Skill Development Scam Update: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు ఏసీఐ ఎండీ చంద్రకాంత్ తాను అప్రూవర్ గా మారేందుకు అనుమతి ఇవ్వాలంటూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్రూవర్ గా మారేందుకు అనుమతించి తనను సాక్షిగా పరిగణించాలని పిటిషన్ లో పేర్కొన్నారు చంద్రకాంత్. (Skill Development Scam Update)
అమరావతి తాత్కాలిక సచివాలయం, టిడ్కో ప్రాజెక్టుల కాంట్రాక్టుల కేటాయింపుల్లో నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు తీసుకుని బాబు సన్నిహితుడు యోగేష్ గుప్తా చంద్రబాబుకు చేరవేశారనే అభియోగాలున్న సంగతి తెలిసిందే. అందుకే యోగేష్ గుప్తాకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. స్కిల్ స్కాం లో యోగేష్ గుప్తా ఏ 22 గా ఉన్నారు.
నిధుల అక్రమ తరలింపులో చంద్రబాబు సన్నిహితుడు యోగేష్ గుప్తా కీలక పాత్ర పోషించారని అభియోగాలున్నాయి. సావన్ కుమార్ జాజుతో కలిసి యోగేష్ గుప్తా తనను సంప్రదించారని నిందితుడు చంద్రకాంత్ తెలిపారు. డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకు సాఫ్ట్ వేర్ సమకూర్చి ఐటి సేవలు అందిస్తున్నట్లుగా బోగస్ ఇన్వాయిస్ లు కావాలని అడిగారన్నారు.
ఏసీఐ కంపెనీ పేరిట స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్ వాయిస్ లు, డిజైన్ టెక్ కంపెనీకి రెండు బోగస్ ఇన్వాయిస్ లు ఇచ్చారన్నారు. స్కిల్లర్, డిజైన్ టెక్ కంపెనీలతో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు నమ్మించేందుకే బోగస్ ఇన్వాయిస్ లు తమ నుంచి తీసుకున్నారన్నారు.
ఇన్వాయిస్ లు విలువ మేరకు రూ.67,87,39,313 ఏసిఐ కంపెనీ బ్యాంకులో జమ చేశారని పిటిషన్ లో చంద్రకాంత్ పేర్కొన్నాడు. సావన్ కుమార్ చెప్పిన పలు షెల్ కంపెనీలకు ఆ నిధులను తాను మళ్ళించానని పిటిషన్ లో చంద్రకాంత్ తెలిపారు. డిసెంబర్ 5న ఏసీబీ కోర్టు ముందు స్వయంగా హాజరుకావాలని చంద్రకాంత్ షాకు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. చంద్రకాంత్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ వచ్చే నెల 5కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.