HomeAndhra PradeshYS Jagan Pressmeet: ఎవ‌రివి హ‌త్యా రాజ‌కీయాలు? ఎవ‌రివి శ‌వ రాజ‌కీయాలు? మావిగ‌న్ అంటే చంద్ర‌బాబుకు బీపీ:...

YS Jagan Pressmeet: ఎవ‌రివి హ‌త్యా రాజ‌కీయాలు? ఎవ‌రివి శ‌వ రాజ‌కీయాలు? మావిగ‌న్ అంటే చంద్ర‌బాబుకు బీపీ: వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు 

YS Jagan Pressmeet: మావిగన్‌ అంటే చంద్రబాబుకు గుండె ఆగిపోయేలా ఉందని, ఆ పేరు వింటేనే ఆయన బీపీ పెరిగిపోతోందని, బదులివ్వలేక ఇష్టానుసారం మాట్లాడుతూ విరుచుకుపడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తన కుటుంబంలో తాతతో సహా, ముగ్గురిని కోల్పోయానన్న ఆయన, అసలు ఎవరిది గొడ్డలి పార్టీ అని ప్రశ్నించారు. మల్లెల బాబ్జీ అనుమానాస్సద మృతి మొదలు, వంగవీటి రంగా, పింగళి దశరథరామ్‌ హత్య కేసుల్లో అందరి వేలు ఎవరిని చూపాయో గుర్తుంచుకోవాలన్న జగన్, అసలు హత్యా రాజకీయాలు ఎవరు చేశారని, చేస్తున్నారని సీఎం చంద్రబాబును నిలదీశారు. ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్న చంద్రబాబు, చివరకు సోషల్‌మీడియాపైనా సెన్సార్‌షిప్‌ కోసం కుట్ర చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రం ఇప్పుడు ఒక జంగిల్‌రాజ్‌గా మారిందని తేల్చి చెప్పారు. మాట్లాడితే బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌ అంటూ విమర్శిస్తున్న మంత్రి లోకేష్‌కు చురకలంటించారు. వైయస్సార్‌సీపీకి, టీడీపీ ఎక్కడా సరికాదంటూ.. ‘ఎస్‌. బోత్‌ కెనాట్‌ బి సేమ్‌’ అని ఉదాహరణలతో సహా వివరించారు.

ప్రెస్‌మీట్‌లో జగన్‌ ఏమేం మాట్లాడారంటే..:

‘బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ’
ప్రజలు నిజంగా ఈరోజు తమ బతుకు బండిని నడపడానికి అష్టకష్టాలు పడుతున్న పరిస్థితుల మధ్య, వారి బాøగులను గాలికి వదిలేసి, తామిచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దారుణమైన అవినీతి, దోపిడీ, మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతూ, ప్రశ్నించే గొంతులను పాశవికంగా అణగదొక్కుతూ రాష్ట్రాన్ని ఒక జంగిల్‌రాజ్‌ గా మార్చారు. YS Jagan Pressmeet

రాష్ట్రంలో చంద్రబాబుగారి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్లుగా, ఆయన ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. రెండేళ్ల ప్రోగ్రెస్‌ రిపోర్టు చూస్తే ఒకే ఒక పాయింట్‌.. మనందరికీ మళ్లీ మళ్లీ కనిపించే పాయింట్‌. ‘బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ’. ఇదీ ఈ రెండేళ్ల బాబు పరిపాలన తీరును ఒకసారి గమనిస్తే, మళ్లీ ఒకసారి కనిపించే నిజం.

రెండేళ్లుగా అదే స్క్రిప్ట్‌. స్క్రీన్‌ప్లే. సినిమా
ఈ రెండేళ్లుగా చంద్రబాబు ప్రజలకు తాను వెన్నుపోట్లు పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతూనే ఉంది. వీటన్నింటి నేపథ్యంలో చంద్రబాబు చేస్తున్న డైవర్షన్‌ పాలిటిక్స్‌. ఏ విషయంలో అయినా తనను ఎవరైనా గట్టిగా ప్రశ్నించే అంశం బయటకు వస్తే వెంటనే ఆ టాపిక్‌ డైవర్ట్‌ చేసేందుకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద, నా మీద అడ్డగోలుగా ఆరోపణలు చేయడం, టాపిక్‌ డైవర్ట్‌ చేయడం. అదే చంద్రబాబు తీరు. ఇదే రెండేళ్లుగా జరుగుతున్న స్క్రిప్ట్, స్క్రీన్‌ ప్లే, సినిమా. అదే చూస్తున్నాం.

చంద్రబాబు సీఎం.. రాష్ట్రానికి దురదృష్టం
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. చంద్రబాబు అనే వ్యక్తి రాష్ట్రానికి ఎన్నటికీ కూడా రాజధాని లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు కాదు. రాష్ట్రానికి భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నాడు. లక్ష ఎకరాల అమరావతిలో కేవలం రోడ్లు, నీళ్లు, కరెంటు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకే అక్షరాలా రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఆచరణకు సాధ్యం కాదని తెలిసి కూడా, చంద్రబాబుగారు తన స్కాముల కోసం మాత్రమే రాజధాని అనే భ్రమలు కల్పిస్తూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాడు. YS Jagan Pressmeet

అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు. ఒట్టిమాట:
రాజధాని అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ ప్రాజెక్టు అని ఇంత వరకు తాను చెప్పినవన్నీ కూడా దొంగమాటలని తేలిపోయాయి. ఇప్పటికే అమరావతికి తెచ్చిన, కమిట్‌ అయిన అప్పులు అక్షరాలా రూ.47,387 కోట్లు. రాష్ట్ర ఖజానా నుంచి మరో రూ.9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు చూపుతున్నారు. స్కామ్‌లో కోసం ఎందుకయ్యా రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నావు? అని ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతోంది.

అందుకే మోస్ట్‌ ప్రాక్టికల్‌గా రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా మనసులో పెట్టుకుని రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, రావాలి అన్న ఒక తపన, తాపత్రయంతో ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కి.మీ, విజయవాడ నుంచి గుంటూరు మరో 40 కి.మీ. ఈ 110 కి.మీ హైవేకు అటు ఇటుగా రాజధాని కారిడార్‌గా పెట్టమని మావిగన్‌ అని మేం ప్రతిపాదించాం.

మావిగన్‌ ప్రాంతంలో ఇప్పటికే మేం మా హయాంలో నాంది పలికిన పోర్టు శరవేగంగా ముందుకు సాగింది. మా హయాంలో పనులు కూడా జరిగాయి. విజయవాడలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు కనిపిస్తుంది. 3 రైల్వే స్టేషన్లు, నాలుగు నేషనల్‌ హైవేలు కలుస్తాయి. 9 గవర్నమెంట్, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. యూనివర్సిటీలు ఉన్నాయి. మరెన్నెన్నో విద్యా సంస్థలున్నాయి. దాదాపుగా 35, 40 లక్షల జనాభా ఇక్కడే ఉన్నారు. అదే అమరావతి అయితే అంతా జీరో నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పాం. YS Jagan Pressmeet

‘మావిగన్‌’ అంటే ఉలికిపాటు. రక్తపోటు:
మేం ప్రతిపాదించిన మావిగన్‌ కు ప్రజల్లో నుంచి మద్దతు వచ్చే సరికే ప్రజలందరూ కూడా ఇది కరెక్ట్‌ ఆలోచన, చంద్రబాబు స్కాముల కోసం రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేయడం ధర్మం కాదు అని చెప్పి, మేం ప్రతిపాదించిన మావిగన్‌కు మద్దతు పలుకుతుంటే సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక ఆక్రోశంతో చంద్రబాబుకు బీపీ పెరుగుతోంది. దీంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయనే కాకుండా ఆయన మంత్రులతో కూడా అబద్ధాలు చెప్పిస్తూ, బూతులు తిట్టిస్తున్నారు.

పొరపాటున చంద్రబాబుకు ఎవరైనా నిద్రలో మావిగన్‌ అని అన్నారంటే చాలు బహుశా గుండె ఆగి చనిపోయి, పోయినా పోతాడు. అంతగా ఆయనకు మావిగన్‌ అనే పేరు వింటే బీపీ పెరుగుతోంది. ఎప్పుడైనా మీరు పొరపాటున అనండి ఎప్పుడైనా. మావిగన్‌ గురించి మీ కామెంట్స్‌ ఏంటి సార్‌ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టం. వెంటనే మిమ్మల్ని తిట్టకపోతే, మీ మీద బ్లాస్ట్‌ కాకపోతే.. చూడండి.

అంతులేని అవినీతిమయం. అమరావతి నిర్మాణం:
ఇప్పటికే దాదాపుగా రూ.1200 కోట్లతో నిర్మించిన అసెంబ్లీ,  సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి మళ్లీ వాటి పేరుతోనే అంటే, మళ్లీ సెక్రటేరియట్, మళ్లీ అసెంబ్లీ, మళ్లీ హైకోర్టు అంటూ కొత్తగా బిల్డింగులు కడతానంటున్నాడు. పర్మినెంట్‌ సెక్రటేరియట్‌ అని కొత్త నామకరణం చేసి నిర్మిస్తున్న 5 బిల్డింగుల్లో (5 టవర్లు) చంద్రబాబు చేస్తున్న దోపిడీ చూస్తే ప్రజలంతా నివ్వెరపోతారు.

2018లో ఇదే 5 టవర్ల కోసం 52,20,496 చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) బిల్డప్‌ ఏరియాతో, రూ.2,271 కోట్లకు చంద్రబాబుగారు టెండర్లు ఖరారు చేసి అప్పగించారు. ఆ మేరకు ఒక్కో ఎస్‌ఎఫ్‌టీ నిర్మాణ వ్యయం దాదాపు రూ.4,350. అప్పటి రేట్ల ప్రకారం అదే చాలా ఎక్కువ. కాగా, మళ్లీ అవే బిల్డింగులు.. గతంలో పనులు ఎవరికైతే ఇచ్చారో ఆ టెండర్లు రద్దు చేసి, మళ్లీ కొత్త టెండర్లు పిల్చి ఆశ్చర్యకరంగా మళ్లీ వారికే పనులు అప్పగించారు. అంటే పాత టెండర్లు రద్దు చేసి అవే కంపెనీలకే అవే పనులు ఇచ్చారు. ఒక ‘టైయిలర్‌ మేడ్‌ రిగ్గింగ్‌’ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశారు. దీని వెనక ఉన్న మంత్రం ఏమిటంటే చంద్రబాబు నోరు విప్పరు.

అవే ఆ 5 బిల్డింగులకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం. చాలా ఆసక్తికరం. ఆ టవర్ల కేవలం స్ట్రక్చర్‌ కోసమే ఇప్పటికి రూ.4,354 కోట్లకు ఫైనలైజ్‌ చేశారు. మళ్లీ అదే బిల్డింగ్‌ల కోసం, ఆ కాంపౌండ్‌లో డ్రైనేజీ, నీళ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం అని  చెప్పి మరో రూ.1,053 కోట్లకు ఫైనలైజ్‌ చేశారు. మళ్లీ అవే బిల్డింగుల్లోనే లిఫ్టులు, ఏసీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్‌ కోసం మరో రూ.2,316 కోట్లకు ఫైనలైజ్‌ చేశారు. ఆ వ్యయం అంతటితో ఆగిపోలేదు. మళ్లీ అదే బిల్డింగులకే అదనంగా ఈసారి గ్లాస్‌ ఫిట్టింగ్‌ అట!. అద్దాల కోసం ఏకంగా మరో రూ.2,540 కోట్లు. మళ్లీ సేమ్‌ కాంట్రాక్టర్‌. ఇంకా ఈ బిల్డింగ్‌ల డిజైన్లకు మరో రూ.401 కోట్లు.

ఇవన్నీ వెరసి ఈ 5 బిల్డింగులకు అయ్యే ఖర్చు ఏకంగా రూ.10,665 కోట్లు. అంటే 52,20,496 చదరపు అడుగుల నిర్మాణంలో ఒక్కో ఎస్‌ఎఫ్‌టీ వ్యయం ఏకంగా ఇప్పటికే రూ.20,427. మళ్లీ వాటిలో ఇంటీరియర్స్, ఫర్నీచర్‌. అవన్నీ చేసే సరికి ఒక్కో ఎస్‌ఎఫ్‌టీకి రూ.30 వేలు లేక రూ.40 వేలు అవుతుంది. ఆ స్థాయిలో దోచేస్తున్నారు.

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం. ఇక్కడ నిర్మాణాలకు ఇసుక ఫ్రీ. వీటికి జీఎస్టీ మినహాయింపు. రీయింబర్స్‌మెంట్‌ ఉంది. ఎంఈఆర్‌ఐటీ మినహాయింపు ఉంది, డీఎంఎఫ్, ఎన్‌ఏసీ ఛార్జీల మినహాయింపు ఉంది. ఆ మినహాయింపుల విలువ రూ.681 కోట్లు. అవన్నీ రీయింబర్స్‌ చేస్తారు.
(అంటూ ఆ జీఓ కాపీలు పీపీటీలో చూపారు) YS Jagan Pressmeet

వేరే రాష్ట్రాల్లో నిర్మాణ వ్యయం ఎంత?:
బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహా నగరాల్లో కూడా ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలతో కడితే ఎస్‌ఎఫ్‌టీ వ్యయం రూ.4,500 దాటదు. తెలంగాణలో కూడా ఇటీవల కేసీఆర్‌గారు సచివాలయాన్ని కట్టారు. 28 ఎకరాల్లో నిర్మించారాయన. దాదాపు 10 లక్షల చదరపు అడుగులు. దాని నిర్మాణ వ్యయం రూ.615 కోట్లు. అలా వేసుకున్నా అక్కడ ఎస్‌ఎఫ్‌టీ నిర్మాణ వ్యయం రూ.6 వేలు మాత్రమే. అదే ఇక్కడ ఇప్పటికే ఎస్‌ఎఫ్‌టీ నిర్మాణ వ్యయం ఏకంగా రూ.20,427. ఏమిటీ దోపిడీ అని ఎవరైనా ప్రశ్నిస్తే బాబుకు బీపీ పెరుగుతుంది.

7 బిల్డింగ్‌ల వ్యయం రూ.14,092 కోట్లు:
అయిదు టవర్ల సెక్రటేరియట్‌ నిర్మాణ వ్యయం రూ.10,665 కోట్లు కాగా, 11,21,975 ఎస్‌ఎఫ్‌టీతో కొత్త అసెంబ్లీ కడుతున్నారు. దానికి ఇప్పటి వరకు తేల్చిన ఖర్చు రూ.1,947 కోట్లు. అంటే ఎస్‌ఎఫ్‌టీకి రూ.17,356 ఖర్చు .దీనికి సంబంధించి మూడు జీవోలిచ్చారు. ఇంకా కొత్త హైకోర్టు భవనం. దాన్ని 20,32,231 ఎస్‌ఎఫ్‌టీతో కడుతున్నారు. ఆ భవనానికి ఇప్పటివరకు పూర్తి టెండర్లు ఖరారు చేయలేదు కానీ, రూ.1480 కోట్లకు టెండర్లు పిల్చారు. అది పూర్తయ్యే సరికి ఖర్చు ఏ స్థాయికి పోతుందో తెలియదు. అంటే ఇప్పటివరకు ఏడు బిల్డింగుల పేరిట (5 సెక్రటేరియట్‌ భవనాలు. హైకోర్టు, అసెంబ్లీ) పేరుతో మొత్తం రూ.14,092 కోట్లు ఖర్చు చేస్తున్నారు.  YS Jagan Pressmeet

రోడ్లు. ఫ్లైఓవర్ల నిర్మాణమూ అంతే:
ఇంకా అమరావతిలో వేసే రోడ్డు స్కాములు చూస్తే కళ్లు చెదిరిపోతాయి. దేశంలో ఎక్కడైనా హైవేలు వేసినా కూడా కి.మీ రోడ్డుకు అయ్యే ఖర్చు ఎంత అని, 2026, ఫిబ్రవరి 5న పార్లమెంటులో వచ్చిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ బదులిచ్చారు. ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ప్రకారం కి.మీ రోడ్డు వ్యయం రూ.24 కోట్లు. కానీ అమరావతిలో మాత్రం అదే కి.మీ రోడ్డు కోసం రూ.53 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, గతంలో విజయవాడ బెంజి సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి కి.మీకు రూ.69 కోట్లు ఖర్చయ్యాయి. కానీ నేడు చంద్రబాబునాయుడు సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ నుంచి నేషనల్‌ హైవేకి వారధి వద్ద కలిపే ఫ్లై ఓవర్‌ కోసం వీళ్లు ఒక్కో కి.మీకు పెడుతున్న ఖర్చు అక్షరాలా రూ.189 కోట్లు.

బినామీలకు రోడ్డు పక్కన మంచి ప్లాట్లు:
ఇక అమరావతిలో చంద్రబాబు తన మనుషులైన ఏబీఎన్‌ రా«ధాకృష్ణ, సీ.అశ్వనీదత్, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్‌ వంటి వారికి, తన బినామీలకు కేటాయించిన ప్లాట్ల స్కాములు చూస్తే బెంబేలెత్తి పోవాల్సిందే. వీళ్లందరికీ అమరావతిలో రోడ్ల పక్కన విలువైన రిటర్నబుల్‌ ప్లాట్లు ఇస్తారు. అదే భూములిచ్చిన సామాన్య రైతులకు మాత్రం చెరువులు, వాగులు, కుంటల్లో ఇస్తున్నారు. ఏమిటీ అన్యాయం?.

మొదట తీసుకున్న 50 వేల ఎకరాలకే దిక్కులేదని రైతులు అంటూ ఉంటే, ఆ భూమి సరిపోదని మరో 50 వేల ఎకరాలు కావాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్లు ధర్నాలు చేస్తున్నా లెక్క చేయకుండా బలవంతంగా లాక్కుంటున్నారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ఇవన్నీ ప్రశ్నిస్తూ ఆధారాలతో సహా బయటపెడుతుంటే చంద్రబాబుకి బీపీ పెరుగుతోంది. ఇష్టమొచ్చినట్టు తిడుతూ, మంత్రులతో, తన వారితోనూ మమ్మల్ని దారుణంగా తిట్టిస్తున్నాడు.

అబద్ధాలు బిల్డప్‌. వాటి కోసం దొంగ సాక్ష్యాలు:
టాపిక్‌ డైవర్ట్‌ చేయించడానికి, తనను ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకు ఈ తిట్టించే కార్యక్రమం ఏ స్థాయికి పోతుందంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు మాఫియా ముఠాగా తయారై వీళ్లంతట వీరే బిల్డప్‌ ఇస్తారు. కట్టుకథలు అల్లుతారు. బురద జల్లుతారు. వీరు ఏదనుకుంటే అదే నిజం. ఒక అబద్ధాన్ని బిల్డ్‌ చేస్తారు. దాన్ని నిజం చేయడానికి దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసులు పెడతారు.

ఈ మధ్య కాలంలో కడపలో పెద్ద దస్తగిరి అనే మా పార్టీ కార్యకర్తను చంపేశారు. ఆయన చనిపోతే మేం చాలా బాధపడ్డాం. అలాంటిది ఆ కేసును పూర్తిగా ట్విస్ట్‌ చేసి మా పార్టీ మీదనే బురద జల్లడం కోసం వాడుకుంటున్నారు. చివరికి కడప డిప్యూటీ మేయర్‌గా పని చేసిన నిత్యానందరెడ్డిని, మా రవి మామ (పి.రవీంద్రనాథ్‌రెడ్డి)పై బురద చల్లి  కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు.  YS Jagan Pressmeet

మృతుడి భార్య చెప్పినా..:
జాతరలో గొడవ వల్ల ఈ హత్య జరిగిందని స్వయంగా పెద్ద దస్తగిరి భార్య జరిగిన విషయాన్నంతా మీడియా ముందుకొచ్చి చెప్పింది. తాము ఎవరికీ బినామీలు కాదని, నిత్యానందరెడ్డితో తమకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పింది. వారంతా వైయస్సార్సీపీ కార్యకర్తలే. వారు చనిపోతే బాధపడేది మేమే. అయినా సరే చంద్రబాబునాయుడు తన రాజకీయం కోసం టాపిక్‌ డైవర్షన్‌ చేసేందుకు వైయస్సార్సీపీ మీద బురద జల్లేందుకు కుట్రలతో ఏ స్థాయికి దిగజారుతున్నాడంటే.. టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతితో కలిసి ఒక కథను తయారు చేస్తారు. దాన్నే నిజమని చెప్పడానికి పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు. అధికారంలో ఉన్నారు కాబట్టి, వ్యవస్థలన్నీ వీళ్ల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి, వెంటనే వీళ్ల పోలీసులు రంగ ప్రవేశం చేస్తారు.

గతంలో ఇదే పోలీసులు వేరే రకంగా చెప్పిన మాటలను వెనక్కి తీసుకుంటారు. వీళ్లు చెప్పిన కల్పిత కథ చుట్టూ కేసు బిల్డప్‌ చేస్తారు. దాని చుట్టూ దొంగ సాక్ష్యాలు సృష్టిస్తారు. కొంతమందిని ప్రలోభ పెడతారు. కొంతమందిని బెదిరిస్తారు. కేసు పెట్టి మా వాళ్లనే అరెస్ట్‌ చేస్తారు. పెద్ద దస్తగిరి భార్య వచ్చి జరిగిందంతా చెప్పి ఆమె బాధ పడుతోంది. మా పార్టీ కార్యకర్త చనిపోతే మేం బాధపడుతుంటే మా వారిపైనే తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసి జైలుకు పంపే కుట్రలు చేస్తున్నారు.

రెండేళ్లుగా జరుగుతున్న ఇదీ అరాచకం:
తప్పుడు కేసులు వీళ్లే పెడతారు. తప్పుడు సాక్ష్యాలు వీళ్లే సృష్టిస్తారు. మళ్లీ వీళ్లే ఆ తప్పుడు కేసుల్లో మా వాళ్లను ఇరికిస్తారు. సోషల్‌ మీడియా యాక్టివిస్టులు అయినా సరే.. కాలేజీలు, యూనివర్సిటీల్లో యాక్టివిస్టులుగా ఉన్న పిల్లలైనా సరే.. వైయస్సార్‌సీపీకి మద్దతుగా ఉన్న వాళ్లైనా సరే.. వైయస్సార్‌ సీపీ వారైనా సరే.. ఎవరైనా చంద్రబాబుగారిని వ్యతిరేకిస్తే.. ఇదే రివార్డ్‌.. ఇదే స్క్రిప్ట్‌.. రెండేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్నదిదే.

ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్‌ కల్చర్‌? ఎవరివి హత్యా రాజకీయాలు?:
నేను సూటిగా చంద్రబాబుగారిని అడుగుతున్నాను. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ?. ఎవరిదయ్యా గన్‌ కల్చర్‌?. ఎవరివయ్యా హత్యా రాజకీయాలు?. ఎవరిదయ్యా హత్యా రాజకీయాల సంస్కృతి?. మా కుటుంబంలో ముగ్గురు. మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్న.. ముగ్గురూ బలైపోయారు. మేము బాధితులం. కానీ మాపైనే వీళ్లు తప్పుడు రాజకీయాలు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డిని చంపిందెవరు? టీడీపీ వాళ్లు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతున్నా. 1999  అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు  మా తాతగారు రాజారెడ్డిగారిని చంపారు. కేవలం మా నాన్నగారు రాజశేఖర్‌ రెడ్డిని పులివెందులకు కట్టడి చేయాలన్న ఒక్క రాజకీయ కోణంతోనే. ఆ కేసులో దోషులను బరి తెగించి హైద్రాబాద్‌ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఉంచి, అధికార దుర్వినియోగం చేసి రక్షించారు జైలుకు పంపకుండా. మరి ఎవరిదయ్యా క్రిమినల్‌ బ్రెయిన్‌? అని చంద్రబాబుగారిని అడుతున్నా. YS Jagan Pressmeet

మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోవడానికి రెండు, మూడు రోజుల ముందు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అప్పట్లో. ఆ అసెంబ్లీ సమావేశాల క్లిప్పింగ్‌ మీరు కూడా చూడండి. చంద్రబాబుగారు అన్న మాట అసెంబ్లీలో. ‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తా’ అని చంద్రబాబు అన్నారు. ఆ మాట చంద్రబాబు అన్నాక రెండు మూడు రోజులకే నాన్నగారు హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. ఇప్పటికి కూడా దీనికి సంబంధించి నివృతి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. మరి ఎవరిదయ్యా క్రిమినల్‌ బ్రెయిన్‌?  అని చంద్రబాబును అడుగుగుతున్నా.

మా చిన్నాన్న వివేకానందరెడ్డిగారు, ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైంది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఎన్నికల్లో అవినాష్‌రెడ్డి కోసం ప్రచారం చేస్తూ, జమ్మలమడుగుకు వెళ్లి వచ్చిన ఆయన్ను చంపేశారు. పైగా, తానే వివేకం చిన్నాన్నను హత్య చేశానంటూ సాక్షత్తూ లైవ్‌ టీవీ షోలో చెలరేగిపోయి, విచ్చలవిడిగా మాట్లాడిన వ్యక్తి దస్తగిరి. జైల్లో ఉండాల్సిన వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో కారులో దర్జాగా తిరుగుతున్నాడు. అంతే కాదు. చంద్రబాబు లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రా. దస్తగిరి లాయర్‌ కూడా సిద్ధార్థ్‌ లూథ్రానే. మరి ఎవరిది చంద్రబాబూ క్రిమినల్‌ బ్రెయిన్‌?

రాజకీయ లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం.. నిర్దోషులను హింసించడం.. ఈ కేసులో జరుగుతోంది ఇదే కదా చంద్రబాబూ?  ఇంకో ఉదాహరణ.. చంద్రబాబు బావమరిది, వియ్యంకుడు అయిన బాలకృష్ణ తన ఇంట్లో టపా టపా అని ఇద్దరిని కాల్చలేదా? మర ఎవరిది గన్‌ కల్చర్‌? తర్వాత ఆ ఘటన జరిగిన కొద్దిరోజులకే సాక్షులు ఉండకూడదని చెప్పి వాళ్ల ఇంట్లో ఉన్న వాచ్‌మెన్‌ను బండరాయితో మోది చంపారు.

మరో ఘటన. ఎన్టీఆర్‌ గారి అబ్బాయి హరికృష్ణ యాక్సిడెంట్‌లో చనిపోతే.. పరామర్శకని వెళ్లి.. కేటీఆర్‌ తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడాడు. శవాన్ని పెట్టుకుని. మరి ఎవరిదయ్యా శవ రాజకీయం?. అంతేకాదు. సొంత కూతురినిచ్చి రాజకీయ జీవితాన్నిఇచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆయన గుర్తును లాక్కుని ఆయన్ను చనిపోయేటట్టుగా చేసింది ఎవరని అడుగుతున్నా? ఎవరివయ్యా కుట్ర రాయకీయాలు?

వంగవీటి రంగాగారు ఒక టైగర్‌. ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిరాహారదీక్ష చేస్తుంటే.. అప్పుడు చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అర్ధరాత్రి నరికి చంపారు. ఈ ఘటనలో వేళ్లన్నీ చంద్రబాబుగారి వైపే చూపిస్తాయి. హరిరామజోగయ్యగారు అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి.   చంద్రబాబుగారి సహచరుడు. ఆయన ఒక పుస్తకం రాశారు. రంగాగారి హత్యలో చంద్రబాబు పాత్ర ఎంత బలంగా ఉందో అని. ఆ హత్య కేసులో ఒక ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణ. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే.

ఇంకా ముందుకు పోతే..:
ఇంకా ముందుకు పోదాం. హత్యా రాజకీయాలు ఎవరివో? కుట్ర రాజకీయాలు ఎవరివో? శవ రాజకీయాలు ఎవరివో ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తేటతెల్లమవుతున్నాయి. ఎన్టీఆర్‌ గారి మీద దాడి చేసిన కేసులో మల్లెల బాబ్జి అనే అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కొన్నాళ్ల తర్వాత అతను ఒక లాడ్జిలో శవమై కనిపించాడు. ఆయన జేబులో ఒక లెటర్‌ దొరికింది. దాని సారాంశం ఏంటంటే.. తనకు రూ.3 లక్షలు ఇస్తామని చెప్పి.. చివరికి రూ.30 వేలే ఇచ్చామని సారాంశం. అసలు ఎన్టీఆర్‌ మీద దాడి చేయడానికే డబ్బులు ఇచ్చారా? అది నిజమైతే ఇచ్చిందెవరు అన్నదానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులో వేళ్లన్నీ కూడా చంద్రబాబు వైపే చూపించాయి.

పింగళి దశరథరామ్‌. ఈయన ఒక జర్నలిస్ట్‌. విజయవాడలో ఎన్‌కౌంటర్‌ అనే పత్రికను పెట్టి టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తుంటే.. ఈ వ్యక్తిని హైదరాబాద్‌ నుంచి బస్సు దిగి రిక్షాలో వెళుతుంటే.. కత్తులతో దాడి చేసి దారుణంగా చంపారు. ఈ ఘటనలో వేళ్లన్నీ కూడా చంద్రబాబు వైపే చూపించాయి. అందుకే అడుగుతున్నా చంద్రబాబును, ఎవరివయ్యా హత్యా రాజకీయాలు? ఎవరివయ్యా శవ రాజకీయాలు? ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు?

చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఏకంగా పుస్తకమే రాశాడు. అనేక టీవీల్లో ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.  ఆయన పుస్తకంలో రాసినవి. టీవీల్లో అన్న మాటలు.. ధర్నాలు, ఆందోళన సమయంలో బస్సులు తగలబెట్టాలని చంద్రబాబుగారు పార్టీ క్యాడర్‌కు చెప్పే వాడని.. బస్సులు తగలబెట్టకపోతే అవి ధర్నాలు కావట! నేను కాదు అది చెప్పింది. చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. చంద్రబాబు రాక్షస రాజకీయం గురించి టీవీ ఇంటర్వ్యూల్లో.. పుస్తకంలో వివరించినవి.

హరిరామజోగయ్యగారి గురించి ఇంతకు ముందు చెప్పా. ఆయన కూడా చంద్రబాబు సహచరుడు, మంత్రి. ఏ రకంగా చంద్రబాబు కుట్రలు చేస్తారు? రాక్షస రాజకీయాలు చేస్తారనేది ఆయన కూడా సవివరంగా వివరించారు.

జగన్‌ మంచోడు కాబట్టే..:
హత్యలతో.. వెన్నుపోట్లతో.. శవాలతో.. కుట్రలతో రాజకీయాలు చేసింది.. చేస్తోంది చంద్రబాబుగారైతే.. విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తోంది మేము. గర్వంగా కూడా చెబుతా నేను ఈ మాట. వైయస్సార్‌ కాంగ్రెస్, జగన్‌ గురించి నేను గర్వంగా చెబుతున్నా. జగన్‌ మంచోడు కాబట్టి మా తాత రాజారెడ్డిని చంపిన  వాళ్లు ప్రశాంతంగా బతుకుతున్నారు. జగన్‌ చెడ్డోడైతే వాళ్లంతా బతికి ఉండేవాళ్లా? మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్లు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్‌ నైజం, మనస్తత్వం ఎలాంటివి అని చెప్పడానికి నిదర్శనాలు ఇవి. వారికెప్పటికీ ఏమీ కాదు. మాకు నాన్న నేర్చించింది హత్యలు చేయమని కాదు చంద్రబాబుగారి మాదిరిగా.  ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకుని రాజకీయాలు చేయాలి అని. అదీ చంద్రబాబుకు, మాకు ఉన్న తేడా.

సిగ్గనిపించడం లేదా? చంద్రబాబుగారూ:
రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో? ఎవరికి కుట్రలు, గొడ్డళ్లు, గునపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబుగారు మీకు 75 ఏళ్ల వయసు.. బహుశా మీకు ఇది లాస్ట్‌ ఎలక్షన్‌ ఏమో. ఎన్నికలు వచ్చేసరికి 80 ఏళ్లు. ఈ వయసులో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అని అడుగుతున్నా. ఈ రెండేళ్ల చంద్రబాబు పాలన హయాంలో వైయస్సార్‌సీపీ కార్యకర్తలను ఏ మాదిరిగా దారుణంగా చంపిన ఘటనలు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనించండి.
(అంటూ ఆ వివరాలు ఫోటోలతో సమా పీపీటీలో చూపారు)
– వినుకొండలో జూలై 17, 2024లో వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ను దారుణంగా చంద్రబాబునాయుడు నడిరోడ్డు మీద నరికి చంపించే కార్యక్రమంలో ప్రోత్సహించాడో ఈ ఫొటోలు చూస్తే అర్థం అవుతుంది.
– 2024 ఆగస్టు 4 వైఎస్సార్‌సీపీ నేత పెద్ద సుబ్బారాయుడు నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో చంపారు.
– 2024 జూలై 3 వైఎస్సార్‌ సీపీ నాయకుడు సతీష్, అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో గొల్లాపురంలో టీడీపీ నాయకుల దాడిలో గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
– 2025 ఏప్రిల్‌ 29 వైఎస్సార్‌ సీపీ కార్యకర్త పెద్ద రఫీ, నెల్లూరు జిల్లా నాగాయగుంట, పోలినాయుడు చెరువు గ్రామంలో హత్య.
– 2026 జనవరి 16 వైఎస్సార్‌ సీపీ కార్యకర్త మందా సాల్మన్‌. పల్నాడు జిల్లా మాచవరం మండలి పిన్నెల్లిలో హత్య.
– 2024 ఆగస్టు 18 వైఎస్సార్‌ సీపీ కార్యకర్త కూన ప్రసాద్, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం, ఫరీదుపేట గ్రామంలో హత్య. ఇవన్నీ ఈ రెండేళ్లలో జరిగిన ప్రధాన హత్యలు. చంద్రబాబు హత్య చేయిస్తున్నాడు. కుట్ర చేయిస్తున్నాడు. శవ రాజకీయాలు చేయిస్తున్నాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది జంగిల్‌ రాజ్‌. హత్యా రాజకీయాలు. చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దారుణ పాలన ఇది.

నకిలీ మద్యం కేసు. జోగి రమేష్‌పై కుట్ర:
ఇంకొక విస్తుగొలిపే విషయం ఏంటంటే. ఈ మధ్యకాలంలోనే ఈనాడు పత్రిక ఫ్రంట్‌ పేజీలో చూశా జోగి రమేష్‌ ఫొటో. 89 మంది సాక్షులను విచారించారంట!. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నారు. అలాంటిది చంద్రబాబు హయాంలో నకిలీ మద్యం తయారు చేస్తుంటే.. తయారీదారులకు, పోలీసులకు మధ్య లావాదేవీల మధ్య తేడా వచ్చి ఈ విషయం బయటకు వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి ఆయన హయాంలో జరుగుతున్న నకిలీ మద్యం ఫ్యాక్టరీలు. ఆయన ప్రభుత్వం వచ్చిన ఒకటిన్నర సంవత్సరం తరువాత ఈ విషయాలు బయటపడ్డాయి.

తంబళ్లపల్లెలో చంద్రబాబునాయుడు పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి ఆయన ఆధ్వర్యంలో, ఆయన సన్నిహితులు, పీఏల ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేస్తూ, పోలీసులు రైడ్‌ చేస్తే వీళ్లంతా దొరికారు. ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం, చేసినది చంద్రబాబు పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి. కానీ కేసు ఏమో విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్న మా జోగి రమేష్‌ మీద.

నిజంగా మనుషుల్లో మానవత్వం అనేది ఎక్కడైనా ఉండాలి. ఒక అబద్ధానికి రెక్కలు కడుతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా ఇరికించే కార్యక్రమం చేస్తున్నారు. 83 రోజులు జోగి రమేష్‌ను బీసీ నాయకుడు అని చూడకుండా జైల్లో పెట్టారు. ఈ తప్పుడు కేసులో జైల్లో పెట్టారు. 83 రోజుల తరువాత ఆయన బయటకు వస్తే ఇంటి మీద యాసిడ్‌ బాటిల్స్‌తో దాడి చేయించారు. యాసిడ్‌ బాటిళ్లతో దాడి చేయించిన టీడీపీ వాళ్లను స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారు. పోలీసుల సమక్షంలో ఇదంతా జరిగింది.

మళ్లీ ఇప్పుడు ఛార్జిషీట్‌ ఫైల్‌ చేశారని విన్నా. 89 మంది సాక్షులు జోగి రమేష్‌ పేరు చెప్పారట!. నిజంగా ఎంత దారుణంగా కేసులు బిల్డప్‌ చేస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఉండవు. కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలు, ఇరికించడాలు, ప్రలోభాలు పెట్టడాలు, బెదిరించడాలు ఇవన్నీ జరుగుతున్నాయి.

రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియా:
ఈరోజు నిజంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా.. ప్రతి 5 బాటిళ్లకు ఒక నకిలీ బాటిల్‌ అమ్ముతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పెరగడం లేదు. తయారు చేసేది చంద్రబాబు హయాంలోనే. ఆయనే ముఖ్యమంత్రి. అమ్మేది చంద్రబాబుగారి మాఫియా ముఠా, బెల్ట్‌ షాపులు. పోలీసులు బెల్ట్‌ షాపులు నడుపుతున్నారని తెలుసు. ఎమ్మార్పీ రేటుకన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని తెలుసు. అక్కడ ప్రతి 5 బాటిళ్లలో ఒకటి నకిలీ బాటిల్‌ ఉందని తెలుసు. అయినా పోలీసులు బెల్ట్‌ షాపుల జోలికిపోరు. ఆవైపు కన్నెత్తి చూడరు. జరుగుతున్నది ఇదీ.

మామిళ్లపల్లిలో దారుణం
మరో ఘటన. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం. ఇది నిజంగా చాలా దారుణమైన ఘటన. మన కళ్ల ఎదుటే జరుగుతోంది భావి సమాజం మొత్తం నిజంగా ఖండాల్సిన అంశం. మామిళ్లపల్లిలో కాపు సామాజికవర్గానికి చెందిన ఐదుగురు చిన్న రైతులు తాము పండించిన మొక్కజొన్న పంటకు రేటు లేదని, ఎమ్మెస్పీ చూస్తే రూ.2,400. కొనేవాడు చూస్తే రూ.1600–1400కు అడుగుతున్నాడు. రేటు లేక వాళ్లు వాళ్ల చిన్న గోడౌన్‌ ో ఆ ఐదుగురు రైతులు వాళ్ల ఊర్లో పెట్టుకున్నారు. అది మా అంబటి మురళి ఇంటి పక్కన. ఆయనదీ అదే ఊరు. ఆయనా కాపు సామాజికవర్గమే. దీంట్లో తప్పు ఎక్కడా జరిగిందనే దానికి అవకాశమే లేదు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే, చంద్రబాబుగారు.. పోలీసులను పంపుతారు. గోడౌన్‌ మీద రెయిడ్‌ చేయిస్తారు. ఆ గోడౌన్‌ మురళిది అని చెప్పి అబద్ధాలు, అభాండాలు వేస్తారు. ఆ గోడౌన్‌లో వైయస్సార్‌ సీపీ జెండాలు వీళ్లే తీసుకుని పోతారు. పెడుతున్నారు. అవి కూడా వీడియోల్లో దొరుకుతాయి.

అక్రమంగా మొక్కజొన్న నిల్వ చేశారంటూ గోడౌన్‌ సీజ్‌ చేశారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సీజ్‌ చేయడం ఏంది స్వామీ, రేటు లేక పెట్టుకున్నారు అక్కడ. నువ్వు రేటు ఇచ్చి తీసుకుంటావేమో బంగారంలా కొనుక్కో. వాళ్లే అదే అడుగుతున్నారు. వాళ్లు దాన్ని ఎందుకు కొనుక్కుంటారు, కొనుక్కుని ఏం చేసుకుంటారు, వాళ్లు నిల్వ చేసి ఏం చేసుకుంటారు దాన్ని. నువ్వు రూ.1400 ఇస్తున్నావు రూ.2,400 రావడం లేదు కాబట్టి ఆ చిన్న గోడౌన్లో పెట్టుకున్నారు.

ఏం తప్పు చేశారు? గోడౌన్‌ ఎందుకు సీజ్‌ చేశారు, ఆ రైతులకు ఈరోజు పంట లేదు. వైయస్సార్‌ సీపీ నాయకులు పోతున్నారు. గోడౌన్లు చూస్తున్నారు. వెళ్తే కాపు సామాజికవర్గానికి చెందిన ఆడవారు, రైతన్నలు వచ్చి విషయాలన్నీ చెబుతుంటే వాళ్లను పోలీసులు ఏకంగా తాడుతో కట్టేస్తున్నారు. జంగిల్‌ రాజ్‌ కాకపతే ఏంది స్వామీ ఇది? దొంగ కేసులు. తప్పుడు సాక్ష్యాలు.

సోషల్‌ మీడియాపై సెన్సార్‌షిప్‌!:
రాష్ట్రంలో ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే.. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి కూడా లేదు. సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌లో ఎక్కడైనా అమరావతిలో జరుగుతున్న స్కాములు ఎవరైనా చూపిస్తే, ఎవరైనా క్వశ్చన్‌ చేస్తూ పెడితే, లేకపోతే ఇందాపూర్, హెరిటేజ్‌ సంబంధాల మీద ఎవరైనా రాసినా, వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధాల మధ్య ఎవరైనా ఆధారాలు చూపిస్తూ సోషల్‌ మీడియాలో పెట్టినా, లేకపతే తిరుమల లడ్డూ విషయంలో, మహిళల మీద అఘాయిత్యాల మీద, సాక్ష్యాత్తూ టీటీడీ చైర్మన్‌ గా ఉన్న వ్యక్తి ప్రదర్శిస్తున్న తీరు మీద ఎవరైనా సోషల్‌ మీడియాలో పెట్టినా ఇవేవీ కూడా కనిపించవు. విచ్చలవిడిగా చంద్రబాబునాయుడుగారు చేస్తున్న మద్యం, గంజాయి, ఇసుక, మట్టి మాఫియా ఇటువంటి దోపిడీల పైన ఎవరైనా సోషల్‌ మీడియాలో పోస్టు చేసినా ఈ కంటెంట్‌ అంతా కనపడకుండా చేసేందుకు ఏం చేస్తున్నారో తెలుసా? ఎక్కడా లేని విధంగా సోషల్‌ మీడియాను సెన్సార్‌ చేస్తున్నారు.

సోషల్‌ మీడియా పోస్టులపై చంద్రబాబునాయుడుగారే తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు. కుప్పంలో పోయి కేసు పెట్టిస్తాడు. దాని మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు. ఆ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ను ఆ సీఐ ట్విట్టర్‌ కు, ఫేస్‌ బుక్, ఇన్‌ స్టాకు ఇలాంటి వారి హెడ్‌ క్వార్టర్స్‌ కు పంపిస్తాడు. ఆ ఎఫ్‌ఐఆర్‌ పెట్టి డిలీట్‌ చేయమని.
(అంటూ గుంటూరులోని కొత్తపేట సీఐ రాసిన లేఖ పీపీటీలో చూపి, చదివి వినిపించారు).

పోలీసులు డ్యూటీ మర్చిపోయారు:
ఎక్కడా లేని విధంగా పోలీసులనే వాళ్లు ఎలా తయారయ్యారనే దానికి ఇది నిదర్శనం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పోలీస్‌ డ్యూటీ కనిపించదు. రాష్ట్రంలో ఏ కాలేజీ చూసినా ఈరోజు గంజాయి కనిపిస్తుంది. విచ్చలవిడిగా కాలేజీల్లో గంజాయిఅమ్ముతున్నారు. డ్రగ్స్‌ అమ్ముతున్నారు. కానీ పోలీసులు దాన్ని కట్టడి చేస్తూ కనిపించరు. ప్రతి 5 లిక్కర్‌ బాటిళ్లలో ఒకటి నకిలీ. అయినా ఏ పోలీసూ బెల్ట్‌ షాపు దగ్గరికి పోడు. పోలీసులు చేసేదేమిటి అంటే తప్పుడు కేసులు పెట్టడం, చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా తప్పుడు కేసులు, దాని చుట్టూ తప్పుడు సాక్ష్యాలు క్రియేట్‌ చేయడం వీళ్లను జైలుకు పంపించాలని తాపత్రయపడటం. నిజంగా గవర్నెన్స్‌ అనేది పూర్తిగా పోయింది.

ఈరోజు ఆడవాళ్లకు రాష్ట్రంలో భద్రత లేదు. పోలీసులు తమ కనీస బాధ్యతలను ఎప్పుడో మర్చిపోయిన పరిస్థితులు. మా హయాంలో దిశ అని తీసుకొచ్చి ఏ తల్లికి అయినా, పాపకు అయినా కూడా ఏ అట్రాసిటీ జరిగినా కూడా ఫోన్‌ చేస్తే వెంటనే 10 నిమిషాల్లో పోలీసు పోయేవాడు. వెంటనే ఫోన్‌ వచ్చేది ఏమైందమ్మా అని. గ్రామస్థాయిలోనే మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌. వెంటనే రెస్పాండ్‌ అయ్యేవాళ్లు. నేరం జరక్క మునుపే ఆపే వాళ్లు. ఈరోజు ఎవరూ పట్టించుకునేవాడు లేడు.

ఎన్నికల హామీల అమలు ఏది?:
ప్రజలందరూ గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నారు. అయ్యా ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ అన్నావు, సూపర్‌ సెవెన్‌ అన్నావు. మేనిఫెస్టోలో 143 హామీలిచ్చావు. వీటి సంగతేమిటయ్యా అని చంద్రబాబును గట్టిగా ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరఫున మేం కూడా చంద్రబాబును గట్టిగా నిలదీస్తూనే ఉన్నాం.

పెట్రో ధరలు:
ఈ చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టిన ఈ హామీలను ప్రస్తావిస్తూ, ఒకసారి గమనిస్తే పెట్రోలు, డీజిల్‌ రేట్లు.. ఇప్పుడు హాట్‌ టాపిక్‌ ఇది. పెట్రోలు, డీజిల్‌ రేట్లు తగ్గిస్తామంటూ వీళ్లు ఇచ్చిన హామీ ఈరోజు వెన్నుపోటు కాదా?  రెండేళ్లు అయిపోయింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు హయాంలో 2014–19 మధ్య ఏ రేట్లు అయితే ఉన్నాయో, ఆరేట్లే మా హయాంలో ఉన్నాయి. కేవలం ఒక్క రూపాయి మాత్రమే మేం అదనంగా పెంచింది. అది కూడా కోవిడ్‌ లాంటి రాష్ట్రంలో ప్రబలుతున్న సమయంలో, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాని పరిస్థితుల్లో రోడ్ల మరమ్మతుకోసం అని చెప్పి ఒక రూపాయి పెంచాం. చంద్రబాబు హయాంలో ఎప్పుడెప్పుడు రేట్లు పెరిగాయో చూడండి.
(అంటూ పీపీటీలో పెట్రో రేట్లు చూపించారు)

చంద్రబాబునాయుడు 2015లో పెట్రోలు మీద, డీజిల్‌ మీద వేసిన పన్నులు. పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్‌. ఆ మేరకు 2015, ఫిబ్రవరి 5న జీఓ. వ్యాట్‌కు అదనంగా ప్రతి లీటర్‌పై రూ.4 వడ్డన. ఆ తర్వాత మా హయాంలో కోవిడ్‌ లాంటి మహమ్మారి సమయంలో 2020 సెప్టెంబర్‌ 19న మేము రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం ఒక్క   రూపాయి రోడ్‌ సెస్‌ వేశాం. అంతే మేం చేసింది అంత కన్నా ఏం పెంచలేదు. దీన్ని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేష్‌ వీళ్లంతా కలిసి నానా యాగీ చేసి తమిళనాడు బార్డర్లో ఫొటోలు, సెల్ఫీలు తీసి ఓ ఎంతో బాదుతున్నట్టు పోజు కొట్టి మేం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించేస్తాం, అన్నారు. ఆ దొర అన్న మాటలు ప్లే చేసి చూపించండి.
(అంటూ చంద్రబాబు, లోకేష్‌ ప్రసంగాల వీడియో చూపారు)

మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలో వస్తానే పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించేస్తాం అని. రెండేళ్లు అయిపోయింది. రూపాయి తగ్గకపోగా పెట్రోలు, డీజిల్‌ రూ.4 పెరిగింది. నిజంగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.

అంతా అస్తవ్యస్తం. కష్టాల్లో ప్రజలు:
ఓ పక్క ఏమో మా ప్రభుత్వ హయాంలో ఉన్న స్కీములన్నీ రద్దయి పోయాయి. ప్రజలకు చేతిలో గవ్వలేదు. మరోపక్క ఈయన ఇస్తానన్నవన్నీ మోసాలు. మరోపక్క రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. అతలాకుతలం అవుతున్న గ్రామీణ వ్యవస్థ. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రద్దు. రుణాల పరపతి మా హయాంలో మేం స్టార్ట్‌ చేసినప్పుడు రూ.25 వేల కోట్లు ఉంటే దాన్ని రూ.49 వేల కోట్లకు రుణాలు పెంచుకుంటూ పోతే, సున్నా వడ్డీ ఇస్తూ, చేయూతనిస్తూ, అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలుస్తూ, ఆసరా అనే ప్రోగ్రామ్‌ ను అమలు చేస్తూ, రకరకాలుగా చేయూతనిస్తూ మేం తీసుకుపోతే, చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల పరపతి ఎంత దారుణంగా పడిపోయిందంటే.. సున్నా వడ్డీ సైతం రాని పరిస్థితి.

ఆసరా, చేయూత కథ దేవుడెరుగు. అన్ని పథకాలు రద్దయి పోయాయి. ఈయన ఇస్తానన్న సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్లు మోసాలుగా తేలాయి. అక్కచెల్లెమ్మల పరపతి ఈరోజు మా హయాంలో రూ.49 వేల కోట్లకు పెరిగితే, చంద్రబాబు హయాంలో అవి మొన్న డిసెంబర్‌ నాటికి రూ.31 వేల కోట్లకు పడిపోయాయి.  ఓ పక్క గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఉచిత పంటల బీమా పథకం లేదు.క్రాప్‌ ఇన్సూరెన్స్‌ లేదు. ఇన్‌ పుట్‌ సబ్సిడీ లేదు. మోంథా తుపాను ఇన్‌ పుట్‌ సబ్సిడీ ఇంత వరకు లేదు. గ్రామీణ వ్యవస్థ కుప్పకూలిన పరిస్థితుల్లో రూ.4 పెట్రోలు, డీజిల్‌ రేట్లు పెరిగాయి.

మరి ఈ పెద్దమనిషి చంద్రబాబు ఏం చేయాలి? చెంపలేసుకుని రెండేళ్ల కిందటే తగ్గించాల్సింది, కనీసం ఇప్పుడైనా తగ్గించాలి కదా?  కనీసం రూ.8 అయినా తగ్గించాలా? లేదా?.

సంక్షోభంలోనూ స్కామ్‌:
పెట్రో ధరలు తగ్గించకపోగా ఈ మనిషి ఏం చేశాడో తెలుసా?  ఇది స్కాము. సంక్షోభంలో స్కాములు ఎలా చేస్తారో చంద్రబాబు దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఓ పక్క ఏప్రిల్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది. పెట్రోలు బంకుల దగ్గర బారులు తీరారు. ఆ పరిస్థితుల్లో ప్రజలు ఉన్న సమయంలో ప్రజలకు మంచి చేయాలా చంద్రబాబు గారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ పెట్రోలు, డీజిల్‌ అందుబాటులో ఉంచి కనీసం మేలు చేయాలన్న ఆలోచన చేయాల్సింది పోయి చంద్రబాబు ఏం చేశాడో తెలుసా?

బీపీసీఎల్, ఐవోసీ వీళ్లందరికీ ఆయిల్‌ కంపెనీలకు ఏమని లెటర్‌ రాశాడో తెలుసా.. ప్రజల కోసం కాదు లెటర్లు రాసేది. అమరావతిలో కాంట్రాక్టర్లకు రీటెయిల్‌ బంకుల్లో బల్క్‌ సప్లయ్‌ అనేది ఇవ్వకండి అవి రేటెక్కువ. రీటెయిల్‌ బంకుల్లో వాళ్లు తీసుకుంటారు. అది రేటు తక్కువ ఆ పెట్రోలు, డీజిల్‌ అందుబాటులో ఉంచాలని లేఖ రాశాడు.
(అంటూ ఆ లేఖ పీపీటీలో చూపారు).
దానికి కేంద్రం చంద్రబాబుకు చీవాట్లు పెడుతూ లేఖ వెనక్కి రాసింది. బుద్ధీ జ్ఞానం ఉందా లేదా చంద్రబాబూ నీకు.. దేశంలో పెట్రోలు, డీజిల్‌ దొరక్క ప్రజలందరూ అవస్థలు పడుతుంటూ బల్క్‌ డీజిల్‌ కొంటే రేటెక్కువ అని చెప్పి కాంట్రాక్టర్లకు రీటెయిల్‌ బంకుల్లో డీజిల్‌ పోయమని చెప్పి నువ్వు బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబూ అడుగుతున్నావు అని కేంద్రం చంద్రబాబుకు రాసిన లేఖ. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా?

ప్రజల గురించి ఆలోచన చేయకుండా అమరావతిలో కాంట్రాక్టర్ల గురించి, ఆ కాంట్రాక్టు పనుల్లో ఈయనకొచ్చే డబ్బుల గురించి, ఈయన స్కాముల గురించి మాత్రమే ఆలోచన చేసేటోడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉంటాడా? ఈ ముఖ్యమంత్రి తప్ప. ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ వాళ్లు కేంద్ర మంత్రికి చెప్పారు.

చంద్రబాబునాయుడు మీ కూటమిలో సభ్యుడు ఇలా అడుగుతున్నాడు మేం ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు అని చెప్పి. అక్కడి నుంచి మోడీ షంటుకున్నాడు. బుద్ధీ జ్ఞానం ఉందా అని ఏం మాట్లాడుతున్నావు, ఏం అడుగుతున్నావు అని వాళ్లు వెంటనే లెటర్లు రాశారు. అంటే ఏం ఆలోచన చేస్తున్నారు.

ఒక పక్క  ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తోడుగా ఉండాల్సింది పోయి నువ్వు నీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచన చేసి, బల్క్‌ లో వాళ్లు డీజిల్‌ కొంటే రూ.155 అవుతుందని, రీటెయిల్‌ పెట్రోలు బంకుల్లో కొంటే రూ.101కే డీజిల్‌ లీటర్‌ దొరుకుతుందని, వాళ్లకు రూ.101కే రీటెయిల్‌ బంకుల్లో పోయమని నువ్వు లేఖ రాస్తావు. పెట్రోలు, డీజిల్‌ రేట్లు తగ్గిస్తామన్న హామీనే కాదు.. సూపర్‌ సిక్స్‌ అయినా అంతే, సూపర్‌ సెవెన్‌ అయినా అంతే. ఇదే పరిస్థితే.
(అంటూ పీపీటీలో సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలు చూపించారు.)

పథకాలు. ప్రభుత్వం బాకీ:
ఆడబిడ్డ నిధి కింద ఇస్తానన్న నెలకు రూ.1500 రెండేళ్లు అవుతోంది ఇంత వరకు రూపాయి ఇవ్వలేదు. సంవత్సరానికి రూ.18 వేలు. రెండేళ్లకు రూ.36 వేలు ప్రతి మహిళకూ బాకీ. ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. రెండేళ్లయి పోయింది ఏటా రూ.36 వేలు చొప్పున రూ.72 వేలు బాకీ. అప్పుడు ఇంటింటికీ పోయి బాండ్లు ఇచ్చారు.
(అంటూ పీపీటీలో వాటిని చూపి, చదివి వినిపించారు)

పెన్షన్‌ లేదు:
50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్‌. రూ.4 వేలు నెలనెలా పింఛన్‌. అదీ సినిమా ప్రారంభం జూన్‌ 2024 నుంచి. ప్రతి వ్యక్తికీ ఇది. నెలకు రూ.4 వేలు అంటే సంవత్సరానికి రూ.48 వేలు. రెండేళ్లకు రూ.96 వేలు బాకీ. ఇంత వరకు రూపాయి ఇచ్చింది లేదు. గ్రామాల్లో ప్రతి ఇంట్లో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు చంద్రబాబును.

రైతుల నడ్డి విరిచారు:
రైతుల పరిస్థితి చూస్తే మరీ అన్యాయం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక.. ఎన్నోసార్లు చూపించా ఆయన అన్న మాటలు. కేంద్రం ఇచ్చేది కాక.. ఏడాదికి రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ ఇస్తామన్నారు. రెండేళ్లయి పోయింది. మొదటి ఏడాది ఎగ్గొట్టాడు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాలి. ఇచ్చింది కేవలం రూ.14 వేలు. రూ.26 వేలు ఎగ్గొట్టాడు. అంతే కాకుండా 50 లక్షల మంది రైతులు మా హయాంలో ఇస్తుంటే రైతు భరోసా ఇస్తే అందులో 7 లక్షల మందికి కోత కోశాడు. కేంద్ర ప్రభుత్వానికి రైతు భరోసా గురించి చెప్పింది మేము. నేను రైతు భరోసా చెప్పిన తర్వాత, నా పాదయాత్ర జరిగి క్లైమాక్స్‌ కు వచ్చిన తర్వాత చివర్లో మోడీ వాళ్లు ఈ స్కాము తీసుకొచ్చారు.

ఇంకా ఉచిత పంటల బీమా లేదు. ఇన్‌ పుట్‌ సబ్సిడీ లేదు. సున్నా వడ్డీ లేదు. ఈ క్రాప్, ఆర్బీకేలు నిర్వీర్యం. ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ధర్నా చేస్తున్నా పట్టించుకునే నాధుడు లేడు.

ఉచిత బస్సు. తుస్సు:
చివరకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఫ్రీ బస్సు అన్నాడు. 16 కేటగిరీల బస్సులు ఉంటే కేవలం 5 కేటగిరీల బస్సులకే పరిమితం చేస్తున్నాడు. ఆ 5 కేటగిరీలు పర్మిట్‌ చేసే దానికి కూడా ఇప్పుడు మళ్లీ క్వశ్చన్‌ మార్క్‌ లోకి వచ్చింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులన్నీ తీసేసి ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకొస్తారట. ఇందులో ఉచితం లేదంటూ మహిళలకు ద్రోహం చేయడానికి మళ్లీ పూనుకున్నారు.

పైగా ఇప్పుడు ఏమంటున్నాడు. ఆర్టీసీ బస్సులన్నీ తీసేసీ ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకువచ్చి మహిళలకు ద్రోహం చేయడానికి మళ్లా  పూనుకున్నాడు. ఇది ఒక ఎఫెక్ట్‌ అయితే. రెండోది 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగస్తులు. మేము ఎవరినైతే గవర్నమెంట్‌లో విలీనం చేశామో. వారి బతుకులు ప్రశ్నార్థకం చేశారు. ఏకంగా 12 డిపోలను ప్రైవేటుపరం చేశాడు. భూములతో సహా. ఇక భవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు. ఆర్టీసీ బస్సు ఉండదు. ఆర్టీసీ ఉండదు.

గ్యాస్‌ కూడా లేదు:
ఇక గ్యాస్‌ సిలెండర్ల పరిస్థితి అంతే. ఇప్పటికీ 9 సిలెండర్లు ఇవ్వాలి మూడో సంవత్సరం కలుపుకుంటే. ఇంతవరకు ఇచ్చింది ఒకటి రెండు. అది కూడా అందరికీ ఇవ్వలేదు. నంబర్‌ డ్రాస్టిక్‌ గా తగ్గించారు. కోటీ 50 లక్షల నుంచి 90 లక్షలకు తగ్గించారు. ఇచ్చే అర కొర కూడా.

అమ్మ ఒడి మరో మోసం:
అమ్మ ఒడి అంతే.. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అన్నారు. చివరికి చూస్తే 20 లక్షల మంది పిల్లల్ని తగ్గించేశారు. రూ.15 వేల కథ దేవుడెరుగు. కొందరికి రూ.9 వేలు. కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.10 వేలు. కొందరికి మాత్రమే రూ.13 వేలు. ఇది అమ్మ ఒడి పరిస్థితి.

కొత్త పెన్షన్లు లేవు. ప్రతి నెలా 25 వేలు కట్‌:
నోరు తెరిస్తే అబద్ధాలు.. నోరు తెరిస్తే మోసం. పెన్షన్లు మా హయాంలో.. ఎన్నికల షెడ్యూలు వచ్చే నాటికి మేము 66,34,372 పెన్షన్లు మేము పంపిణీ చేస్తూ ఉంటే.. ఇంటి వద్దకే పంపించి.. చంద్రబాబు హయాంలో పెన్షన్‌ రూ.1000, మా హయాంలో రూ.3 వేలకు పెంచుకుంటూ పోయాం. ఇంటి వద్దకే పెన్షన్‌ పంపించే ప్రయత్నం చేశాం. ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ మేము 66,34,372 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తే వాటిని చంద్రబాబుగారు తగ్గించి ఈ మే నెలలో 60,11,293 పెన్షన్లు పంపిణీ చేయించారు. అంటే ఏకంగా 6,23,079 మంది పెన్షన్లు తగ్గించేశారు. ప్రతి నెలా 25 వేల పెన్షన్లు కట్‌ చేస్తున్నారు. కొత్త పెన్షన్‌ ఒక్కటి కూడా ఇవ్వకపోగా 6,23,079 మంది పెన్షన్లు కట్‌ చేశారు.

విద్యాదీవెన. వసతిదీవెన:
ఫీజు రీయింబర్స్‌ మెంట్, వసతి దీవెన కింద ఈ రెండేళ్లలో ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు ఇవ్వాలి. 2024 జనవరి–ఏప్రిల్‌ త్రైమాసికంకు సంబంధించి వెరిఫికేషన్‌ పూర్తయింది. ఎన్నికల కోడ్‌ కారణంగా అప్పటి సొమ్ము పంపిణీ నిలిచిపోయింది. నాటి నుంచి నేటి వరకు 9 త్రైమాసికాలు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవ్వాల్సింది. ఇప్పటికి 9 త్రైమాజికాలు అయిపోయాయి. ఈ మార్చి నాటికే బకాయిలు రూ.5820 కోట్లు.

విద్యాదీవెన కింద 9 త్రైమాజికాలకు క్వార్టర్‌కు రూ.700 కోట్లు చొప్పున రూ.6,300 కోట్లు. ఇప్పటికి ఇచ్చింది ఎంత అంటే, ఒకసారి రూ.1770 కోట్లు, ఇప్పుడు రూ.900 కోట్లు ఇచ్చాడు. అంటే రూ.2,670 కోట్లు. అంటే రూ.3,628 కోట్లు ఇప్పటికే విద్యాదీవెన కింద బకాయిలు. దీనికి వసతి దీవెన ప్రతి జనవరిలో రూ.1100 కోట్లు క్రమం తప్పకుండా మా హయాంలో ఇచ్చే వాళ్లం. వసతి దీవెన కింద జనవరి 2025 రూ.1100 కోట్లు, జనవరి 2026 మరో రూ.1100 కోట్లు ఇప్పటికే రూ.2200 కోట్లు బాకీ. విద్యాదీవెన రూ.3,628 కోట్లు, వసతి దీవెన రూ.2200 కోట్లు కలిపితే రూ.5,828 కోట్లు బాకీ.

మళ్లీ ఈ సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలు విద్యా దివెన సొమ్ము రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన మరో రూ.1100 కోట్లు కలిపి రూ.3900 కోట్లు. పాత బకాయిలు కలిపితే రూ.9,728 కోట్లు ఇవ్వాలి. ఈ రోజు పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితి. పట్టించుకునే నాథుడే లేడు.

ఆరోగ్యశ్రీ నిర్వీర్యం:
ఆరోగ్య శ్రీ కింద నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.3,746 కోట్లు బకాయిలు పెట్టింది. సంవత్సరానికి రూ.4 వేల కోట్లు కావాలి. అలాంటిది రెండేళ్లలోనే రూ.3,746 బకాయి. మళ్లీ ఈ సంవత్సరం మరో రూ.4 వేల కోట్లు కావాలి. దీంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు పూర్తిగా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి. వారికి ఇవ్వాల్సింది డబ్బులు వారికి ఇవ్వకపోగా.. ఈ చంద్రబాబుగారు చేస్తున్న ఘనకార్యం ఏమిటంటే.. వారికి వాళ్ల పేరుతో లోన్‌ ఇప్పిస్తున్నాడట. లోన్‌ కోసం 8 శాతం వడ్డీ కూడా కట్‌ చేస్తా అంటున్నాడు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వకపోగా..మాకు లోన్‌ ఇప్పించడమేంటి స్వామి..పైగా దానికి 8 శాతం వడ్డీ కడ్టడమేంటి అని లబోదిబోమని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు బోర్డు తిప్పేస్తున్నారు.

ఉద్యోగుల బకాయిలు రూ.35 వేల కోట్లు:
ఈ పెద్ద మనిషి ఇవన్నీ ఏమీ చేయకపోగా.. ఉద్యోగులను మరీ దారుణంగా మోసం చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్‌.. ప్రతి ఆరు నెలలకు డీఏ ఇవ్వాలి. మా హయాంలో ఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. 11 డీఏలు ఇచ్చాం. ఒకటి ఎక్కువ ఇచ్చాం. అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్‌ ఇచ్చాం. కాలయాపన లేకుండా పీఆర్సీ వేశాం. ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ప్రతి అడుగులో చేయి పట్టుకుని నడపిస్తూ.. వీళ్ల గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో.. వీళ్లు సీపీఎస్‌ తో ఇబ్బంది పడుతుంటే.. జీపీఎస్‌ అనే విధానం కూడా తీసుకువచ్చాం.ఈ రోజు మేము తీసుకువచ్చిన జీపీఎస్‌ ను దేశం అంతా కాపీ కొడుతోంది.

ఈ రోజు ఉద్యోగుల పరిస్థితి చూస్తే.. ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌. ఈ జూన్‌ వస్తే 5వ డీఏ కూడా పెండింగ్‌. అధికారంలోకి వస్తానే ఐఆర్‌ అన్నారు.ఇంతవరకు రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. మెరుగైన పీఆర్సీ అన్నాడు. మా హయాంలో వేసిన పీఆర్సీ చైర్మన్‌ కూడా తీసేశారు. కొత్త వారిని కావాలని వేయడం లేదు. ఎందుకంటే కొత్త వారిని వేస్తే  రికమండేషన్స్‌ వస్తే వెంటనే జీతాలు పెంచాలి కాబట్టి అసలు పీఆర్సీ వేయడం లేదు.

పోలీసు సోదరులకు సరెండర్‌ లీవ్స్‌ 5 పెండింగ్‌. పోలీసులకు ఒకేసారి సరెండర్‌ ఇస్తారు. ఒక సరెండర్‌ లీవ్‌ వస్తే రూ.60 వేలు వస్తాయి. వాటితో వారు ఏదో ఒకటి చేసుకుంటారు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు సరెండర్‌ లీవ్‌ ను స్ప్లిట్‌ చేస్తున్నాడు. వాయిదా పద్ధతి పెడుతున్నాడు. మరోవైపు ఐదు సరెండర్‌ లీవ్స్‌ పెండింగ్‌. 15 నెలలు టీఏలు పెండింగ్‌ పోలీసులకు. మేము తెచ్చిన జీపీఎస్‌ లేదు. ఓపీఎస్‌ లేదు.

ప్రతి నెలా ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలన్నాడు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే అసలు జీతాలు నెలలో ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలీదు. జీపీఎఫ్, ఏపీ జీఎల్‌ఐ,  మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్, సరెండర్‌ లీవ్ప్‌.. వీటన్నింటి కిందా రూ.35 వేల కోట్లు చంద్రబాబు బాకీ. అయినా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు.

ఎవరైనా అడిగితే.. ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామిరెడ్డి నోరు తెరిచి అడిగితే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేశాడని ఆరోపించి, దొంగ కేసులు పెట్టి ఉద్యోగంలోంచి డిస్మిస్‌ చేశారు.

సంపద సృష్టి అంటే సంతానం కనడమా?:
సంపద సృష్టిస్తానన్న పెద్ద మనిషి చంద్రబాబు.. ఇప్పుడు సంతానమే సంపద అంటున్నాడు. ముగ్గుర్ని కనండి. నలుగురిని కనండి అంటున్నాడు. ఇంకా మోటివేట్‌ చేస్తూ.. ముగ్గురిని కంటే రూ.30 వేలు ఇస్తానంటున్నాడు. నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తా అంటున్నాడు.

ప్రజలంతా మొత్తకుంటున్నారు.
రూ.30 వేలు, రూ.40 వేలు కథ దేవుడెరుగు. మూడో సంతానం, నాలుగో సంతానం కథ దేవుడెరుగు.. నువ్వు సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌ లో ఇచ్చిన హామీలు ఏమైనాయి స్వామి? వాటి పరిస్థితే దిక్కు తెలియడం లేదు. వీటి గురించి ఆలోచన చేయి నువ్వు. ఆ తర్వాత నువ్వు మూడో సంతానం.. నాలుగో సంతానం గురించి చెబితే.. అంతో ఇంతో వినడానికి అవకాశం ఉంటుంది.. అని ప్రజలు ఈ రోజు మొత్తుకుంటున్నారు.

నిజంగా నేను మొట్టమొదటి సారిగా చూస్తున్నా. ఈ పెద్దమనిషి చంద్రబాబుగారు ఏదైతే చెబుతాడో.. కనీసం ఆయనన్నా పాటించాలి కదా. కనీసం ఆయన కొడుకైనా పాటించాలా. ఆయన కొడుక్కి ఒకడే. ఆయనకొకడే. కానీ బీదోళ్లకు మాత్రం నలుగురు సంతానం కావాలా!. వారు చదువుకోకూడదు. వాళ్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ఇవ్వకూడదు. వాళ్లకి ఇంగ్లిష్‌ మీడియం చదవకూడదు. వాళ్ల బతుకులు ఎప్పుడూ చితికిపోయి ఉండాలి అనే దిక్కుమాలిన ఆలోచనలు చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో చంద్రబాబు తప్ప మరెవరూ ఉండరు.

విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల దైన్యం:
అసలు పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ఇవ్వాలి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి. విద్య, వైద్యం, వ్యవసాయం అన్నీ పూర్తిగా మూలన పడిన పరిస్థితులు. ఈరోజు స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియం చదువులు ఆగిపోయిన పరిస్థితి. మా హయాంలో మూడో తరగతి నుంచి టోఫెల్‌ ఒక పిరియడ్‌ గా పెడితే, టోఫెల్‌ అనేది తీసేసిన పరిస్థితి. మా హయాంలో ఇంగ్లిష్‌ మీడియా, సీబీఎస్‌ఈ, ఐబీ దాకా ప్రయాణం అని చెప్పి మేము తీసుకువస్తే.. అసలు ఇంగ్లిష్‌ మీడియమే లేకుండా చేసిన పరిస్థితి. మూడో తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ మేము తీసుకువస్తే.. అది గాలికొదిలేసిన పరిస్థితి. నాడు–నేడుతో మేము బడులను బాగు పరిస్తే… ఇప్పుడు పూర్తిగా గాలికొదిలేసిన పరిస్థితి.

ఆరో తరగతి నుంచి ప్రభుత్వ స్కూళ్లను డిజిటైట్‌ చేసి ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడేలా మేము చేస్తే.. ఈ రోజు ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు సంకోచించే పరిస్థితి. ప్రభుత్వ బడుల్లో 8వ తరగతికొచ్చే సరికి పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ఒక మేనమామలా మేము చదివిస్తే.. ఈ రోజు పిల్లలను ట్యాబుల కథ దేవుడెరుగు, కనీసం గోరుముద్దలో కూడా క్వాలిటీ లేని పరిస్థితి ఈరోజు బడుల్లో నడుస్తా ఉంది.

ఈరోజు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు. విద్యా దీవెన లేదు. వసతి దీవెన లేదు. చదువులు ఆపేస్తున్న పరిస్థితి. స్కూళ్లు, అంగన్‌ వాడీలు, హాస్టళ్లలో పిల్లలకు సరైన పౌష్టిక ఆహారం అందక ఈ రోజు పిల్లలు ఆస్పత్రుల పాలవుతున్న పరిస్థితి.

ఆస్పత్రులు నాశనం చేశారు. విలేజ్‌ క్లీనిక్‌ల దగ్గర నుంచి.. పీహెచ్‌ సీల దగ్గర నుంచి.. నాడు– నేడులు తెచ్చి అన్ని హాస్పిటల్స్‌ ను రిఫార్మ్‌ చేస్తే.. జీరో వేకెన్సీ  పాలసీ తీసుకువచ్చి, సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొరతలేని పరిస్థితి మా హయాంలో తీసుకువచ్చాం. ఈ రోజు పూర్తిగా అన్నీ నాశనమైన పరిస్థితి.

17 కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు కట్టడానికి మేము శ్రీకారం చుట్టి, వాటిలో ఐదు పూర్తి చేశాం. మిగిలినవి వివిధ రకాల స్టేజ్‌ లో ఉన్నాయి. కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే.. అది కూడా ఐదేళ్లలో ఖర్చు చేస్తే అవి కూడా పూర్తయవుతాయి. పిల్లలందరికీ క్వాలిటీ మెడికల్‌ ఎడ్యేకేషన్‌ అందుబాటులోకి వస్తుంది. దానిని పక్కన పెట్టి అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. అమరావతిలో బిల్డింగ్‌ లకు గ్లాసుల కోసం.. కేవలం భవనం అద్దాలకు రూ.2500 కోట్లు ఖర్చు చేయడానికి ముందుకు వస్తాడు. కానీ, మెడికల్‌ కాలేజీలకు డబ్బులివ్వడానికి మనసు రాదు. నాడు–నేడు కింద స్కూళ్లను బాగు చేయడానికి మనసు రాదు.

పూర్తిగా సున్నా వడ్డీ అనే పథకం తీసేసి, ఆసరా, చేయూత అనే పథకాలన్నీ పూర్తిగా రద్దుయి పోయి.. ఈరోజు పొదుపు సంఘాల మహిళలందరూ కూడా.. గ్రామీణ ఎకానమీ చిన్నాభిన్నమయ్యే పరిస్థితిలో ఉంటే.. యువత, మహిళలకు ఉద్యోగాలు దొరక్క సతమతమవుతుంటే.. అన్నీ తిరోగమనంలో ఉంటే..ఈ పెద్ద మనిషి ఏమంటాడు.. సంతానమే సంపద. ముగ్గుర్ని కనండి..నలుగురిని కనండి.

ఒక పక్క  ప్రభుత్వ వ్యవస్థలన్నీ అధ్వాన్న పరిస్థితుల్లో ఉంటే.. క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ అనేది చంద్రబాబు హయాంలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో కనిపిస్తుంటే, దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గుర్ని కనండి.. నలుగురిని కనండి అని ఈరోజు చెబుతున్నాడు.

చంద్రబాబు దృష్టిలో మహిళలంటే..:
అన్నింటి కంటే బాధాకరమైన విషయం ఏంటంటే.. మహిళలను పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా భావించడమే చంద్రబాబు చేస్తున్న అతి దిగజారుడు రాజకీయం. పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా మహిళలను ఈయన పరిగణనలోకి తీసుకుంటున్నాడు.

నిజానికి మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. వారు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. వారు చిరునవ్వుతో ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి. చంద్రబాబు మహిళలను పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా చూడటం అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఎన్నడూ లేదు.

‘ఎస్‌. బోత్‌ కెన్‌ నెవర్‌ బి సేమ్‌’:
ఒకవైపు ఇంత దారుణమైన పాలన చేస్తున్న చంద్రబాబు, మరోవైపు తన కొడుకు చేత ఏమనిపిస్తున్నాడు. ‘బోత్‌ ఆర్‌ నాట్‌ ది సేమ్‌’ అని బాలకృష్ణ డైలాగ్‌లు ఆయన అల్లుడు కొడుతున్నాడు. ఈ లోకేష్‌ అనే చంద్రబాబుగారి కొడుకు.. అవునయ్యా.. ‘బోత్‌ కెన్‌ నెవర్‌ బీ సేమ్‌’.. చంద్రబాబు కొడుక్కు చెబుతున్నా. చంద్రబాబుగారికి కూడా చెబుతున్నా.. బోత్‌ కెన్‌ నెవర్‌ బీ సేమ్‌.

వెన్నుపోటుతో పార్టీని పెట్టి.. పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఎదురొడ్డి నిలబడి ప్రజా మద్దతుతో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మా హిస్టరీ. బోత్‌ కెన్‌ నెవర్‌ బీ సేమ్‌. ప్రజలకు ద్రోహం చేయడం, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం, ప్రజలను వాడుకోవడం తర్వాత వదిలేయడం మీ క్యారెక్టర్‌. కానీ మేము ఆరునూరైనా కూడా ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్‌.. బోత్‌ కెన్‌ నెవర్‌ బీ సేమ్‌. పనులు చేసి చూపించడం మా స్టైల్‌.. పబ్లిసిటీ క్రెడిట్‌ చోరీ చేయడం మీ స్టైలు. బోత్‌ కెన్‌ నెవర్‌ బీ సేమ్‌. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకే పాలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, మహిళా రక్షణ, దిశ లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు మా చరిత్ర.. వాటన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర.. బోత్‌ కెన్‌ నెవర్‌ బీ సేమ్‌.

ఐదేళ్లలో పారదర్శకంగా బటన్‌ నొక్కడం.. నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా రూ.2.73 లక్షల కోట్లు పంపించడం మా చరిత్ర. మీరు రెండేళ్లు కాక ముందే మేము చేసిన అప్పు కంటే ఎక్కువ రూ.3.40 లక్షల కోట్ల అప్పు చేసి.. మా ప్రభుత్వ హయాంలో ఉన్న అన్ని పథకాలనూ రద్దు చేసి.. మీరు చెప్పిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌  మోసాలుగా పెట్టడం మీ చరిత్ర.. బోత్‌ కెన్‌ నెవర్‌ మీ సేమ్‌ అయ్యా తెలుసుకో.. అంటూ, తండ్రీ కొడుకులిద్దరికీ శ్రీ వైయస్‌ జగన్‌ చురకలంటించారు.

అనంతరం మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..
ప్రభుత్వ పొదుపు చర్యల గురించి వారు చెబుతున్నారు. మన చెవిలో పూలు పెడుతున్నారు. నిజానికి ఏ పొదుపు చర్యలు లేవు. ముగ్గురూ ఛార్టర్‌ ఫ్లైట్‌లలో తిరుగుతున్నారు. ఇక్కడ గన్నవరం, అక్కడ హైదరాబాద్‌లో చూస్తే ఆ విమానాలు కనిపిస్తాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా వ్యవహారాలు) పూడి శ్రీహరి అరెస్టుపై ప్రశ్నకు బదులిస్తూ.. మనం ఏ విత్తనం నాటితే, రేపు వృక్షం అవుతుంది. అదే పండుతుంది. అందుకే పోలీసులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబు ఆదేశాలు పాటించి, చట్టవిరుద్దంగా వ్యవహరించకండి. రేపు మేము రాగానే విచారణ చేయిస్తాం. తప్పు చేసిన ఎవ్వరినీ వదలం. రిటైర్‌ అయినా వదిలిపెట్టం. కోర్టు, చట్టం ముందు నిలబెడతాం. గవర్నెన్స్‌లో ఉన్న వారు, వేసే ప్రతి అడుగుకు ఆలోచించాలి. రేపు ఇదే తమకు చుట్టుకుంటే ఎలా అని ఆలోచించాలి. ప్రజలు పదవి ఇచ్చింది. వారికి సేవ చేయడం కోసం కానీ, కక్ష సాధింపుల కోసం కాదు.
చంద్రబాబు ప్రలోభాలకు లొంగొద్దు. పోలీసులకు ఇదే నా మాట అని శ్రీ వైయస్‌ జగన్‌ తేల్చి చెప్పారు.

జనసేన అధినేత హోం మంత్రి అమిత్‌షా వద్దకు వెళ్లారని, జగన్‌ గారిని ఇబ్బంది పెట్టాలని చూశారనే సందర్భాన్ని ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ చెప్పిన విషయాన్ని ప్రస్తావించగా.. అది ఆయన చూసిన, తెలిసిన అనుభవంతో చెబుతున్నారు. ఆయన చంద్రబాబును చూశాడు. జగన్‌ను చూశాడు. ఇప్పుడు చంద్రబాబు పాలనను చూస్తున్నాడు. జగన్‌ చేసిన పాలన చూశాడు. ఆయనే కాదు ప్రజలంతా చూశారు. అందుకే ఎవరి నోటి నుంచి అయినా ఇవే మాటలు వస్తాయని వైయస్‌ జగన్‌ స్పందించారు.

వైయస్ జగన్ ప్రెస్ మీట్లో చూపించిన డాక్యుమెంట్లు.. JAGAN SIR PC_21-05-2026 FINAL

ఇవీ చ‌ద‌వండి: Puri Jagannadh: “పూరి జగన్నాథ్ నా గాడ్‌ఫాదర్”.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన రఘు కుంచె
YS Jagan: హలో ఇండియా.. ఏపీలో పోలీస్ వ్య‌వ‌స్థ పూర్తిగా గాడి త‌ప్పింది: జ‌గ‌న్ ట్వీట్
YS Jagan on YSR Padayatra: నాన్న పాద‌యాత్ర‌ను గుర్తు చేసుకుంటూ నా ప్ర‌యాణం.. వైఎస్ జ‌గ‌న్ ఎమోష‌న‌ల్ ట్వీట్
YS Jagan Warning to ABN: ఏబీఎన్ రాధాకృష్ణ‌కు జ‌గ‌న్ సీరియ‌స్ వార్నింగ్.. బీఆర్ నాయుడు, అర‌వ శ్రీధర్ పైనా..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు