Telangana Rice: తెలంగాణలో బియ్యం ధరలు పెరగడం, కొందరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు వర్గాల బియ్యానికి గరిష్ట చిల్లర ధరలను (ఎంఆర్‌పీ) నిర్ణయించింది. మిల్లర్లు, వ్యాపారులు ఈ ధరలకు మించి విక్రయించరాదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. బియ్యం బస్తాలపై ధర, బరువు వివరాలను స్పష్టంగా ముద్రించాలని కూడా ఆదేశించింది.
ఏ రకం బియ్యం ధర ఎంత?
ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరల ప్రకారం బీపీటీ, కేఎన్‌ఎం రకం బియ్యం కిలో రూ.66కు మించి విక్రయించకూడదు. ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా రకాల గరిష్ట ధర కిలోకు రూ.74. హెచ్‌ఎంటీ, జైశ్రీరాం రకాల బియ్యం కిలో ధర రూ.79కు పరిమితం చేశారు. ఈ ధరలను 26 కిలోల ప్యాకేజీ బస్తాలపై వినియోగదారులకు కనిపించేలా ముద్రించాలని మిల్లర్లు, వ్యాపారులకు సూచించారు.
వారంలో 2,686 తనిఖీలు
ధరల నియంత్రణ, అక్రమ నిల్వలపై చర్యల్లో భాగంగా అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్, లీగల్ మెట్రాలజీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ బృందాలు బియ్యం మిల్లులు, టోకు దుకాణాలు, రిటైల్ షాపుల్లో 1,141 ఆకస్మిక తనిఖీలు చేసి 55 కేసులు నమోదు చేశాయి. వీటిలో 35 క్రిమినల్ కేసులు ఉన్నాయి. లీగల్ మెట్రాలజీ శాఖ మరో 1,545 తనిఖీలు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 280 కేసులు నమోదు చేసింది.
బరువు, ధరల స్టిక్కర్లలోనూ మోసాలు
తనిఖీల్లో బస్తాల బరువులో తేడాలు, అధిక ధర చూపించే స్టిక్కర్లతో పాటు మరికొన్ని ఉల్లంఘనలు బయటపడ్డాయి. 25 కిలోల బియ్యం ఉన్న బస్తాలను 26 కిలోలుగా లేబుల్ చేసినట్లు, తయారీదారు ముద్రించిన ధరపై ఎక్కువ ధరతో కూడిన స్టిక్కర్లు అతికించినట్లు అధికారులు గుర్తించారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, జీఎస్‌టీ లేదా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు లేకుండా వ్యాపారం నిర్వహించడం వంటి అంశాలపైనా కేసులు నమోదు చేశారు. newindianexpress.com
పదేపదే ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్
బియ్యం కొరత ఉందనే ప్రచారాన్ని ప్రభుత్వం ఖండిస్తూ, రాష్ట్రంలో తగిన నిల్వలు ఉన్నాయని తెలిపింది. కృత్రిమ కొరత సృష్టించడం, బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, ధరలు లేదా బరువులో మోసాలకు పాల్పడడం సహించబోమని పౌరసరఫరాల శాఖ హెచ్చరించింది. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై పీడీ యాక్ట్‌తో పాటు నిత్యావసర వస్తువుల చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. బియ్యం కొనుగోలు చేసేటప్పుడు బస్తాపై ఉన్న బరువు, ముద్రించిన ఎంఆర్‌పీని పరిశీలించాలని వినియోగదారులకు సూచించింది.
ఇవీ చదవండి: Telangana Ration Card: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. బియ్యంతోపాటు మరో 6 సరుకులు
Wheat Tomato Dosa Recipe: బియ్యం, మినప్పప్పు అవసరం లేదు.. గోధుమపిండితో క్రిస్పీ దోశలు






