AP DSC 2026: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అభ్యర్థులకు కీలక సమాచారం. మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నవంబర్ 11 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
2,721 పోస్టుల భర్తీకి డీఎస్సీ
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2026 నియామక ప్రక్రియను చేపట్టింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నవంబర్ 4న జీవో నంబర్లు 50, 51, 52 విడుదల చేసింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలలతోపాటు ఆదర్శ పాఠశాలలు, గురుకులాలు, ప్రత్యేక విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, ప్రత్యేక విద్య ఉపాధ్యాయ పోస్టులు ఈ నియామకాల్లో ఉన్నాయి.
పోస్టులవారీగా ఖాళీల వివరాలు
| పోస్టుల విభాగం | ఖాళీలు |
|---|---|
| జనరల్ పాఠశాలలు (ఎస్ఏ, ఎస్జీటీ) | 2,111 |
| ప్రత్యేక విద్య (ఎస్ఏ, ఎస్జీటీ) | 350 |
| సొసైటీలు, ఇతర యాజమాన్యాలు | 260 |
| మొత్తం | 2,721 |
జనరల్ పాఠశాలల్లో అత్యధికంగా 2,111 పోస్టులు ఉండగా, ప్రత్యేక విద్య విభాగంలో 350 పోస్టులు, ఇతర విద్యాసంస్థల్లో 260 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు తమ విద్యార్హతలు, టెట్ అర్హత ఆధారంగా సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నవంబర్ 11 నుంచి దరఖాస్తులు.. ముఖ్యమైన తేదీలివే
డీఎస్సీ-2026 సమగ్ర నోటిఫికేషన్ నవంబర్ 5న విడుదలైంది. నవంబర్ 11 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 5 నుంచి మాక్‌టెస్ట్ అందుబాటులోకి రానుంది. డిసెంబర్ 14 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 20 నుంచి 2027 జనవరి 13 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు. చివరి పరీక్ష పూర్తయిన రెండు రోజుల తర్వాత ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేస్తారు. అభ్యంతరాల నమోదుకు ఏడు రోజుల గడువు ఉంటుంది.
వయోపరిమితి, విద్యార్హతలు
2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 49 సంవత్సరాలు కాగా, నిర్దేశిత వైకల్యం ఉన్న అభ్యర్థులకు 54 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. ఎస్జీటీ పోస్టులకు సంబంధిత డీఎడ్/డీఎల్ఎడ్ అర్హతలు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సబ్జెక్టుకు అనుగుణంగా డిగ్రీ, బీఎడ్ వంటి అర్హతలు అవసరం. ప్రత్యేక విద్య పోస్టులకు ఆర్‌సీఐ గుర్తింపు పొందిన కోర్సులు తప్పనిసరి. పోస్టును బట్టి టెట్ అర్హత కూడా ఉండాలి.
డీఎస్సీ పరీక్ష విధానం ఎలా ఉంటుంది?
డీఎస్సీ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహిస్తారు. సాధారణ స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు రాతపరీక్షకు 80 శాతం, ఏపీ టెట్ లేదా సీటెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. ప్రత్యేక విద్య ఉపాధ్యాయ పోస్టులకు కూడా 80:20 విధానం అమలవుతుంది. ప్రిన్సిపాల్, నాన్ లాంగ్వేజ్ పీజీటీ, టీజీటీ పోస్టులకు ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ అర్హత పరీక్ష ఉంటుంది. పీజీటీ, ప్రిన్సిపాల్, పీడీ, పీఈటీ వంటి పోస్టులకు వేర్వేరు ఎంపిక నిబంధనలు వర్తిస్తాయి. మెరిట్, రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా నియామకాలు చేపడతారు.
దరఖాస్తు ఫీజు ఎంత? ఎలా అప్లై చేయాలి?
డీఎస్సీ-2026కు దరఖాస్తు ఫీజు ఒక్కో పోస్టుకు రూ.1,000గా నిర్ణయించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి సంబంధిత పోస్టును ఎంచుకోవాలి. విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు నమోదు చేసి అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి. అనంతరం ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి. జిల్లాలు, సబ్జెక్టులవారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, పరీక్ష సిలబస్ వివరాలను పరిశీలించిన తర్వాతే దరఖాస్తు చేయడం మంచిది.
అధికారిక వెబ్‌సైట్: https://tet2dsc.apcfss.in/
డీఎస్సీ జీవోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
2026SE_44979_MS50_E
2026SE_44980_MS51_E
2026SE_44981_MS52_E
ఇవీ చదవండి: YS Jagan with Governor: డీఎస్సీ అక్రమాలపై గవర్నర్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం
AP Mega DSC Sports Quota Row: ‘ఢీ’ఎస్సీపై వైఎస్సార్ సీపీ వర్సెస్ గవర్నమెంట్.. మెగా డీఎస్సీపై అట్టుడుకుతున్న AP






