AP Parishad Elections 2026: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు.. ఎర్రిపల్లి, నల్లపురెడ్డిపల్లెలో పెట్రోలు బాంబుల దాడులు.. పులివెందుల నుంచి పల్నాడు వరకు ఏజెంట్ల అడ్డగింతలు, అరెస్టులు.. అధికార పార్టీ నేతలు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఆరోపణలు..
పెట్రోలు బాంబులతో ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, కొన్ని ప్రాంతాల్లో పెట్రోలు బాంబుల దాడులు కలకలం సృష్టించాయి. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో పెట్రోలు బాంబులతో దాడులు జరిగినట్లు సమాచారం. పోలీసుల సమక్షంలోనే టీడీపీ వర్గీయులు ఈ దాడులకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. మరోవైపు వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఎర్రిపల్లిలో పోలింగ్ కేంద్రాల సమీపంలో పెట్రోలు బాంబులు విసరడంతో భారీగా మంటలు చెలరేగినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలతో రెండు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
రాష్ట్రవ్యాప్తంగా 582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జెడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది, ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2,61,52,377 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఇందుకోసం 31,460 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 9,966 సమస్యాత్మక, 9,186 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. దాదాపు 38 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
పులివెందులలో వరుస ఘటనలు
వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి దాడులు, అడ్డగింతలపై ఫిర్యాదులు అందాయి. లింగాల మండలం పార్లపల్లి పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుకొని, వారి పత్రాలు చించివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దొండ్లవాగులో స్థానికేతరులు కర్రలు, రాడ్లతో వచ్చి పోలింగ్ కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. వేముల జడ్పీ హైస్కూల్ వద్ద ఏజెంట్లు, ఓటర్లను అడ్డుకున్నట్లు సమాచారం. ఆర్.తుమ్మలపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త కృష్ణారెడ్డిపై రాళ్లు, సీసాలతో దాడి జరగడంతో ఆయన గాయపడ్డారు. ఎర్రిపల్లి, ఈ కొత్తపల్లి, మోటునూతలపల్లి, అరసవల్లి ప్రాంతాల్లో ఓటర్లను అడ్డుకోవడం, లాఠీఛార్జి ఘటనలపై ఫిర్యాదులు వచ్చాయి. లింగాలలో విలేకరి పుల్లారెడ్డిపై దాడి జరిగి, ఆయన సెల్‌ఫోన్ ధ్వంసమైనట్లు సమాచారం.
పెద్దముడియంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత
జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలం భూతపురం వద్ద వైఎస్సార్సీపీకి చెందిన కారుపై దాడి చేసి అద్దాలు పగులగొట్టినట్లు సమాచారం. గుండ్లకుంటలో పోలింగ్ కేంద్రం వద్ద స్థానికేతరులు ఓట్లు వేస్తున్నారంటూ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తనయుడు శివారెడ్డి పోలీసులను నిలదీశారు. జై.కొట్టాలపల్లి ఎంపీపీ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను వెనక్కి పంపుతున్నారని, వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు పంపారని ఆరోపణలు వచ్చాయి. రామసుబ్బారెడ్డి, ఆయన భార్య ఇందిరమ్మను ఓటు వేసేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం.
రాప్తాడు, హిందూపురంలో దాడుల ఆరోపణలు
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం నసనకోటలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ వర్గీయులు దాడి చేసినట్లు ఫిర్యాదులు అందాయి. కనగానపల్లి మండలం బద్ధలాపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్త పూజారి హరిపై దాడి జరిగినట్లు సమాచారం. హిందూపురం మండలం కిరికెర-3 ఎంపీటీసీ పరిధిలోని అప్పులకుంట పోలింగ్ కేంద్రంలో అభ్యర్థి రంగయ్య వద్ద ఉన్న ఏజెంట్ల నియామక పత్రాలను చించివేశారని ఆరోపణలు వచ్చాయి. ఉరవకొండ, విడపనకల్లు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పల్నాడు జిల్లాలో అరెస్టులు, అడ్డగింతలు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ, జూలకల్లు, వీరాపురం గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మాచవరం మండలంలో మాజీ సర్పంచ్ రాగిడి నరేష్, పార్టీ మండల కన్వీనర్ మద్దు ప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దాచేపల్లి మండలం భట్రుపాలెంలో ఏజెంట్లను అడ్డుకున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్తున్న జెడ్పీటీసీ అభ్యర్థి తండా అబ్దుల్ సత్తార్‌ను పోలీసులు మార్గమధ్యంలో నిలిపివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముప్పాళ్ల మండలం మాదలలో ఏజెంట్ల నియామక పత్రాల వ్యవహారంలో జోక్యం చేసుకున్న డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం.
ప్రకాశం జిల్లాలో ఏజెంట్లను బయటకు పంపారంటూ నిరసనలు
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని బబేవారిపాలెంలో పోలింగ్ కేంద్రాల్లోకి టీడీపీ వర్గీయులు చొరబడి వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలం రావిపాడు, వేంపాడు, నాయుడుపాలెం, పులిపాడు ప్రాంతాల్లో ఏజెంట్ల అడ్డగింతలు, రిగ్గింగ్ ఆరోపణలు వెలువడ్డాయి. తాళ్లూరు మండలం మాధవరం, శివరాంపురంలోనూ ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. కనిగిరి నియోజకవర్గంలోని తిమ్మారెడ్డిపల్లి, హుస్సేన్‌పురంలో ఏజెంట్లను పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం.
నంద్యాల, కర్నూలులోనూ వివాదాలు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం మండ్లెం పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలీసులు అడ్డుకోవడంతో నిరసన జరిగింది. బ్రాహ్మణకొట్కూరులోనూ ఏజెంట్లను వెనక్కి పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. కర్నూలు రూరల్ మండలం సుంకేసులలో ఏజెంట్ ఫారాలను లాక్కున్నట్లు ఫిర్యాదు అందింది. బండి ఆత్మకూరు మండలం లింగాపురంలో వైఎస్సార్సీపీ నాయకులు గోపిరెడ్డి వెంకటరెడ్డి, నరెద్దుల సుబ్బారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
చిత్తూరు, పుంగనూరులో ఉద్రిక్తతలు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కర్లగట్ట ఎంపీటీసీ అభ్యర్థి సరస్వతి భర్త రమేష్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. శివరామపురంలో మాజీ వైస్ ఎంపీపీ రమేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గుడిపాల మండలం కొత్తపల్లిలో ఎంపీటీసీ అభ్యర్థి ఎస్.రాజు కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం చారాల పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లను అనుమతించకపోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు నిరసన చేపట్టారు.
శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల్లో ఫిర్యాదులు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో జెడ్పీటీసీ ఏజెంట్ పత్రాలను చించివేసినట్లు సమాచారం. ఆకాశలక్కవరం పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరిగిందని, ఏజెంట్లను బయటకు పంపారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. సోంపేట మండలం పొత్రకొండలో ఓటర్లను అడ్డుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండలం బోరవంచలోని 140, 141 పోలింగ్ కేంద్రాల్లో అనధికార వ్యక్తుల ప్రవేశంపై వైఎస్సార్సీపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. గొల్లపల్లిలో స్టాంప్ ప్యాడ్ అందుబాటులో లేక కొంతసేపు పోలింగ్ నిలిచిపోయింది.
పలువురు మాజీ ఎమ్మెల్యేలకు హౌస్ అరెస్టులు
పోలింగ్ సందర్భంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, అన్నా రాంబాబు, కదిరి బాబురావు, బుర్రా మధుసూదన్ యాదవ్‌లపై పోలీసులు ఆంక్షలు విధించినట్లు సమాచారం. కొందరికి ముందస్తు నోటీసులు జారీ చేయగా, మరికొందరిని హౌస్ అరెస్టు చేసినట్లు వైఎస్సార్సీపీ తెలిపింది. కృష్ణా జిల్లా బాపులపాడులో మూల్పూరు ప్రభుకాంత్ను కూడా హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం.
రాయానిపేటలో పోలింగ్ బహిష్కరణ..
విశాఖ జిల్లా భీమిలి మండలం రాయానిపేటలో కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలోని 120 మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నట్లు సమాచారం. కృష్ణా జిల్లా జనార్దనపురంలో వర్షపు నీరు నిలవడంతో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు. చల్లపల్లిలో వీల్చైర్లు అందుబాటులో లేక దివ్యాంగ ఓటర్లు అవస్థలు ఎదుర్కొన్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 31 నుంచి 34 నంబర్ల పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిలిచిపోయినట్లు సమాచారం.
ఎన్నికల నిర్వహణపై ప్రశ్నలు
పోలింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి దాడులు, అరెస్టులు, ఏజెంట్ల అడ్డగింతలు, రిగ్గింగ్ ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పోలింగ్ ఏజెంట్లను కేంద్రాల్లోకి అనుమతించకపోవడం, ఓటర్లను అడ్డుకోవడంపై వైఎస్సార్సీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే, కడప, తిరుపతి వంటి ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ప్రభుత్వ అనుకూల టీవీ ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి. వివాదాస్పద ఘటనలపై ఎన్నికల అధికారులు, పోలీసులు స్పందించాల్సి ఉంది.
ఇవీ చదవండి: AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికల్లో గుర్తుల గందరగోళం.. విజయవాడలో గంటపాటు పోలింగ్ నిలిపివేత!
YS Jagan PC: రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తున్న చంద్రబాబు.. స్థానిక ఎన్నికల్లో అష్ట కుట్రల పర్వం: జగన్ ఫైర్






