మంగళవారం, 10 నవంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

AP Assembly Sessions 2026: ప్రత్యక్ష ఎన్నికల బిల్లు.. డీఎస్సీపై సభలో హైటెన్షన్‌

Keerthanaa News Deskప్రచురణ తేదీ: సోమవారం, 17 ఆగస్టు 2026
AP Assembly Sessions 2026

AP Assembly Sessions 2026: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మరోసారి అసెంబ్లీ వేదికగా వేడెక్కనున్నాయి. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆగస్టు 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజులపాటు సమావేశాలు నిర్వహించేలా ప్రాథమిక షెడ్యూల్‌ రూపొందించారు. సమావేశాల వ్యవధి, చర్చించాల్సిన అంశాలు, బిల్లులపై ఉభయ సభల బిజినెస్‌ అడ్వైజరీ కమిటీలు తుది నిర్ణయం తీసుకోనున్నాయి. ఏపీ శాసనసభ అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఆగస్టు 17 నుంచి 20 వరకు సెషన్‌ క్యాలెండర్‌ను పొందుపరిచారు.

ప్రజలే మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ను ఎన్నుకునేలా బిల్లు

రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పాలకుల ఎన్నిక విధానంలో కీలక మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లను కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నుకునే ప్రస్తుత పరోక్ష విధానం స్థానంలో ప్రజలే నేరుగా ఎన్నుకునే ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు మున్సిపల్‌ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లును మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బిల్లు ఆమోదం పొందితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు తమ వార్డు కౌన్సిలర్‌ లేదా కార్పొరేటర్‌తోపాటు మేయర్‌ లేదా మున్సిపల్‌ చైర్మన్‌ను కూడా నేరుగా ఎన్నుకోనున్నారు.

ప్రస్తుతం ప్రజలు వార్డు ప్రతినిధులను మాత్రమే ఎన్నుకుంటున్నారు. అనంతరం ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమలో ఒకరిని చైర్మన్‌ లేదా మేయర్‌గా ఎన్నుకుంటున్నారు. ఈ పరోక్ష విధానంలో ఫిరాయింపులు, క్యాంపు రాజకీయాలు, అవిశ్వాస తీర్మానాలు, పాలకవర్గాల మార్పులు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలున్నాయి. ప్రత్యక్ష ఎన్నికలతో వీటికి అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మేయర్‌ ఒక పార్టీకి చెందినవారు, కౌన్సిల్‌లో మెజారిటీ మరో పార్టీకి ఉంటే పాలనలో ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. బిల్లు సభ ముందుకు వచ్చిన తర్వాత దానిలోని పూర్తి నిబంధనలు, మేయర్‌ లేదా చైర్మన్‌ పదవీకాలం, తొలగింపు విధానం, అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన అంశాలపై స్పష్టత రానుంది.

తొలిరోజే మెగా డీఎస్సీ–2025పై ప్రకటన

అసెంబ్లీ సమావేశాల తొలిరోజు మెగా డీఎస్సీ–2025పై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటన చేయనున్నారు. ఉపాధ్యాయ నియామకాల నిర్వహణ, పరీక్షలు, ఫలితాలు, ఎంపిక ప్రక్రియ, అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలు, ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలపై మంత్రి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ కొంతకాలంగా ఆరోపిస్తోంది. పరీక్షల నిర్వహణలో గోప్యతకు భంగం కలిగిందని, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి కీలక బాధ్యతలు అప్పగించారని, స్పోర్ట్స్‌ కోటా నియామకాలు, మెరిట్‌ జాబితాలు, నార్మలైజేషన్‌ విధానంపై అనుమానాలున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రభుత్వం మాత్రం డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని, ప్రతిపక్షం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆరోపణలు చేస్తోందని చెబుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి ప్రకటన తర్వాత జరిగే చర్చ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోనుంది.

ఎల్‌నినో ప్రభావంపై లఘు చర్చ

రాష్ట్రంలో వర్షపాతం, వ్యవసాయం, సాగునీరు, తాగునీటి లభ్యతపై ఎల్‌నినో పరిస్థితుల ప్రభావం గురించి శాసనసభలో లఘు చర్చ చేపట్టనున్నారు. వర్షాభావ పరిస్థితులు, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా, సాగునీటి ప్రాజెక్టులు, కరవు నివారణ చర్యలపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. రైతుల సమస్యలు, పంటల బీమాపై స్పష్టత లేకపోవడం, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఉద్యోగుల పీఆర్సీ, పెండింగ్‌ సమస్యలు, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య విధానాలను కూడా మండలిలో ప్రస్తావిస్తామని వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ప్రకటించింది.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ ఆహ్వానం

శాసనసభ సమావేశాలకు హాజరై డీఎస్సీ సహా అన్ని అంశాలపై మాట్లాడాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు ఇప్పించే బాధ్యత తనదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ప్రజా సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు తప్పకుండా హాజరుకావాలని స్పీకర్‌ గతంలోనూ పలుమార్లు సూచించారు. సభకు హాజరుకాకుండా ఎమ్మెల్యేలుగా ప్రయోజనాలు పొందడం సరికాదంటూ ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు.

అసెంబ్లీకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దూరం?

మరోవైపు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకూ హాజరుకాకపోవచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీలో తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించనందుకు నిరసనగా సభకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారికంగా స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో, సంఖ్యాబలం ఉన్న శాసనమండలిలో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మండలిలో డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ పోరాటం

శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో మెగా డీఎస్సీ–2025 అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, కాల్‌ రికార్డులు, మెరిట్‌ జాబితాలు, ఇతర ఆధారాలను సభ ముందుంచుతామని బొత్స ప్రకటించారు. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర చర్చకు అనుమతించాలని, సీబీఐతో విచారణ జరిపించాలని, విచారణ నిష్పాక్షికంగా సాగేందుకు మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ అంశంపై మండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగే అవకాశముంది. డీఎస్సీతోపాటు రైతుల సమస్యలు, పంటల బీమా, ఉద్యోగుల సమస్యలను కూడా వైఎస్సార్‌సీపీ మండలిలో లేవనెత్తనుంది.

గ్రూప్‌–1, బీసీ రిజర్వేషన్లపైనా చర్చ

ఈ సమావేశాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 నియామకాలపై సిట్‌ నివేదిక, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడులు, మౌలిక వసతులు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను ప్రభుత్వం సభ ముందు ఉంచే అవకాశం ఉoది. ఒకవైపు ప్రత్యక్ష స్థానిక సంస్థల ఎన్నికల బిల్లు, మరోవైపు మెగా డీఎస్సీ వివాదం, గ్రూప్‌–1 నియామకాలు, బీసీ రిజర్వేషన్లు, రైతుల సమస్యలు ఉండటంతో నాలుగు రోజుల సమావేశాలు రాజకీయంగా హాట్‌హాట్‌గా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీకి సంఖ్యాబలం ఉన్న శాసనమండలి ఈసారి రాజకీయ పోరాటానికి ప్రధాన వేదికగా మారనుంది.

Read also: AP Assembly : బోండా ఉమ vs పవన్ కళ్యాణ్.. పొల్యూషన్ బోర్డుపై రగడ
AP Assembly : తొలిరోజు అసెంబ్లీ.. జీఎస్టీ సంస్కరణలు స్వాగతిస్తూ తీర్మానం

ట్యాగ్స్: , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.