YS Jagan tweet: రాష్ట్రంలో అరాచక పాలన పరాకాష్టకు చేరిందని, అధికార పార్టీకి చెందినవారు దాడులు చేస్తే వారికి రక్షణ కల్పిస్తూ.. దాడికి గురైన వైయస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధితులకు అండగా నిలిచిన ప్రజాప్రతినిధులపైనా కేసులు పెడుతూ, ప్రశ్నించినవారిని అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ ‘ఎక్స్’ వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు. “దాడి చేసినవారు అధికార పార్టీ వాళ్లయితే వారికి రక్షణ.. దాడికి గురైనవారు వైయస్సార్‌సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు. బాధితులకు అండగా నిలిస్తే ప్రజాప్రతినిధులపైనా కేసులు. ప్రశ్నిస్తే అరెస్టులు.. నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టడం. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం?” అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
ఎమ్మెల్యే విరూపాక్షి ఉగ్రవాదా?
ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని జగన్ నిలదీశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఇంటి తలుపులను బద్దలుకొట్టి, విరూపాక్షితోపాటు ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన తీరు చూస్తుంటే రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. చిప్పగిరి మండలం నేమకల్లులో వైయస్సార్‌సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయని జగన్ ఆరోపించారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని సదరు నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షికి ఫోన్ చేస్తే స్పందించడం నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా? అని ప్రశ్నించారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయని, ఈ ఘటనలో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారని పేర్కొన్నారు. చట్టం సక్రమంగా పనిచేస్తే దాడి చేసినవారిని అరెస్టు చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? అని నిలదీశారు. దాడి చేసినవారికి రక్షణ కల్పిస్తూ, బాధిత ఎమ్మెల్యేను నిందితుడిగా మార్చి ఆయనతోపాటు కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు బనాయించారని ఆరోపించారు.
సీసీటీవీ హార్డ్‌డిస్కులు ఎందుకు తీసుకెళ్లారు?
ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్‌డిస్కులను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అర్ధరాత్రి పోలీసులు తలుపులు ఎలా బద్దలుకొట్టారు? కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారు? ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారు? అనే దృశ్యాలు ప్రజలకు తెలియకూడదనే వాటిని తీసుకెళ్లారా? అని నిలదీశారు. సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే వాటిని మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా? అని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు.
రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చారు
శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదే తరహా అరాచకం కొనసాగుతోందని జగన్ విమర్శించారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారని ఆరోపించారు. సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను వెళ్లినప్పుడు లక్షలాది మంది సంఘీభావంగా తరలివచ్చారని తెలిపారు. ఆ ప్రజాస్పందన చూసి ప్రభుత్వం భయపడిందని, అందుకే ఒక వీడియో క్లిప్‌ను వక్రీకరించి చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు నమోదు చేసిందని ఆరోపించారు. అనేకమంది వైయస్సార్‌సీపీ నాయకులపైనా అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. “నాయకులు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు.. ప్రజలు నాయకులను కలిస్తే కేసులు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు.. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా? పోలీసు రాజ్యమా? లేక జంగిల్ రాజ్యమా?” అని జగన్ ప్రశ్నించారు.
ముస్తఫాపైనా రాజకీయ కక్షసాధింపు
గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోందని జగన్ ఆరోపించారు. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించినప్పటికీ ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టడం ఏమిటని నిలదీశారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ కేసు నమోదు చేయడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. కేవలం వైయస్సార్‌సీపీ నాయకుడనే కారణంతోనే ముస్తఫాపై కేసు పెట్టారా? అని నిలదీశారు.
Gen-Z ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కేసులు
రాష్ట్రంలోని Gen-Z యువత ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదని, వాటికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదని యువత ప్రశ్నిస్తోందన్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారని విమర్శించారు. మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడే రూ.1.08 లక్షలను ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ వద్ద సమాధానాలు లేవని జగన్ విమర్శించారు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు, అర్ధరాత్రి అరెస్టులు, పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
కార్యకర్తల ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు
అధికారం, పోలీసు బలం, అక్రమ కేసులు శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలని వైఎస్ జగన్ హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా, ఎన్ని తలుపులు బద్దలుకొట్టినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు. “బాధితులకు అండగా నిలుస్తాం. అన్యాయాన్ని నిలదీస్తాం. అరాచక పాలనపై పోరాడుతాం. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు. ప్రజలు వేస్తున్న ప్రశ్నలను ఆపలేరు” అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Read also: YS Jagan in Srikakulam: యాక్సిడెంట్‌ను హత్య కేసుగా మారుస్తారా? సీదిరి అప్పలరాజు కుటుంబంపై ప్రభుత్వం కుట్ర: జగన్ ఫైర్
YS Jagan with Tobacco Farmers: చంద్రబాబు పాలనలో అంతా దళారులదే రాజ్యం.. పొగాకు రైతులతో భేటీలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
Bhogapuram Airport: బాహుబలి సీన్ రిపీట్.. సోషల్ మీడియా దెబ్బకు ఏపీ పాలిటిక్స్ షేక్!






