RTGS : రాష్ట్ర పాలనలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమర్థత లోపిస్తే శిక్షణ ఇచ్చి, నిరంతర పర్యవేక్షణ ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆయన స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ (RTGS) వ్యవస్థపై వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గవర్నెన్స్‌లో ఉన్న అనేక సమస్యలకు సాంకేతికతే పరిష్కారమని అన్నారు. ఉద్యోగులు, అధికారులు టెక్నాలజీని విస్తృతంగా వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు.
2026 — టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్
2026 సంవత్సరాన్ని టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాత్రను మరింత పెంచాలని సూచించారు. ముఖ్యంగా ప్రజా ఫిర్యాదులు, గ్రీవెన్సులను ఏఐ ఆధారంగా వేగంగా పరిష్కరించే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. డేటా ఆధారిత పాలనపై ప్రభుత్వం మరింత దృష్టి సారించబోతున్నట్లు తెలిపారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా నిర్ణయాల్లో పారదర్శకతతో పాటు వేగం కూడా పెరుగుతుందని అన్నారు.
మన మిత్ర – వాట్సప్ గవర్నెన్స్‌కు విశేష స్పందన
ఈ సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి కీలక వివరాలు అందించారు. ప్రస్తుతం ‘మన మిత్ర – వాట్సప్ గవర్నెన్స్’ ద్వారా 878 ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 1.43 కోట్ల మంది ప్రజలు ఈ సేవలను వినియోగించుకున్నట్లు అధికారులు వివరించారు. ఇది టెక్నాలజీ ఆధారిత పాలనపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమని సీఎం వ్యాఖ్యానించారు.
కీలక శాఖల పనితీరుపై సమీక్ష
ఆర్టీజీఎస్ సమావేశం అనంతరం వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖ పనితీరు ఫలితాల ఆధారంగా ఉండాలని, ప్రజలకు వేగంగా సేవలు అందేలా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తే ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని, అదే నిజమైన మంచి పాలనకు మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: Andhra Pradesh : రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల పాత్ర కీలకం: టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Chandrababu Naidu : నగరిలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: ఆ పాలన మళ్లీ వస్తే రాష్ట్రం నాశనమే
