HomeAndhra PradeshYS Jagan: టెట్‌ మినహాయింపు కోరితే టీచర్లను సస్పెండ్‌ చేస్తారా? : వైఎస్‌ జగన్‌

YS Jagan: టెట్‌ మినహాయింపు కోరితే టీచర్లను సస్పెండ్‌ చేస్తారా? : వైఎస్‌ జగన్‌

YS Jagan: టెట్‌ నిబంధన నుంచి సీనియర్‌ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించిన ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడంపై వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులపై, అందులోనూ ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టి వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఐదుగురు ఉపాధ్యాయులపై విధించిన సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేసి, వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

“చంద్రబాబుగారూ.. ప్రభుత్వ ఉద్యోగులపై, అందులోనూ టీచర్లపై మరీ ఇంత కక్షగడతారా?” అంటూ ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. తొలి రోజు వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ఉపాధ్యాయులను, రెండో రోజు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులను కలిపి మొత్తం ఐదుగురిని ఎందుకు సస్పెండ్‌ చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు.

వినతిపత్రం ఇవ్వడమే నేరమా?

ఉద్యోగంలో చేరే సమయానికి అమల్లో లేని టెట్‌ నిబంధనను ఇప్పుడు వర్తింపజేస్తుండటంతో లక్ష మందికిపైగా సీనియర్‌ ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్‌ పేర్కొన్నారు. తమను ఈ నిబంధన నుంచి మినహాయించాలని కోరుతూ, తమకు మద్దతిస్తున్న ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే ఆ ఉపాధ్యాయులు చేసిన నేరమా అని ప్రశ్నించారు. “టీచర్లు తమ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే వారిపై రాజకీయ ముద్ర వేస్తారా? సస్పెన్షన్లు విధిస్తారా? మీరు చేయలేని పనిని వారు చేయడానికి ప్రయత్నించడమే తప్పా? ఒక వినతిపత్రం ఇవ్వడానికే సస్పెన్షన్‌ విధిస్తారా?” అంటూ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.

ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే వాటిని రాజకీయ కోణంలో చూస్తూ, ఉపాధ్యాయులకు రాజకీయాలను అంటగట్టడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రెడ్‌బుక్‌ అరాచక జంగిల్‌రాజ్‌’ చివరకు ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా వదిలిపెట్టడం లేదని ధ్వజమెత్తారు.

కేంద్రాన్ని కోరాల్సిన బాధ్యత మీది కాదా?

సీనియర్‌ ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారిన టెట్‌ నిబంధనను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై లేదా అని జగన్‌ ప్రశ్నించారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు.

ప్రభుత్వం చేయాల్సిన పనిని చేయకుండా సీనియర్‌ ఉపాధ్యాయుల సమస్యను గాలికి వదిలేసిందన్నారు. తమ సమస్యను వైయస్సార్‌సీపీ ఎంపీల సహకారంతో కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నిస్తే వారిపై రాజకీయ ముద్ర వేయడం, సస్పెన్షన్లు విధించడం నియంతృత్వానికి నిదర్శనమని విమర్శించారు.

ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ గాలికి

ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ చంద్రబాబు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని జగన్‌ ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మధ్యంతర భృతి–ఐఆర్‌ ప్రకటిస్తామని, మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం వచ్చి మూడో ఏడాది నడుస్తున్నప్పటికీ ఐఆర్‌ లేదని, పీఆర్సీ లేదని, ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.

సీపీఎస్‌, ఓపీఎస్‌ విధానాలను పునఃసమీక్షిస్తామని చెప్పి ఉద్యోగుల్లో ఆశలు కల్పించిన చంద్రబాబు ప్రభుత్వం.. చివరకు గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రకటించిన జీపీఎస్‌ను కూడా అమలు చేయకుండా ఉద్యోగులను త్రిశంకుస్వర్గంలో ఉంచిందని విమర్శించారు.

రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల బకాయిలు

ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ బకాయిలు, పెండింగ్‌ డీఏలు, జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, పదవీ విరమణ ప్రయోజనాలు, సరెండర్‌ లీవ్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితర బకాయిలు కలిపి దాదాపు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు పేరుకుపోయాయని జగన్‌ పేర్కొన్నారు.

తమకు న్యాయంగా రావాల్సిన డబ్బుల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తుంటే ప్రభుత్వం ఒక్క పైసా కూడా చెల్లించడం లేదని, పైగా వారికి సస్పెన్షన్లను బహుమానంగా ఇస్తోందని మండిపడ్డారు. “ఇదేనా ఉద్యోగుల పట్ల మీ గౌరవం? ఇదేనా ఉపాధ్యాయుల పట్ల మీ బాధ్యత?” అంటూ చంద్రబాబును నిలదీశారు.

సస్పెన్షన్లు ఎత్తివేయకపోతే న్యాయపోరాటం

అధికారం ఉందనే అహంకారంతో, నియంతృత్వ విధానాలతో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని జగన్‌ హెచ్చరించారు. చివరకు సొంత నీడను కూడా భరించలేని స్థాయికి ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు. సస్పెండ్‌ చేసిన ఐదుగురు ఉపాధ్యాయులపై చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. వారికి క్షమాపణ చెప్పి ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకోవాలన్నారు. లేకపోతే ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.

అన్యాయమైన సస్పెన్షన్లను సవాల్‌ చేసే పోరాటంలో బాధిత ఉపాధ్యాయులకు వైయస్సార్‌సీపీ న్యాయపరంగా పూర్తి సహాయాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకూ వైయస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

Read also: YS Jagan in Kurnool: రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రెచ్చిపోతున్న వెన్నుపోటు పార్టీ: వైఎస్ జగన్‌ ఫైర్‌
YS Jagan meeting: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు