Nara Lokesh : మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో మార్పులు తప్పనిసరి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య–ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కార్యకర్తలే పార్టీకి బలం, బలగమని పేర్కొన్న ఆయన… పార్టీ అంటే కమిట్‌మెంట్ ఉన్నవారికే బాధ్యతలు ఇచ్చామని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఇటీవల నియమితులైన 25 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు.
కార్యకర్తలే టీడీపీ అసలైన బలం
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీకి ఉన్న స్థాయి కార్యకర్తల బలం ఏ పార్టీకి లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదురైన కష్టాలే కార్యకర్తల త్యాగాన్ని మరింత గొప్పగా చూపించాయని చెప్పారు. పుంగనూరు నుంచి మాచర్ల, విజయవాడ వరకు అనేక సందర్భాల్లో పార్టీ కోసం ప్రాణాలను లెక్కచేయని కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని భావోద్వేగంగా తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
దేశంలో అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబునాయుడేనని మంత్రి లోకేష్ అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ట్రెండ్ సెట్టర్‌గా కొనసాగుతున్న ఆయన… 75 ఏళ్ల వయసులోనూ యువకుడిలా పనిచేస్తున్నారని కొనియాడారు. ఎన్నో విమర్శల మధ్య 1995లో ఐటీ రంగానికి బాటలు వేసిన చంద్రబాబు విజన్ వల్లే నేడు లక్షలాది కుటుంబాలకు ఉపాధి లభించిందన్నారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఏపీకి రావడానికి ఆయన ముందుచూపే కారణమని స్పష్టం చేశారు.
అదే సమయంలో ప్రత్యర్థులను ఉద్దేశించి…
కల్తీ నెయ్యి, కోడికత్తి, కల్తీ మద్యం వ్యవహారాలకు “టీం–11 బ్రాండ్ అంబాసిడర్లు” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా ఏపీ
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు.
వృద్ధులకు రూ.4,000 పెన్షన్
వికలాంగులకు రూ.6,000
మంచానికే పరిమితమైన వారికి రూ.15,000
ఈ పెన్షన్లకే ఏడాదికి సుమారు రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.
స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవతో రైతులకు భరోసా కల్పించామని చెప్పారు.
150 రోజుల్లోనే డీఎస్సీ పూర్తిచేసి 16 వేల మంది ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇచ్చామని, 6 వేల మంది పోలీస్ కానిస్టేబుల్స్ నియామకం జరిగిందని గుర్తు చేశారు. చేసిన పనులు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో… చేసిన పనులను ప్రజలకు వివరించడం కూడా అంతే అవసరమని మంత్రి స్పష్టం చేశారు.
ఎన్నో దశల్లో పెన్షన్ పెంపు ఎలా జరిగిందో కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించాల్సిన బాధ్యత ప్రతి పార్టీ నాయకుడిపై ఉందన్నారు.
గ్రామ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో వరకు ఎదగాలి
పార్టీలో సంస్కరణల దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు.
ప్రతి పదవికి టర్మ్ లిమిట్
ఒకే పదవిలో రెండుసార్లకు మించి కొనసాగకూడదు
ప్రమోషన్ విధానం ఉండాలి అని ప్రతిపాదించినట్టు చెప్పారు.
సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు కూడా పొలిట్ బ్యూరో స్థాయికి ఎదగాలని తన ఆశయమన్నారు.
యువత, మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యం
టీడీపీ మహానాడులో తీసుకున్న ఆరు శాసనాలను గుర్తుచేసిన మంత్రి లోకేష్…
కార్యకర్తలే అధినేతలు
యువత రాజకీయాల్లోకి రావాలి
సామాజిక న్యాయం తప్పనిసరి
మహిళలకు సముచిత గౌరవం
అన్నదాతకు ఎల్లప్పుడూ అండ
తెలుగుజాతి విశ్వఖ్యాతి
ఈ ఆరు సూత్రాలను పార్టీ నిర్ణయాల్లో తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
పార్టీ సొంతిల్లు – ప్రభుత్వం కిరాయి ఇల్లు
పార్టీ శాశ్వతమని, ప్రభుత్వం తాత్కాలికమని పేర్కొన్న మంత్రి… పార్టీ కార్యాలయానికి నాయకులు సమయం కేటాయించాలని కోరారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. విశాఖ ఉక్కు కాపాడుకోవడం, అమరావతి అభివృద్ధి, పోలవరం వేగం, పెట్టుబడుల రాక ఇవన్నీ కూటమి ప్రభుత్వ ఫలితాలేనన్నారు.
ఐక్యతే బలం
అలకలు, విభేదాలు పార్టీకి నష్టం చేస్తాయని హెచ్చరించిన మంత్రి… ఏ సమస్య ఉన్నా పార్టీలోనే చర్చించుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్లు కొనసాగాలన్నదే లక్ష్యమని తెలిపారు.
ఇవీ చదవండి: Lokesh with Revanth : దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి లోకేష్.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై కీలక చర్చ
Nara Lokesh : ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: మంత్రి నారా లోకేష్
