విధానాలు రూపొందిస్తోంది. అందుకే నేను స్పష్టంగా చెబుతున్నాను. వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపాలి. ప్రతి గ్రేడ్‌కు కనీస మద్దతు ధర ప్రకటించాలి. మార్కెట్‌లో పోటీ వాతావరణం తీసుకు రావాలి. అప్పుడు మాత్రమే రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుంది. మా ప్రభుత్వం హయాంలో ఇదే విధానాన్ని అమలు చేసి పొగాకు రైతులను ఆదుకున్నాం. ఇప్పుడు కూడా అదే మార్గం మాత్రమే రైతును కాపాడగలదు.

చంద్రబాబు కంటితుడుపు మాటలు
ఇంకో విషయం వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చంద్రబాబుగారికి ఇప్పుడు గుర్తొచ్చిందట. అందుకే రూ.50 వేల వరకు మూడేళ్ల పాటు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెబుతున్నారు. నేను అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబునాయుడుగారూ, మా ప్రభుత్వం హయాంలో లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీ పంట రుణాలు ఇచ్చాం కదా! రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే లక్ష రూపాయల వరకు ఒక్క రూపాయి వడ్డీ కూడా లేకుండా రుణాలు అందే విధంగా కార్యక్రమాన్ని అమలు చేశాం. మా ప్రభుత్వ హయాంలో 84.66 లక్షల రైతులకు రూ.2,050 కోట్ల మేర సున్నా వడ్డీ రుణ ప్రయోజనం కల్పించాం. ఐదేళ్ల పాటు రైతును ఆదుకున్న చరిత్ర వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానిది.

మరి మీరు ఏమి చేశారు? సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. రైతులకే కాదు, మహిళలకూ పథకాన్ని రద్దు చేశారు. ఇప్పుడు అదే పథకాన్ని కొత్త పేరుతో రూ.50 వేల వరకు ఇస్తామని ప్రకటిస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారు. దీనికంటే పెద్ద మోసం ఇంకేమైనా ఉంటుందా? రైతులను ఆదుకోవాల్సిన సమయంలో ఆదుకోకుండా, ఎన్నికల హామీలను విస్మరించి ఇప్పుడు కొత్త పథకం తెచ్చినట్లు ప్రచారం చేయడం దౌర్భాగ్యం.

రైతులకు చంద్రబాబు దగా
ఇదొక్కటే కాదు.. ఎన్నికల సమయంలో పీఎం కిసాన్‌కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20 వేల చొప్పున ‘అన్నదాత సుఖీభవ‘ పేరుతో ఇస్తామని చంద్రబాబునాయుడుగారు హామీ ఇచ్చారు. మూడేళ్లకు కలిపి ప్రతి రైతుకు రూ.60 వేలు అందాలి. కానీ ఇప్పటివరకు ఇచ్చింది కేవలం రూ.19 వేలు మాత్రమే. అంటే ఒక్కో రైతుకు రావాల్సిన రూ.41 వేలు ఇవ్వకుండా ఎగవేశారు. అంతే కాదు. సుమారు 7 లక్షల మంది రైతులను ఈ పథకం జాబితా నుంచే తొలగించారు. కౌలు రైతులను తొలగించారు. అటవీ హక్కుల చట్టం (ఖౖఊఖ) కింద భూములు సాగు చేస్తున్న గిరిజన రైతులను కూడా పథకం నుంచి తప్పించారు. ఇంకా మా ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా రద్దు చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ సీజన్‌లో పంట నష్టం జరిగినా, అదే సీజన్‌ ముగిసేలోపు ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే వాళ్లం.

కానీ ఈ ప్రభుత్వం ఏమి చేసింది? మొంథా తుపాన్‌ వచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్క రూపాయి ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందలేదు. సున్నా వడ్డీ పథకం రద్దు చేశారు. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. వ్యవసాయ పరీక్షా ల్యాబ్‌లను కూడా బలహీనపర్చారు. రైతులకు అవసరమైన ఎరువుల ధరలు ఈ రెండేళ్లల్లో విపరీతంగా పెరగడమే కాకుండా, మరోవైపు బ్లాక్‌లో దళారీల వద్ద రైతన్నలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఈరోజు వ్యవసాయ రంగంలో ఉంది.

ఆ ఒక్క పంటకే గిట్టుబాటు ధర.. సాగు చేస్తోంది వెన్నుపోటు పార్టీ వారే:
నేను అందుకే చెబుతున్నాను. చంద్రబాబు హయాంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబుగారి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అది ఏ పంటో తెలుసా? అది గంజాయి.

చంద్రబాబు వింత మాటలు.. అంతా ఢమాల్‌:
చంద్రబాబునాయుడుగారు అంటాడు, బియ్యం తింటే క్యాన్సర్‌ వస్తుందంట. కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా ఢమాల్‌ చేసే కార్యక్రమం చేశాడు. చంద్రబాబుగారు ఇంకా అంటారు.. మిర్చి తింటే ఎసిడిటీ వస్తుందట!. కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు రాకుండా ఢమాల్‌ చేశాడు. చంద్రబాబునాయుడుగారు అంటారు.. మామిడి తింటే షుగర్‌ వస్తుందట!. అందుకే మామిడి పంటను కూడా ఢమాల్‌ చేశాడు. అందుకే గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు రోడ్డు మీదకి వచ్చాడు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్‌ దెబ్బతింటుందట!. పొగాకుకు మంచి రేటు వస్తే బాగుండదని చెప్పి, పొగాకు రైతులను కూడా ఢమాల్‌ చేశాడు.

ఆదుకుంటాం.. రెట్టింపు సాయం చేస్తాం
చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు హానికరం. వ్యవసాయానికి చంద్రబాబునాయుడుగారి పరిపాలన ప్రమాదకరంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది. ఈ ప్రభుత్వంలో ఈ మాదిరిగా ఆత్మహత్యలు చేసుకున్న వెంకట్రావు అన్న భార్య లాంటి కుటుంబాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కుటుంబాలకి అండగా ఉంటాం. ఇది ప్రభుత్వం తప్పిదం కాబట్టి ప్రభుత్వం స్పందించాల్సిన సమయంలో స్పందించడం లేదు కాబట్టి ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా రూ.7 లక్షలు ఇవ్వడం లేదు కాబట్టి, ఇవ్వని కారణంగా ఆ రూ.7 లక్షలకు డబుల్‌ చేసి, ఈ తల్లికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి చేస్తాం. ఇంకా ఆ కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.

మరోవైపు మార్క్‌ఫెడ్‌ను మళ్లీ బలోపేతం చేస్తాం. అలాగే రైతుకు కనీస గిట్టుబాటు ధర కచ్చితంగా కల్పిస్తాం. ఇంకా పంట కొనుగోలు వ్యవస్థలో పారదర్శకత తీసుకొస్తామని, దళారుల ఆధిపత్యాన్ని పూర్తిగా అరికడతామని, రైతు కష్టానికి తగిన విలువ దక్కే విధంగా వ్యవస్థను రూపొందిస్తామని జగన్‌ ప్రకటించారు.

ఇవీ చ‌ద‌వండి: YS Jagan tweet: నారాసుర పాలనలో అరాచకం పరాకాష్టకు చేరింది: వైఎస్‌ జగన్‌
YS Jagan in Srikakulam: యాక్సిడెంట్‌ను హత్య కేసుగా మారుస్తారా? సీదిరి అప్పలరాజు కుటుంబంపై ప్రభుత్వం కుట్ర: జగన్‌ ఫైర్‌
YS Jagan with Tobacco Farmers: చంద్రబాబు పాలనలో అంతా దళారులదే రాజ్యం.. పొగాకు రైతులతో భేటీలో వైఎస్‌ జగన్ కీల‌క వ్యాఖ్య‌లు

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading