AP Assembly : ప్రపంచంలో దేశం నెంబర్-1 కావాలి… దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండాలి.. దీనికి తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ-2.0 సంస్కరణలు ఊతమిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సభలో జీఎస్టీ సంస్కరణలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏయే వస్తువులకు ఎంత మేర ధరలు తగ్గుతాయనే అంశాన్ని ముఖ్యమంత్రి సభలో వివరించారు.
జీఎస్టీ-2.0 సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ మేరకు జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ, ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను అభినందిస్తూ ఏపీ శాసన సభలో ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దేశంలోనే తొలిసారి జీఎస్టీ-2.0 సంస్కరణలను స్వాగతిస్తూ తీర్మానం చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ”గతంలో సీఎస్టీ, వ్యాట్ లాంటి సంక్లిష్టమైన పన్నుల వ్యవస్థ ఉండేది.
17 రకాల పన్నులు, 13 రకాల సెస్సులు, సర్చార్జిలు ఉండేవి. డబ్బు కావాలంటే సర్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వాలు విధించేవి. ఒక ఉత్పత్తికి అనుబంధ ఉత్పత్తులు వచ్చినా పన్నులు వేసే పరిస్థితి ఉండేది. అలాంటి వాటికి చెక్ పెడుతూ జీఎస్టీని 2017లో ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చింది. వాజ్ పేయి హయాంలోనే జీఎస్టీ తీసుకురావాలని ప్రయత్నించినా కుదరలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ మోదీ తొలిసారి ప్రధాని కాగానే జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టారు.
ఇప్పుడు 140 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలిగేలా జీఎస్టీ విధానాన్ని మరింత సరళతరం చేస్తూ రెండు స్లాబులతోనే కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రభుత్వానికి ఆదాయం వస్తే అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది. రెండో తరం జీఎస్టీ అమలు దేశ ఆర్థికాభివృద్ధికి ఇది కీలక మలుపు కాబోతోంది. సంపద సృష్టించ లేని వారికి సంక్షేమం గురించి మాట్లాడే అధికారం లేదు. కేంద్రం తీసుకువచ్చిన ఈ సంస్కరణలతో ముందుగానే దీపావళి, దసరా పండుగల బోనస్ ఇచ్చారు. 99 శాతం మేర వస్తువులన్నీ 5 శాతం పన్ను పరిధిలోకే వచ్చాయి. పేద-మధ్య తరగతి సహా అందరికీ లబ్ది కలుగుతుంది.”అని చంద్రబాబు చెప్పారు.
వన్ నేషన్-వన్ ట్యాక్స్ విధానంతో ఎంతో అభివృద్ధి
“వన్ నేషన్ – వన్ ట్యాక్స్ అనే విధానం సక్రమంగా అమలు కావటం వల్ల ప్రయోజనం చేకూరుతోంది. జీఎస్టీ వల్ల పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1.51 కోట్లకు పెరిగింది. అలాగే జీఎస్టీ వసూళ్లు రూ. 22 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక ప్రస్తుతం కేంద్రం చేపట్టిన జీఎస్టీ-2.0 సంస్కరణల వల్ల డబుల్ డిజిట్ గ్రోత్ సాధించే దేశంగా భారత్ అవతరిస్తుంది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ సంస్కరణలు తెచ్చారు. దీని ద్వారా వచ్చిన ప్రయోజనాలను ప్రజలందరికీ చేరువ చేసే బాధ్యత అందరం తీసుకోవాలి. జీఎస్టీ సంస్కరణలతో ప్రాథమికంగా కొద్ది ఇబ్బందులు వచ్చినా… దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ విధానాన్ని స్వాగతిస్తున్నాం. దీర్ఘకాల సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి.” అని ముఖ్యమంత్రి వివరించారు.
సంస్కరణలతో లబ్ది చేకూరిదిలా..
“నిత్యావసర వస్తువులు, సబ్బులు, టూత్ పేస్టు, షాంపూలు, నెయ్యి లాంటి వస్తువులన్నీ 5 శాతానికి వచ్చాయి. ఏసీలు, ఫ్రిడ్జ్ ల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయి. జీవిత బీమా, ఆరోగ్య బీమాలకు కూడా జీఎస్టీ సున్నా శాతానికి వెళ్లింది. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రూ.750 కోట్ల వరకూ ఏపీకి ఆదా అవుతుంది. అగ్రిటెక్ యంత్రాలకు కూడా గణనీయంగా పన్ను తగ్గింది. రైతులకు ప్రయోజనం కలుగుతుంది.
ఇళ్ల నిర్మాణానికి వినియోగించే వస్తువుల ధరలు కూడా 5 శాతం శ్లాబ్ లోకి వచ్చాయి. నిర్మాణ రంగం పుంజుకుంటుంది. సాధారణ ప్రజలు కూడా వినియోగించుకునేలా ఎలక్ట్రానిక్స్ వస్తువులపై జీఎస్టీ తగ్గింది. అగ్రిటెక్, వ్యవసాయ పరికరాలపై కూడా పన్ను తగ్గింది. తక్కువ వ్యయంతో రైతులు ఉత్పత్తి సాధించగలుగుతారు. ఫార్మా సహా వివిధ రంగాలకు ఊతం ఇచ్చేలా ఈ సంస్కరణలు ఉన్నాయి. ఎంఎస్ఎంఈలకూ ప్రత్యేకంగా ఈ నిర్ణయం లబ్ది కలిగిస్తుంది. టాక్స్ రీఫండ్ ల ద్వారా ఆర్ధిక ఉపశమనం కలుగుతుంది. లాజిస్టిక్స్ వ్యయం కూడా తగ్గి ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉంటుంది. ఏపీలో వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రప్రెన్యూర్ విధానానికి కూడా ఈ సంస్కరణలు ఎంతో ఉపయోగపడతాయి.” అని సీఎం వివరించారు.
ప్రతి ఒక్కరికీ సంస్కరణల ఫలాలు దక్కాలి
“రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఈ జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలు దక్కాలి. చిట్టచివరి వ్యక్తికి ఈ అంశాలు తెలియాలి. పేదలు, మధ్యతరగతి సామాన్యులకు లబ్ది కలిగేలా తీసుకున్న సంస్కరణలు ఇవి. పౌరులందరికీ ఈ జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు దక్కాలి. వినియోగదారులు- వ్యాపారులకూ ఈ సంస్కరణల వల్ల లాభమే.
సెప్టెంబరు 22 దసరా నుంచి జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయి. దీనిపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేపడతాం. దసరా నుంచి దీపావళీ వరకు ఈ ప్రచారం నిర్వహిస్తాం. దీని కోసం మంత్రివర్గ ఉప సంఘం వేస్తాం. ఈ సంస్కరణలతో రెండంకెల వృద్ధి రేటు సాధించగల ఏకైక దేశంగా భారత్ నిలుస్తుంది. ఈ సంస్కరణల వల్ల నాలుగింతల మేర వస్తు వినియోగం కూడా పెరుగుతుంది. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రూ.2 లక్షల కోట్ల మేర దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఉపశమనం కలుగుతోంది. ఆ మేర వ్యవస్థలో ఆర్ధిక లావాదేవీలు కూడా పెరుగుతాయి. సంక్లిష్టమైన పరిస్థితులు ఉండవు. మొత్తంగా ఆర్ధిక వ్యవస్థకు చోదకశక్తిగా జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ మారుతాయి.” అని చంద్రబాబు చెప్పారు.
ఇవీ చదవండి: Super Six Super Hit : సూపర్ హిట్ సభలో YCPపై చంద్రబాబు ఫైర్.. సభ రాజకీయానికి కాదన్న సీఎం
Nara Lokesh : ప్రతీకార రాజకీయాలు చేయం.. తప్పుచేస్తే నన్నూ చంద్రబాబు వదలరు
