శనివారం, 24 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Skill Scam: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబే దోషి

Keerthanaa News Deskప్రచురణ తేదీ: సోమవారం, 28 అక్టోబర్ 2024

Skill Scam: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబే దోషి అని, హైకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కౌంటర్‌తో ఈ విషయం మరోసారి సుస్పష్టమైందని వైయస్సార్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.

ఈ కేసులో చంద్రబాబుకు ఉచ్చు బలంగా బిగుసుకుంటోందన్న ఆయన, సూట్‌కేస్‌ కంపెనీల ద్వారా రూ.151 కోట్లు దారి మళ్లించి స్వాహా చేసిన విషయం ఈడీ దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఈ కేసు కుట్రపూరితమంటూ నాడు విమర్శలు గుప్పించిన కూటమిలోని జనసేన, బీజేపీ ఇప్పుడేమంటాయని ప్రశ్నించారు. ఏకంగా రోడ్డు మీద పడుకున్న నాయకులు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో పక్కా ఆధారాలతో సహా దొరికినా, చంద్రబాబు నిర్దోషి అంటూ ఆయనను సమర్థించిన పార్టీలు, నాయకులకు ఇప్పుడు హైకోర్టులో ఈడీ కౌంటర్‌ చెంపపెట్టు వంటిదని కన్నబాబు స్పష్టం చేశారు.

కాగ్‌ నివేదికలో చెప్పిందే నిజమైంది
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలున్నా, కూటమి ప్రభుత్వం వచ్చాక సీఐడీ దర్యాప్తును అటకెక్కించారని మాజీ మంత్రి తెలిపారు. అయితే కేసు దర్యాప్తులో భాగంగా సుమన్‌బోస్, వికాస్‌ వినాయక్‌ కన్వేల్కర్‌ ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఈడీ ఇటీవల ప్రకటించడం, తాజాగా అదే ఈడీ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేస్తూ, సూట్‌కేస్‌ కంపెనీల వివరాలు బయటపెట్టిన నేపథ్యంలో, స్కామ్‌లో చంద్రబాబు పాత్రను అందరూ నమ్ముతున్నారని చెప్పారు.

కాగా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గతంలోనే కాగ్‌ నిర్ధారించిందని, ఈ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చిని విషయాన్ని ఈ సందర్భంగా కన్నబాబు ప్రస్తావించారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఈ స్కాం గురించి పుణెలోని ఒక విజిల్‌ బ్లోయర్‌ వివరాలు అందించినా విచారణ జరిపించకుండా అడ్డుకోవడంతో పాటు, ఫైల్స్‌ దహనం చేశారని గుర్తు చేశారు.

కేసు దర్యాప్తులో విచారణకు హాజరు కావాలని చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు నోటీస్‌ ఇస్తే, హాజరు కాకుండా విదేశాలకు పారిపోయిన ఆయనకు, టీడీపీ అధికారంలోకి వచ్చాక తిరిగి ఉద్యోగం ఇవ్వడం నిబంధనలు ఉల్లంధన అని అభిప్రాయపడ్డారు. ఈ కేసును సీఐడీ ద్వారా కాకుండా స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా పారదర్శకంగా విచారణ జరిపించాలన్నది తమ పార్టీ డిమాండ్‌ అని కన్నబాబు చెప్పారు.

మీడియా వ్యవహార శైలి బాధాకరం
చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని, ఆయన్ను కాపాడే ఓ వర్గం మీడియా రక్షణ కవచంగా భుజాలపై మోస్తూ ప్రజలకు అన్యాయం చేస్తోందని కన్నబాబు అసహనం వ్యక్తం చేశారు. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయకపోయినా, విద్యుత్‌ ఛార్జీలు పెంచుతున్నా, పంట నష్టం పరిహారం ఇవ్వకపోయినా, ఉచిత పంటల బీమా ఎత్తేసి వెన్నుపోటు పొడిచినా ఆ వర్గం మీడియా ఆయన్ను భుజాన మోయడం బాధాకరమన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని చెప్పి, మొత్తానికే ఉద్యోగాలు ఊడపెరికేసినా, కాంట్రాక్టు సిబ్బందిని తొలగించినా ఆ వర్గం మీడియాకు మాత్రం కనిపించదని ఆక్షేపించారు.

టీడీపీ వర్సిటీలో నేర్పేది కుట్రలు, కుతంత్రాలే
టీడీపీ ఒక యూనివర్సిటీ అని చెబుతున్న చంద్రబాబు, అందులో నాయకులకు కుట్రలు, కుతంత్రాలు నేర్పిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీ నాయకులను చంపడం, వారిపై దాడి చేయడం, వారి ఆస్తులను దోచుకోవడం కూడా నేర్పుతున్నారని దుయ్యబట్టారు. చివరకు ఆడపిల్లల మీద అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా నోరు మెదపవద్దని మీ యూనివర్సిటీలో చెబుతున్నారా అని ప్రశ్నించారు.

అదేనా చంద్రబాబు ఉద్దేశం?
1995 నాటి చంద్రబాబుని అవుతానని, రాజకీయ పరిపాలన చేస్తానని చెప్పడం వెనుక ఆయన ఉద్దేశం.. కులాలు, మతాలు, పార్టీలు చూసి పథకాలు అమలు చేయడం, సొంత పార్టీ నాయకులకు ప్రజాధనం దోచిపెట్టడమేనా అని నిలదీశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుకలో ఉచితం లేదని, నాణ్యమైన మద్యంలో నాణ్యత లేదని స్పష్టం చేశారు. విజయవాడ వరదలు వారి కోసమే వచ్చినట్లుగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల ఖర్చుల పేరిట రూ.23 కోట్లు, చంద్రబాబు కలిపిన పులిహోరకు ఏకంగా రూ.356 కోట్లు దోచేశారని కన్నబాబు గుర్తు చేశారు.

ఇవీ చదవండి: Kannababu: అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు వ్యయం చేశారా?
Kurasala Kannababu: తిరుమల లడ్డూపై చంద్రబాబు విషప్రచారం ఆపాలి
Skill Development Scam Update: స్కిల్ స్కాంలో కీలక మలుపు.. అప్రూవర్‌గా మారనున్న కీలక నిందితుడు!
Gadikota Srikanth Reddy: రాష్ట్రంలో దౌర్జన్యాల సంస్కృతికి శ్రీకారం

ట్యాగ్స్: , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading