బుధవారం, 16 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

YS Jagan PC on DSC: గ్రూప్-1పై, డీఎస్సీపై.. సీబీఐ విచారణకు రెడీనా? సీఎం చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ సవాల్‌

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 20 ఆగస్టు 2026

YS Jagan PC on DSC: గ్రూప్‌–1 పరీక్ష నిర్వహణపై సీబీఐ విచారణకు తాము సిద్దమని, అలాగే డీఎస్సీ–2025 పరీక్షపై సీబీఐ విచారణకు సీఎం చంద్రబాబు సిద్ధమా అని, దమ్ముంటే రెండింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్‌ చేశారు. గ్రూప్‌–1 పరీక్ష నిర్వహణ, ఉద్యోగాల భర్తీలో తాము ఏ తప్పూ చేయలేదని, అందుకే ధైర్యంగా ఉన్నామన్న ఆయన, డీఎస్సీ–2025లో ఏ తప్పూ జరగకపోతే సీఎం చంద్రబాబు ఎందుకంత భయపడుతున్నారని, సీబీఐ విచారణకు ఎందుకు సిద్ధం కావడం లేదని ఆయన ప్రశ్నించారు.

గ్రూప్‌–1, డీఎస్సీ–2025. రెండింటి నిర్వహణలో చాలా తేడా ఉందన్న జగన్, ప్రతి అంశాన్ని సమగ్రంగా వివరించారు. అసలు విద్యా శాఖ మంత్రి అనుమతి లేకుండా జీఓలు వస్తాయా? అని ప్రశ్నించిన ఆయన, గతంలో ఏనాడైనా అలా పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చారా? ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ప్రశ్నపత్రాల తయారీలో ఎలా ఉన్నాడని? బేరసారాలపై క్లియర్‌ ఫోన్‌ నెంబర్‌తో ఆడియో టేప్‌ ఉన్నా, ఆ వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. మరో కేసులో డీఎస్సీ ఉద్యోగం కోసం ఏకంగా రూ.14.10 లక్షల లంచం ఇచ్చినట్లు పక్కా ఆధారాలతో సహా చూపినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఏ చర్యా లేదని, వీటన్నింటికీ సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని సూటిగా ప్రశ్నించారు.

గ్రూప్‌–1 నోటిఫికేషన్, ప్రిలిమినరీ పరీక్ష రెండూ అంతకు ముందు చంద్రబాబు హయాంలోనే జరిగిన విషయాన్ని గుర్తు చేసిన జగన్, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే తాము మెయిన్స్‌ పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూల నిర్వహణ, 163 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఆ ప్రక్రియంతా పూర్తి పారదర్శకంగా జరిగిందని, ఎక్కడా, ఏ తప్పూ జరగలేదని స్పష్టం చేశారు. కేవలం కొడుకును కాపాడుకునేందుకు చంద్రబాబు విష ప్రచారం చేస్తూ, ఆ ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం చేయాలని కుట్ర చేస్తున్నారని.. డీఎస్సీ స్కామ్, గ్రూప్‌–1 పరీక్షలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్‌ స్పష్టం చేశారు. ప్రతి ఒక్క విషయాన్ని పక్కా ఆధారాలు, అంశాల వారీగా కూలంకషంగా వివరిస్తూ.. ప్రెస్‌మీట్‌లో జగన్‌ ఏమేం మాట్లాడారంటే..:

తప్పు చేశామని ఒప్పుకుంటారు.. కానీ..
ఈరోజు ప్రధానంగా రెండు అంశాలపై మాట్లాడుతున్నాను. వాటికి సంబంధించి నాణానికి మరోవైపు ఏమిటనేది చూపబోతున్నాను. డీఎస్సీ పరీక్షలో అక్రమాలు. మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలన్న విషయంపైనా.. ఇంకా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం కేవలం బురద చల్లేందుకు గత మా ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్‌–1 పరీక్షపై తప్పుడు ప్రచారాలు. అసలు వాస్తవాలు ఏమిటనేవి మాట్లాడబోతున్నాను.

అసలు డీఎస్సీ పరీక్షలో జరిగిన అక్రమాలు. మంత్రి నారా లోకేష్‌ రాజీనామా ఎందుకు చేయాలి? పరీక్షపై సీబీఐ విచారణ ఎందుకు జరగాలి? అన్న వాటిని వివరిస్తూ, ఆధారాలతో సహా చూపాం. గతంలో మేము ప్రస్తావించిన అంశాలను ఇప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం కూడా పరోక్షంగా అంగీకరించింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ అసెంబ్లీలో మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనం.

తప్పు చేశామని ఒప్పుకుంటారు. గింజుకుంటారు కానీ, మేము కోరుతున్నట్లు సీబీఐ విచారణకు మాత్రం అంగీకరించడం లేదు. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మాది. అయినా గుర్తించడం లేదు. ఎందుకంటే, అలా గుర్తిస్తే, ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించాలి. అప్పుడు నాకు సభా నాయకుడు సీఎంతో సమానంగా సమయం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి, మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇది ఎలా ఉందంటే.. గ్రౌండ్‌లో ప్రత్యర్థి టీమ్‌ లేకుండా, తండ్రీ కొడుకులు ఇద్దరూ బ్యాటింగ్‌ చేస్తూ, తమకు తామే కితాబునిచ్చుకుంటున్నారు.

అక్కడ చర్చించరు.. ఎందుకంటే..
ఎంత సేపూ అసెంబ్లీలోనే మాట్లాడతారు కానీ, పక్కనే కౌన్సిల్‌లో చర్చకు మాత్రం ముందుకు రావడం లేదు. ఎందుకంటే, అక్కడ మా పార్టీకి బలం ఉంది. చర్చ జరిగితే, వారి తప్పులన్నీ బయటకు వస్తాయి కాబట్టి. లోకేష్‌ రాజీనామా చేయాల్సిన అవసరం, సీబీఐ విచారణ అవసరం ప్రతి ఒక్కరికి తేటతెల్లం అవుతుంది కాబట్టి. అందుకే కౌన్సిల్‌లో చర్చకు అస్సలు ముందుకు రావడం లేదు.

పాయింట్‌ నెం–1.
ఒక్కరికే రెండు బాధ్యతలు
డీఎస్సీ పరీక్షల ప్రశ్నల తయారీ. పరీక్షల నిర్వహణ రెండూ వేర్వేరు అంశాలు. అయితే ఈ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్లు మంత్రి నారా లోకేష్‌ సభలో అంగీకరించారు. అంతే కాకుండా ఇంకా అందులో తప్పేముంది? అంటూ దబాయించారు.
(అంటూ ఆ వీడియోను ప్రెస్‌మీట్‌లో మీడియాకు ప్రదర్శించారు)
డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ ఎస్‌సీఈఆర్‌టీది. పరీక్షల నిర్వహణ కన్వీనర్‌ది. కానీ, ఇక్కడ రెండూ ఒక్కరే చేశారు. డీఎస్సీ నియామకాల చరిత్రలోనే.. ఈ రెండు బాధ్యతలు ఒకే వ్యక్తికి అప్పగించిన వ్యవహారం రాష్ట్రంలో జరగలేదు. ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణకు మధ్య చెక్స్‌ అండ్‌ బ్యాలెన్స్‌ కోసం ఇద్దరికి వేర్వేరుగా బాధ్యతలు అప్పగిస్తారు. గతంలో ఎప్పుడైనా అలాగే జరిగింది. కానీ ఇప్పుడు కేవలం మంత్రి నారా లోకేష్‌ మాత్రమే అలా నిర్వహించారు. ఈ రెండూ ఒకరే చేయడం వల్ల, చెక్స్‌ అండ్‌ బ్యాలెన్స్‌ పూర్తిగా తొలగించడం జరిగింది. దీంతో అక్రమాలకు మార్గం ఏర్పడింది. ఒకరి చేతిలోనే రెండు బాధ్యతలు పెట్టడం వల్ల ఇన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయి.

పాయింట్‌ నెం–2.
ప్రశ్నపత్రం తయారీలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి.
ఫస్ట్‌ ర్యాంక్‌ పొందినా ఉద్యోగం రాలేదు:
డీఎస్సీ ప్రశ్నపత్రం తయారీలో పాల్గొన్న నవీన్‌ అనే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి తొలి ర్యాంక్‌ వచ్చింది. దాన్ని తొలి మెరిట్‌ లిస్ట్‌లో చూరారు. కానీ, రెండో మెరిట్‌ లిస్ట్‌లో ఆ పేరు తొలగించారు.
(అంటూ రెండు మెరిట్‌ లిస్ట్‌ పీపీటీలో చూపారు)
కాగా, డీఎస్సీలో ఒక కేటగిరీలో నవీన్‌కు ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిందని తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒప్పుకున్నారు.
(అంటూ.. సభలో ఇద్దరి మాటల వీడియో చూపారు)

అలా తండ్రీ కొడుకులు ఇద్దరూ డీఎస్సీలో నవీన్‌కు ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. మరి ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిన నవీన్‌కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? తొలి మెరిట్‌ జాబితాలో నవీన్‌ పేరు ఉంది. కానీ, రెండో దాంట్లో ఆయన పేరు ఎందుకు తొలగించారు.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నవీన్‌ రాలేదు కాబట్టి, అనర్హుడయ్యాడని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. మరి అదే నిజమైతే, నవీన్‌ కోర్టును ఎందుకు ఆశ్రయించాడు? తన ఐడీ బ్లాక్‌ చేశారని, కాల్‌ లెటర్‌ పంపలేదని నవీన్‌ కోర్టును ఆశ్రయించాడు. ఆ మేరకు విద్యా శాఖకు మెయిల్‌ కూడా పెట్టాడు.
(అంటూ కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్, మెయిల్‌ రెండూ పీపీటీలో మీడియాకు చూపారు)

నేను ఆ తండ్రీ కొడుకులు ఇద్దరినీ అడుగుతున్నాను. లాగిన్‌ ఐడీ బ్లాక్‌ చేసి, కాల్‌ లెటర్‌ పంపనప్పుడు నవీన్‌ సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌కు ఎలా వస్తాడు? వాటి గురించి తండ్రీ కొడుకులు ఎందుకు మాట్లాడడం లేదు. నవీన్‌ ఐడీ బ్లాక్‌ చేశారని కానీ, కాల్‌ లెటర్‌ పంపలేదని కానీ ఎందుకు చెప్పడం లేదు? కారణం.. నవీన్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కాబట్టి. ఆయనకు క్వశ్చన్‌ బ్యాంక్‌ యాక్సెస్‌ ఉంది కాబట్టి. పరీక్షలో ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది కాబట్టి. లీకేజీ జరిగింది కాబట్టి. అతడికి ఉద్యోగం ఇస్తే, గోల అవుతుంది కాబట్టి.. అందుకే ముందస్తు జాగ్రత్తగా రెండో మెరిట్‌ లిస్టులో అతడి పేరు తొలగించారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి తొలి ర్యాంక్‌. అయినా అతడికి ఉద్యోగం ఇవ్వలేదు!. అందుకే నవీన్‌ కోర్టును ఆశ్రయించాడు. తన ఐడీ బ్లాక్‌ చేశారని, కాల్‌ లెటర్‌ పంపలేదని కోర్టుకు చెప్పాడు. మరి ఈ అక్రమాలన్నీ సీబీఆ దర్యాప్తు జరిగితేనే కదా తెలిసేది.

పాయింట్‌ నెం–3.
పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు:
డీఎస్సీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వడం.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. బహుషా దేశంలో కూడా జరిగి ఉండదు. అసలు పరీక్ష రాయకుండానే, స్పోర్ట్స్‌ కోటా కింద తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. దీని కోసం జీఓలు జారీ చేసినట్లు తండ్రీ కొడుకులు ఇద్దరూ అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఇంకా దాన్ని సమర్థించుకుంటూ ఏమన్నారు?

స్పోర్ట్స్‌ పర్సన్స్‌కు పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదట!. పీవీ సింధుకు నేరుగా ఉద్యోగం ఇచ్చారని, అలాగే ఇక్కడా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. అలా ఏకంగా 372 ఉద్యోగాలు ఇచ్చామంటూ, దానికి దీనికి పొంతన పెట్టారు.
(అంటూ.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ మాటల వీడియో చూపారు)

పీవీ సింధు పేరు చెప్పి 372 ఉద్యోగాలను ఇచ్చారట!. అసలు తండ్రీ కొడుకులు ఏం మాట్లాడారో వారికి తెలుస్తోందా? ఆ 372 మంది టీచర్లు పిల్లలకు ఎలా పాఠాలు చెబుతారు? అసలు డీఎస్సీ అనేది ఎందుకు? పాఠాలు చెప్పడానికి అర్హత ఉందని చెప్పే పరీక్ష డీఎస్సీ. అవేవీ లేకుండానే బుద్ధి ఉన్న వాడు ఎవరైనా అలా 372 ఉద్యోగాలు ఇస్తారా?.

పీవీ సింధూది ఒక ప్రత్యేక కేస్‌. ఆమె ఒలింపిక్స్‌లో పతకాలు సాధించారు. కామన్‌వెల్త్, ఆసియన్‌ గేమ్స్‌లో ఆమె పతకాలు సాధించారు. అసాధారణ ప్రతిభ చూపిన వారికి ఉద్యోగాల కల్పనకు ఒక ప్రత్యేక పాలసీ ఉంది.
(అంటూ ఆ పాలసీకి సంబంధించిన జీఓ పీపీటీలో చూపారు)

ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, ఆసియన్‌ గేమ్స్, ఆసియన్‌ పారా ఒలింపిక్స్, కామన్‌వెల్త్‌ గేమ్స్, వరల్డ్‌కప్, శాప్‌ కోచ్‌లు.. వారికి అలా ఉద్యోగాలు ఇవ్వాలని ఆ జీఓలో ఉంది. నేను అడుగుతున్నాను. స్పోర్ట్స్‌ కోటాలో నియమించిన 372 మందిలో ఎంత మందికి ఒలింపిక్స్‌లో, కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మెడల్స్‌ వచ్చాయి? సింధూ మాదిరిగా వారు ఎన్ని పతకాలు సాధించారు?.

ఇక్కడ మరో ప్రశ్న:
మీరు ఆమె(పీవీ సింధు)ను చూపి, ఆమెతో పోల్చి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ తర్వాత ఆ జీఓలు ఎందుకు రద్దు చేశారు. ఈ డీఎస్సీ కోసం ప్రత్యేకంగా 2025, ఏప్రిల్‌ 19న, రెండు జీఓలు.. జీఓ నెం:4, జీఓ నెం:47 జారీ చేశారు. ఏ పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేలా అందులో ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు.

ఆ తర్వాత మరో రెండు జీఓలు.. జీఓ నెం:23. జీఓ నెం:56 ఇచ్చి, పాత జీఓలు రద్దు చేశారు. అంటే గేట్లు ఎత్తి, తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకుని, ఆ తర్వాత గేట్లు మూసేశారు. పోటీ పరీక్ష పాస్‌ అయితేనే ఉద్యోగాలు ఇవ్వాలంటూ, మళ్లీ కొత్త జీఓల్లో చేర్చారు. అలా సవరణలతో కొత్త జీఓలు జారీ చేశారు.

నేను అడుగుతున్నాను. ఒకవైపు సింధూ పేరు ప్రస్తావించడంతో పాటు, మరోవైపు పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆర్చరీలో నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించిన దుర్గయ్య. ఆయనకు కాల్‌ లెటర్‌ ఇచ్చారు. కానీ, పోస్ట్‌ ఇవ్వలేదు. ఆయన బంగారు పతక విజేత.
(అంటూ దుర్గయ్య ఫోటో, కాల్‌ లెటర్‌ పీపీటీలో చూపారు)

కేవలం పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్స్‌తో..
ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు. లోకేష్‌ తోడల్లుడు ఎంపీ భరత్‌ జూడో అసోసియేషన్‌ అధ్యక్షుడు. వారు ఇచ్చిన పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్స్‌ ఆధారంగా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, పరీక్ష కూడా రాయకుండా, చివరకు డిగ్రీ కూడా లేని వారికి స్పోర్ట్స్‌ కోటాలో మొత్తం 372 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు కూడా కేవలం ఇంటర్‌ కాలేజీ స్థాయిలోనే. గతంతో డీఎస్సీ పాస్‌ అయిన తర్వాతే, స్పోర్ట్స్‌ సర్టిఫికెట్స్‌ చూసేవారు. కానీ కేవలం చంద్రబాబు, లోకేష్‌ హయాంలోనే అలా కాకుండా, కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా నేరుగా ఉద్యోగాలు ఇచ్చారు.

అలా తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాక, ఆ జీఓలు రద్దు చేస్తూ, మళ్లీ జీఓలు ఇచ్చారు. మరి దీనిపై సీబీఐ విచారణ జరగాలి కదా? జీఓలు ఇచ్చే స్థాయికి స్కామ్‌ జరిగిందంటే, ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్లా? లేదా? మంత్రి సంతకం లేకుండానే జీఓలు జారీ చేస్తారా?.

పాయింట్‌ నెం–4.
బేరసారాల ఆడియో. అయినా అరెస్టు లేదు:
స్పోర్ట్స్‌ కోటా పేరిట టీచర్‌ పోస్టుల అమ్మకాలకు సంబంధించి ఆడియో, వీడియోలు బయటకు వచ్చినట్లు అసెంబ్లీలో తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒప్పుకున్నారు.
(అంటూ, ఆ బేరసారాల ఆడియో, వీడియో మీడియాకు చూపారు)

ఇందులో ఆ బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్‌ నెంబర్‌ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఆ వ్యక్తి ఎవరో పోలీసులు కనుక్కోకుండా, ఎఫ్‌ఐఆర్‌లో ఆ వ్యక్తి పేరు రాయకుండా, కేవలం ‘సస్పెక్ట్‌’ అని మాత్రమే రాశారు. పైగా అతడికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదులో ఆలస్యానికి కారణం.. సీనియర్‌ అధికారులతో మాట్లాడినట్లు రాశారు. మరి ఎవరితో మాట్లాడినట్లు? అంటే ఆ స్థాయిలో కేసు నీరు గారుస్తూ.. అసెంబ్లీ సాక్షిగా తండ్రీ కొడుకులు ఎంత పచ్చి అబద్ధాలు చెప్పారో చూడండి.
(అంటూ దీనికి సంబంధించి అసెంబ్లీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ మాటలను పీపీటీలో మీడియాకు చూపారు)
అసెంబ్లీలో తండ్రీ కొడుకులు చెప్పినట్లు నిజంగా ఆ వ్యక్తిని అరెస్టు చేశారా? కోర్టు ముందు ప్రవేశపెట్టారా? జైలుకు పంపారా? అని చూస్తే..

ఆ అరెస్ట్‌ ఒట్టిదేనన్న సీసీటీఎన్‌ఎస్‌:
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌’ (సీసీటీఎన్‌ఎస్‌) లో చూస్తే.. ఆ వ్యక్తిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని ఉంది. ఆ విషయం డాక్యుమెంట్‌లో ఉంది.
(అంటూ సీసీటీఎన్‌ఎస్‌ డాక్యుమెంట్‌ను పీపీటీలో చూపారు)
నిజానికి ఆ వ్యక్తికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారు. కానీ, తండ్రీ కొడుకులు ఇద్దరూ, ఈ విషయంలో చాలా సీరియస్‌గా వ్యవహరించినట్టు, అతణ్ని అరెస్టు చేసినట్లు, చర్య తీసుకున్నట్లు పచ్చి అబద్దాలు చెబుతూ డ్రామా చేశారు.

మరో ఘటన:
ఒంగోలులో జరిగింది. డీఎస్సీలో జాబ్‌ ఇస్తామని చెప్పి, తనను మోసం చేశారని ఒక యువతి రాధిక ఫిర్యాదు చేసింది. రూ.14,10,000 ఇచ్చినట్లు, ఎవరికి, ఎలా ఇచ్చిందో ఆధారాలతో సహా ఆమె ఫిర్యాదు చేసింది. అయితే రెఫరెన్స్‌గా చూపిన వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. కానీ, ఆమెకు మాత్రం ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో ఆమె గట్టిగా అడగడంతో, టూరిజమ్‌ శాఖలో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. తనకు అన్యాయం జరిగిందని రాధిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే. వారు ఎఫ్‌ఐఆర్‌లో డీఎస్సీ పోస్టు కోసం బేరసారాలు జరిగినట్లు రాయకుండా, టూరిజమ్‌ శాఖలో పోస్టు కోసం బేరసారాలు జరిగినట్లు రాశారు. 2025, నవంబరు 20న ఎఫ్‌ఐఆర్‌ రాసినా, ఇప్పటి వరకు అరెస్టు లేదు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా చర్య లేదు. అంటే డీఎస్సీ విషయంలో ఎక్కడ, ఏ ఫిర్యాదు వచ్చినా, ఎలాంటి విచారణ లేకుండా వదిలేయడం జరుగుతోంది. తండ్రీ కొడుకుల ఆదేశాలతోనే పోలీసులు ఇంత బరి తెగిస్తున్నారు.

అక్కడ ఒక నీతి. ఇక్కడ ఒక నీతి నా?
డీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్‌ కోటా వరకు ప్రత్యేక జీఓలు. ఆపై బేరసారాల వరకు అన్నీ సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందా? లేదా? విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలా? వద్దా? అందుకే మా పార్టీ ఆ రెండింటినీ డిమాండ్‌ చేస్తోంది.

అక్కడ ‘నీట్‌’ లీకేజీకి బాధ్యత వహిస్తూ ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశాడు. నిజానికి అక్కడ ప్రత్యేంగా జీఓలు లేవు. వాటి రద్దు కూడా లేదు. ఇక్కడ డీఎస్సీలో అన్నీ అక్రమాలే. మరి అదే ఎన్‌డీఏలో భాగస్వామి అయిన చంద్రబాబుకు ఒక నీతి. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్‌కు మరో నీతి నా?.

గ్రూప్‌–1 పై పచ్చిగా తప్పుడు ఆరోపణలు:
డీఎస్సీలో లీకేజీ, ఉద్యోగాల భర్తీలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన కొడుకును కాపాడుకునేందుకు చంద్రబాబు మరింత దిగజారిపోయి.. 2018 ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 భర్తీపై పచ్చిగా తప్పుడు ఆరోపణలు చేస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు. నిజానికి నాడు చంద్రబాబు హయాంలోనే ఆ పరీక్షల ప్రిలిమ్స్‌ కూడా జరిగాయి. మేము వచ్చాక మెయిన్స్‌ మాత్రమే నిర్వహించాం. ఎక్కడా తప్పు చేయలేదు. అక్రమాలు చోటు చేసుకోలేదు. అయినా ఆ 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం చేయాలని చంద్రబాబు టార్గెట్‌ ఓరియెంట్‌గా పని చేస్తున్నాడు.

గ్రూప్‌–1. ఇవీ వాస్తవాలు:
– ఇప్పుడు డీఎస్సీ పరీక్షలో మాదిరిగా, అప్పుడు గ్రూప్‌–1లో పరీక్షల్లో పేపర్‌ లీక్‌ కాలేదు.
– ఇప్పటి డీఎస్సీలో మాదిరిగా ప్రశ్నపత్రాల తయారీలో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి ర్యాంక్‌ రాలేదు.
– ఎవరికి ఫేవర్‌ చేసేలా ప్రత్యేకంగా జీఓలు జారీ చేయలేదు.
– పరీక్షలు కూడా నిర్వహించకుండా ఉద్యోగాలు ఇవ్వలేదు.
– బేరసారాలు జరగలేదు. అందుకే ఆడియో, వీడియోలు లేవు.
– బయటకు వస్తుందల్లా.. చంద్రబాబు ఆక్రోషం. ఎలాగైనా తన కొడుకును కాపాడుకోవాలన్న ఆయన ఆరాటం మాత్రమే కనిపిస్తోంది.

గ్రూప్‌–1.. మరి కొన్ని నిజాలు:
చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలోనే 2025, ఏప్రిల్‌లోనే గ్రూప్‌–1 పరీక్షపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేశాడు. అయితే గ్రూప్‌–1 ఫైనల్‌ ఫలితాల వెల్లడిలో ఏ తప్పూ జరగలేదని, హైకోర్టులో గవర్నమెంట్‌ అడ్వకేట్స్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. 2025, నవంబరు 14న దాఖలు చేసిన ఆ అఫిడవిట్‌ చాలా స్పష్టంగా ఉంది. చంద్రబాబునాయుడుగారి ప్రభుత్వంలోనే, ఆయన అధికారులు దాఖలు చేసిన అఫిడవిట్‌ అది. దీంతో 2026, ఫిబ్రవరిలో అదే గ్రూప్‌–1 పరీక్షపై సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా రెండో సిట్‌ వేశాడు. అందులో ఉన్నది ఆయన అనుకూల అధికారులే. ఎవరిపై అయినా బురద చల్లడానికి సిట్‌లను వాడుకోవడం చంద్రబాబుకు అలవాటే కదా.

అసలు అందుకు అవకాశమేది? పేపర్స్‌ మూల్యాంకనం ఎలా చేశామంటే..:
2019 ఎన్నికలకు ముందు, అంటే ఎన్నికల నోటిఫికేషన్‌కు 76 రోజుల ముందు హడావిడిగా చంద్రబాబు గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ ఇచ్చారు. మా ప్రభుత్వం రాక ముందే.. అంటే 2019, మే 26న ప్రిలిమ్స్‌ కూడా నిర్వహించారు. మా ప్రభుత్వం ఏర్పడింది 2019, మే 30న. మేము వచ్చాక అంతకు ముందు జరిగిన ప్రిలిమ్స్‌ ఫలితాలు ప్రకటించి, మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాం. మరి ఇక్కడ మా స్వప్రయోజనాలు ఎక్కడి నుంచి వస్తాయి?.

మా ప్రభుత్వం రాకముందే, ప్రిలిమ్స్‌ జరిగాయి. ఆ తర్వాత మేము వచ్చాక, మెయిన్స్‌ నిర్వహించాం. అయితే అప్పుడు కోవిడ్‌ ఉండడంతో, ఆలస్యం కావొద్దన్న ఆలోచనతో, పీఎస్సీ సభ్యులు డిజిటల్‌ విధానంలో ఎవాల్యుయేషన్‌ (మూల్యాంకనం) చేయాలని ఒప్పుకున్నారు. ఆ సభ్యుల్లో సగం మంది చంద్రబాబుగారు నియమించిన వారే. డిజిటల్‌ ఎవాల్యుయేషన్‌ అంటే.. జవాబు పత్రాలు స్కాన్‌ చేసి, పంపిస్తే, వాల్యుయేటర్స్‌ చూసి, మార్కులు వేయడం. అప్పుడు తీవ్ర కోవిడ్‌. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారు.

అయినా కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో డిజిటల్‌ ఎవాల్యుయేషన్‌ను పరిగణలోకి తీసుకోలేదు. నిజానికి అప్పుడు కూడా హైకోర్టు ఏం చెప్పిందంటే, డిజిటల్‌ ఎవాల్యుయేషన్‌ను తప్పు బట్టలేమని, కానీ ఆ విషయాన్ని నోటిఫికేషన్‌లో ప్రస్తావించలేదు కాబట్టి, మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌కు ఆదేశిస్తున్నామని వెల్లడించింది. హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించి, 163 మందిని ఎంపిక చేసి ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతి ఒక్కటి హైకోర్టు ఆదేశాల మేరకే జరిగింది. నాలుగేళ్ల నుంచి వారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు వారిపై విషం చిమ్ముతున్నారు.

చంద్రబాబు ఆరోపణలు–వాస్తవాలు:
ఆరోపణ–1.
డిజిటల్‌ ఎవాల్యుయేషన్‌లో అక్రమాలు జరిగాయి.
వాస్తవం:
– అసలు డిజిటల్‌ ఎవాల్యుయేషన్‌ను పూర్తిగా పక్కన పెట్టి, మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌లో ప్రక్రియ పూర్తి చేసినప్పుడు, ఎందుకీ ఆరోపణలు?

ఆరోపణ–2.
గ్రూప్‌–1 ఎవాల్యుయేషన్‌ హాయిలాండ్‌లో ఏదో జరిగింది.
వాస్తవం:
– హాయిలాండ్‌లో జరిగిన ఎవాల్యుయేషన్‌కు, ఫలితాల వెల్లడికి ఏ సంబంధం లేదు. ఆ మేరకు 2025, నవంబరు 14న అధికారులు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, అన్నీ నియమానుసారం జరిగాయని తేల్చి చెప్పారు. అందుకే హాయిలాండ్‌ అనేది టాపిక్‌ కాదు. అది అప్రస్తుతమని స్పష్టం చేశారు. అంటే హాయిలాండ్‌లో పేపర్లు దిద్దడం, డిజిటల్‌ ఎవాల్యుయేషన్‌ రెండూ అప్రస్తుతమని చెప్పారు.
– మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌ కూడా ఏపీపీఎస్సీ, సీఆర్‌ఆర్‌ కాలేజీలో జరిగాయిని, ఎక్కడా అక్రమాలు లేవని, అంతా సీసీ టీవీల పర్యవేక్షణలో జరిగిందని చెప్పారు.

ఆరోపణ–3.
జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్‌ చేశారు.
వాస్తవం:
– నిజానికి మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌ ప్రక్రియ అంతా సీసీ టీవీల పర్యవేక్షణలో చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు ఏనాడైనా, అలా జవాబుపత్రాలు దిద్దించారా? ఆయన హయాంలో పేపర్లు దిద్దేటప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు.
– ఇంకా జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగ్‌ జరగలేదని, సిట్‌ (వారు ఏర్పాటు చేసిందే) స్పష్టమైన నివేదిక ఇచ్చినా, అబద్ధాలు ప్రచారం చేస్తూ నిందలు వేస్తున్నారు.
– జవాబు పత్రాలు, వాటిని దిద్దడంలో కానీ, ఓఎంఆర్‌ జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ (జీఆర్‌ఎల్‌)లో కానీ ఎలాంటి ట్యాంపరింగ్‌ జరగలేదని, సీఎఫ్‌ఎస్‌ఎల్‌ స్పష్టంగా ధృవీకరించిందని సిట్‌ నివేదిక ఇచ్చింది. అయినా తన కొడుకును కాపాడుకునేందుకు, చంద్రబాబు గ్రూప్‌–1 పరీక్షపై అభాండాలు వేస్తున్నారు. ఇక ఇక్కడ వివాదం ఎక్కడుంది?.

ఆరోపణ–4.
ఓఎంఆర్‌ షీట్ల సవరణలు గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తులు చేశారు. వారికి ఎలాంటి అర్హత లేదు.
వాస్తవం:
– చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా అంతా దొంగలే. అంతా తప్పుడు ప్రచారం చేస్తూ, నిందలు వేస్తున్నారు. అసలు వారు నియమించిన సిట్, చాలా స్పష్టంగా చెప్సింది. ఎక్కడా, ఏ తప్పు జరగలేదని తేల్చి చెప్పింది. ఇంకా సీసీ టీవీ ఫుటేజ్‌ ఉంది. సీఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలు కూడా ఉన్నాయి.
– ఇక్కడ అందరూ గుర్తించాల్సిన ఒక అంశం ఏమిటంటే, మేము అధికారంలోకి వచ్చే నాటికే, ప్రిలిమ్స్‌ ముగిశాయి. మరి ఎవరికి ఏ ఇంట్రెస్ట్‌ ఉంటుంది.
– పైగా పీఎస్సీ బోర్డులో ఎక్కువ మంది టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన వారే.

ఆరోపణ–5.
పేపర్లు ఒకసారి దిద్దిన తర్వాత మళ్లీ కరెక్షన్స్‌ చేశారు.
వాస్తవం:
– అసలు ఏపీపీఎస్సీ పరీక్షల మూల్యాంకనం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి. ఎక్కడా అభ్యర్థికి అన్యాయం జరగకుండా అనేక మంది బాధ్యులు ఉంటారు. ఇంకా పలు దశలు ఉంటాయి.
– చీఫ్‌ ఎగ్జామినర్‌ మొదలు, స్క్రుటినైజర్, సూపర్‌వైజర్లు ఉంటారు. అంత మంది చెక్‌ చేస్తారు. కంట్రోల్‌ బండిల్‌ స్లిప్‌లు ఉంటాయి. వాటిపై అందరి సంతకాలు ఉంటాయి. అదొక పక్కా విధానం.
– ఎక్కడా ఏ అభ్యర్థికి నష్టం జరగకుండా ఒక పక్కా విధానం, వ్యవస్థ ఉంటుంది.
– ఇంకా ఏ పేపర్‌ ఎవరిదని ఎవరికీ తెలియదు. కేవలం బార్‌కోడ్‌ మాత్రమే ఉంటుంది. దిద్దేవారికి అది ఎవరి ప్రశ్నపత్రం అనేది అస్సలు తెలియదు. ప్రతి దానికి బార్‌ కోడ్, క్యాంప్‌ ఆఫీసర్‌ సిగ్నేచర్‌ ఉంటుంది.
– వీటన్నింటిపై సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి.
(అంటూ ఆ కాపీ పీపీటీలో చూపారు)

ఆరోపణ–6.
రాతపరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చాయని ఆరోపణ.
వాస్తవం:
– ఇక్కడ నా సవాల్‌. చంద్రబాబుగారి హయాంలో గతంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ పరీక్షల్లో రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కుల వివరాలు బయట పెట్టగలరా?
– నిజానికి ఏపీపీఎస్సీలో విప్లవాత్మక మార్పులు మా హయాంలో తెచ్చాం. ఫేషియల్‌ రికగ్నిజమ్, థంబ్‌ ఇంప్రెషన్‌ తీసుకొచ్చాం. తొలిసారిగా పరీక్ష హాల్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మా తర్వాతే యూపీఎస్సీలో కూడా అమలు చేశారు.
– మా ప్రభుత్వం రాకముందు, ఏపీపీఎస్సీకి సంబంధించి ఒకటే ఇంటర్వ్యూ బోర్డు. అందులో ఒకరు మాత్రమే సివిల్స్‌ సర్వీసెస్‌ అధికారి ఉండేవారు. మేము వచ్చిన తర్వాత మూడు ఇంటర్వ్యూ బోర్డులు పెట్టాం. 24 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు, వివిధ వర్సిటీలకు చెందిన ఆరుగురు వీసీలను పెట్టాం.
– అభ్యర్థులకు జంబ్లింగ్‌ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించాం. అంటే ఏ అభ్యర్థి, ఏ బోర్డు ముందుకు వెళ్తారో వేరెవరికీ తెలియదు.
– ఇప్పుడు చంద్రబాబు వచ్చాక, మళ్లీ పాత విధానం. ఒకటే బోర్టు. ఒకే ఐఏఎస్‌ అధికారి.
– మా హయాంలో ఒకేసారి 1.30 లక్షల సచివాలయాల ఉద్యోగాలు. ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు వచ్చిందా? అంత పారదర్శకంగా ఆ ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కటంటే ఒక్క ఆరోపణ వచ్చిందా?
– మా హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6296 పోస్టులు భర్తీ చేశాం. కానీ, ఎక్కడా వివాదాలు లేవు.
– మేము ఇచ్చిన రెండు నోటిఫికేషన్లు చంద్రబాబు పెండింగ్‌లో పెట్టారు. మరో రెండు రద్దు చేశారు.

ఆరోపణ–7.
కొంత మంది ఎవాల్యుయేటర్లు సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. అది సీసీ కెమెరాల్లో రికారై్డంది.
వాస్తవం:
– అసలు తాను దిద్దేది ఎవరి పేపరో ఎవాల్యుయేటర్‌కు ఎలా తెలుస్తుంది? అక్కడ అభ్యర్థి పేరు, ఇతర వివరాలు ఏవీ ఉండవు. కేవలం ఒక్క బార్‌కోడ్‌ మాత్రమే ఉంటుంది.
– వక్రీకరణకైనా హద్దూ, పొద్దు ఉందా?

చివరగా ఇదే నా సవాల్‌:
నీవు (సీఎం చంద్రబాబు) ఆరోపణలు చేస్తున్న గ్రూప్‌–1 పరీక్ష. గత ఏడాది మీరు నిర్వహించిన డీఎస్సీ. రెండింటిపై సీబీఐ విచారణ జరిపిద్దాం. ఒక్క డీఎస్సీ–2025పైనే కాదు. గ్రూప్‌–1. 2018పైనా సీబీఐ విచారణకు మేము రెడీ. నీవు రెడీనా?
– మేము తప్పు చేయలేదు. మాకు ఆ ధైర్యం ఉంది. మరి మీకు ఆ ధైర్యం ఉందా?

డీఎస్సీ–2025. గ్రూప్‌–1. 2018.
రెండింటి మధ్య ఇవీ తేడాలు:
– డీఎస్సీ–2025లో పరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇచ్చారు.
– విద్యా శాఖ మంత్రి అనుమతి లేకుండా జీఓలు జారీ అవుతాయా?
– గేట్లు ఎత్తి 372 మందికి ఉద్యోగాలు ఇచ్చి, ఆ వెంటనే గేట్లు మూశారు.
– పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వడం గతంలో ఏనాడైనా జరిగిందా?
– ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ప్రశ్నపత్రాల తయారీలో ఎలా ఉన్నాడు? అతడికి తొలి ర్యాంక్‌ ఎందుకు వచ్చింది?
– తొలి మెరిట్‌ లిస్ట్‌లో ఉన్న ఆ వ్యక్తి పేరు, వివరాలు రెండో మెరిట్‌ లిస్ట్‌లో ఎందుకు తొలగించారు?
– బేరసారాలపై ఆడియో టేప్, క్లియర్‌గా ఫోన్‌ నెంబర్‌ ఉన్నా, ఎందుకు అరెస్టు చేయలేదు?
– మరో కేసులో ఏకంగా రూ.14,10,000 లంచం ఇచ్చారు. అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ, ఏ చర్యా లేదు.
– ఇక గ్రూప్‌–1కు సంబంధించి చూస్తే.. 2019లో మా ప్రభుత్వం రాకముందే, మీ హయాంలోనే ప్రిలిమ్స్‌ జరిగాయి.
– పూర్తిగా హైకోర్టు ఆదేశాల మేరకే మెయిన్స్, ఇంటర్వ్యూలు పూర్తి చేసి, ఉద్యోగాలు ఇచ్చామని శ్రీ వైయస్‌ జగన్, పక్కా ఆధారాలతో సహా, అంశాల వారీగా సీఎం చంద్రబాబుకు చురకలంటించారు.

అనంతరం మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..
కోర్టుకు వెళ్లాం. కేంద్రానికి నివేదించాం:
డీఎస్సీ ప్రశ్నపత్నం లీకేజీ, పరీక్షలో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ, ఇప్పటికే కోర్టులో పిటిషన్‌ వేశాం. ప్రధానమంత్రి, హోం మంత్రికి పార్టీ ఎంపీల ద్వారా వినతిపత్రం సమర్పించాం.

అదీ చంద్రబాబు ఐక్యూ:
ద్రవ్యోల్బణం ఒక మిథ్య అన్న సీఎం, బుర్ర (ఐక్యూ) ఎలా ఉందనేది అందరికీ తెలుస్తోంది.

ఉద్యోగులకు చంద్రబాబు మోసం:
ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం చాలా దారుణంగా మోసం చేశారు. అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఉన్న పీఆర్సీ రద్దు చేశారు. కొత్త పీఆర్సీ వేయలేదు. 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగులకు వివిధ రూపాల్లో ప్రభుత్వం దాదాపు రూ.40 వేల కోట్ల బాకీ ఉంది. సీపీఎస్‌ రద్దు చేస్తానన్న హామీ కూడా నెరవేర్చలేదు. అదే గత మా ప్రభుత్వం గ్యారెంటీ పెన్షన్‌ పథకం (జీపీఎస్‌) అమలు చేసి ఉద్యోగులకు మేలు చేసింది. కాగా, ఉద్యోగులకు అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబునాయుడు.

సర్వీస్‌ టీచర్లకు ‘టెట్‌’ నిబంధన తప్పు:
సర్వీస్‌ టీచర్లకు టెట్‌ పరీక్ష నిర్ణయం తప్పు. టీచర్లు వారి సమస్యల కోసం తమ పార్టీ ఎంపీలతో కలిసి, కేంద్రంలో విజ్ఞాపన పత్రం ఇస్తే, వారిని సస్పెండ్‌ చేశారు. అది హేయమైన చర్య. ఇంకా 20 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్న టీచర్లను ఇప్పుడు టెట్‌ రాయమనడం ఎంత వరకు సబబు?. వారు ఇంతకాలం ఒకే సబ్జెక్ట్‌ బోధిస్తున్నారు. టెట్‌లో చాలా సబ్జెక్ట్స్‌ ఉంటాయి. వారు అవన్నీ పాస్‌ కావడం కష్టం.

నాడు వారు ఎంపికైనప్పుడు టెట్‌ లేదు. ఇప్పుడు రాయాలంటే ఎలా?. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించాలి. వారి నిర్ణయాన్ని ఎండగట్టి, చట్ట సవరణ కూడా చేయించాలి. దాని ఆధారంగా కోర్టులో పోరాడాలి. అంతేకానీ, ఆ పని చేయకుండా, మా ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లిన టీచర్లను సస్పెండ్‌ చేయడం అత్యంత దారుణం.

ఇవీ చ‌ద‌వండి: YS Jagan with Rajahmundry leaders: స్థానిక సంస్థల పోరుకు సిద్ధం కండి.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి: వైఎస్ జగన్‌ 
YS Jagan: టెట్‌ మినహాయింపు కోరితే టీచర్లను సస్పెండ్‌ చేస్తారా? : వైఎస్‌ జగన్‌
YS Jagan in Kurnool: రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రెచ్చిపోతున్న వెన్నుపోటు పార్టీ: వైఎస్ జగన్‌ ఫైర్‌

ట్యాగ్స్: , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading