HomeAndhra PradeshPawan Kalyan : ఉగాది నుంచి 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు.. అన్ని...

Pawan Kalyan : ఉగాది నుంచి 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు.. అన్ని శాఖలు భాగస్వాములవ్వాలి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Pawan Kalyan : రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టును ఉగాది నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మహత్తర కార్యక్రమంలో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు.

ఉగాదిలోపు ప్రతి శాఖ తమకు కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. గ్రీన్ కవర్ పెంపు అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ముందుకు తీసుకువెళ్తోందని తెలిపారు.

రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష

మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీశాఖతో పాటు వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టు ప్రణాళికలు, నిధుల కేటాయింపు, శాఖల వారీ భాగస్వామ్యం వంటి అంశాలపై కూలంకషంగా చర్చించారు.

2047 నాటికి 50 శాతం పచ్చదనం లక్ష్యం

ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ—
“గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని 2047 నాటికి 50 శాతం పచ్చదనంతో నింపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొత్తం 32.60 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉంటుంది. 2030 నాటికి 37 శాతం గ్రీనరీ సాధించాలన్నదే మధ్యంతర లక్ష్యం” అని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 30 శాతం గ్రీన్ కవర్ మాత్రమే ఉందని, వచ్చే నాలుగేళ్లలో అదనంగా 7 శాతం పెంచాల్సి ఉందని చెప్పారు. ఇందుకోసం సుమారు 9 లక్షల హెక్టార్లలో చెట్లు నాటాల్సి ఉంటుందని వివరించారు.

అన్ని శాఖల సమిష్టి బాధ్యత

ఈ పచ్చదనం యజ్ఞంలో అటవీ, పర్యావరణ శాఖలతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, విద్యాశాఖ, రోడ్లు–భవనాలు, పరిశ్రమలు, వ్యవసాయం, ఉద్యానవన శాఖలు కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. ఉద్యానవన శాఖకు 12 శాతం మొక్కలు నాటే బాధ్యతను అప్పగించాలని సూచించారు.

జాతీయ రహదారుల తరహాలోనే రాష్ట్ర పరిధిలో నిర్మించే రహదారుల ఇరువైపులా కూడా మొక్కలు నాటే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు.

స్వజాతి మొక్కలకు ప్రాధాన్యం

గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులలో స్వజాతి వృక్ష జాతులకే ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తీర ప్రాంతాల్లో పెనుగాలులు, ఉప్పు నీటిని తట్టుకునే మొక్కలను పెంచాలని, పారిశ్రామిక కారిడార్లలో కాలుష్య నియంత్రణకు ఉపయోగపడే మొక్కలు నాటాలని పరిశ్రమల శాఖకు సూచించారు.

రైతుల భూముల్లో వారికి దీర్ఘకాలిక ఆదాయం అందించే పండ్ల తోటల పెంపకంపై దృష్టి పెట్టాలని, కాలువ గట్లు, చెరువుల గట్ల వెంబడి కూడా పండ్ల మొక్కలు నాటాలని ఆదేశించారు.

ప్రతి మొక్క పర్యావరణానికి ఉపయోగపడాలి

“మనము నాటే ప్రతి మొక్క ప్రజలకు, పర్యావరణానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. కేవలం సంఖ్య పెంచడమే కాకుండా నాణ్యతకూ ప్రాధాన్యం ఇవ్వాలి” అని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

శాఖల వారీగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని, నిర్దేశిత కాలపరిమితిలో లక్ష్యాలను సాధించేలా పని చేయాలని సూచించారు. బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి అవసరమైన నిధులు సమకూర్చుతామని తెలిపారు.

ఫిబ్రవరి 5న తదుపరి సమీక్ష
ఫిబ్రవరి 5వ తేదీన జరిగే తదుపరి సమావేశానికి అన్ని శాఖల ఉన్నతాధికారులు పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్‌తో హాజరుకావాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

ఇవీ చదవండి: Pawan Kalyan : తీర ప్రాంత అడవుల రక్షణకు యుద్ధప్రాతిపదికన చర్యలు.. గ్రేట్ గ్రీన్ వాల్, 50% గ్రీన్ కవర్ లక్ష్యాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Pawan Kalyan : కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : పవన్ కల్యాణ్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు