HomeAndhra PradeshChandrababu Naidu : రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పారిశ్రామికవేత్తలతో భేటీలు

Chandrababu Naidu : రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పారిశ్రామికవేత్తలతో భేటీలు

Chandrababu Naidu : వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరనున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన బృందంతో కలిసి సీఎం ఆదివారం దావోస్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు జరగనున్నాయి.

జనవరి 19 నుంచి 22వ తేదీ వరకు దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబు మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పారిశ్రామిక పెట్టుబడులు, ఐటీ, ఇన్నోవేషన్, ఎనర్జీ ట్రాన్సిషన్, మౌలిక వసతులు, ఏఐ వంటి అంశాలపై కీలక చర్చల్లో ఆయన పాల్గొననున్నారు.

విజయవాడ నుంచి దావోస్ వరకు ప్రయాణ వివరాలు
ఆదివారం రాత్రి 8.35 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం చంద్రబాబు, అక్కడి నుంచి జ్యూరిచ్‌కు ప్రయాణించనున్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ హిల్టన్ హోటల్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్ ముఖ్యమంత్రితో మర్యాదపూర్వక భేటీ అవుతారు.

అనంతరం ఎరోస్ ఇన్నోవేషన్ సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ కిషోర్ లుల్లా, సహ అధ్యక్షులు రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్‌లు సీఎంతో సమావేశమవుతారు. అదే రోజు భారత ఎంబసీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం పాల్గొని, 20 దేశాల నుంచి హాజరయ్యే ఎన్నార్టీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

తరువాత జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గాన సీఎం చంద్రబాబు దావోస్‌కు చేరుకుంటారు.

తొలి రోజే అంతర్జాతీయ స్థాయి సమావేశాలు
దావోస్ పర్యటన తొలి రోజున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక–పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో జరిగే అంతర్జాతీయ సమావేశంలో సీఎం పాల్గొంటారు. అలాగే టాటాసన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి సీఎంతో భేటీ కానున్నారు.

సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతోనూ ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. ఇదే రోజు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ పొలిటికోకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.

రెండో రోజు పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు
రెండో రోజు హోటల్ మోరోసాని ప్రోమెనేడ్‌లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగే
“ఇండియా ఎట్ సెంటర్ – జియోగ్రఫీ గ్రోత్ : ఏపీ అడ్వాంటేజ్” బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌లో సీఎం పాల్గొంటారు.

అనంతరం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంజ్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా ఐబీఎం చైర్మన్ & సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌లతో సీఎం ముఖాముఖి భేటీలు జరుపుతారు. ఈ సమావేశాల్లో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొంటారు.

ఏపీ లాంజ్‌లో నిర్వహించే వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్యానల్ డిస్కషన్‌లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం సీఎన్‌బీసీ ఇంటర్నేషనల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.

అదే రోజు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంక్, అనిల్ మూర్తిలతో సమావేశం జరుగుతుంది. ఎనర్జీ ట్రాన్సిషన్ లీడర్స్ సమావేశంలోనూ సీఎం పాల్గొంటారు.

స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మంత్రి హెలెన్ బడ్లిజెర్ అర్టెడా, రాయబారి ఆండ్రియా రౌబర్, స్విస్ పార్లమెంట్ సభ్యుడు నిక్ గుగ్గర్‌తో చర్చలు జరగనున్నాయి. అలాగే ఎన్విడియా ఉపాధ్యక్షుడు కాలిస్టా రెడ్మండ్‌తోనూ సీఎం భేటీ అవుతారు.

ఇజ్రాయెల్ ఆర్థిక శాఖ మంత్రి నిర్ బర్కత్, ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్, స్విట్జర్లాండ్‌లోని ఇజ్రాయెల్ ట్రేడ్ విభాగాధిపతి షిర్ స్లడ్జ్కీతోనూ ముఖ్యమంత్రి సమావేశమవుతారు.

సాయంత్రం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్, పెయింట్స్ సంస్థల ఎండీ పార్ధ్ జిందాల్, అంతర్జాతీయ లాజిస్టిక్స్ దిగ్గజం మోలర్ మేర్స్క్ సీఈఓ విన్సెంట్ క్లెర్క్‌లతో కీలక చర్చలు జరగనున్నాయి.

మూడో రోజు గ్లోబల్ ఎకనామిక్ చర్చల్లో సీఎం కీలక పాత్ర

మూడో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్‌లో జరిగే పారిశ్రామిక పురోగతి అంశాలపై సెషన్లలో సీఎం పాల్గొంటారు. హొరైసిస్ చైర్మన్ ఫ్రాంక్ రిచర్‌తో భేటీ, తమారా హాస్పిటాలిటీ ఫౌండర్ సృష్టి శిబులాల్, కాలిబో ఏఐ అకాడమీ సీఈఓ రాజ్ వట్టికుట్టి తదితరులతో సమావేశాలు జరగనున్నాయి.

బ్లూమ్‌బర్గ్ నిర్వహించే
“ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ – ఏఐ మూవ్‌మెంట్ ట్రాన్స్‌ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ” సెషన్‌లో ముఖ్య వక్తగా సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు.
మొత్తంగా ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు
36 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు
3 ప్రభుత్వాల మధ్య సమావేశాలు
16 వన్ టు వన్ కార్పొరేట్ భేటీలు
9 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు

జనవరి 23న స్వదేశానికి రాక
జనవరి 22న దావోస్ నుంచి జ్యూరిచ్‌కు చేరుకున్న అనంతరం, స్విట్జర్లాండ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.35 గంటలకు సీఎం భారత్‌కు బయల్దేరనున్నారు. జనవరి 23 ఉదయం 8.25 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి: Highways : హైవే నిర్మాణంలో భారత్‌కు ప్రపంచ గర్వకారణం.. అమరావతి–బెంగుళూరు కారిడార్‌కు ‘బీకేవీ’ పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు సూచన
Chandrababu Naidu : అమరావతి అన్‌స్టాపబుల్: సీఎం చంద్రబాబు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు