HomeCinemaOscars 2026: రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.90 కోట్ల వసూళ్లు… ఆస్కార్ బరిలోకి దూసుకొచ్చిన...

Oscars 2026: రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.90 కోట్ల వసూళ్లు… ఆస్కార్ బరిలోకి దూసుకొచ్చిన బ్లాక్‌బస్టర్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’

Oscars 2026: 2025లో విడుదలై చిన్న సినిమా స్థాయి నుంచి భారీ సంచలనంగా మారిన చిత్రాల్లో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఒకటి. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ తమిళ చిత్రం, థియేటర్లలో రూ.90 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దాదాపు 1200 శాతం లాభాలను నమోదు చేసిన ఈ మూవీ, ఇప్పుడు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ 2026 రేసులోకి అధికారికంగా ప్రవేశించింది.

సినిమా రంగంలో అత్యున్నత గౌరవంగా భావించే ఆస్కార్ అవార్డుల కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తుంటారు. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో ఉన్న డాల్బీ థియేటర్‌లో జరగనుంది. ఈ అవార్డుల కోసం 2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్య విడుదలైన చిత్రాలను పరిగణనలోకి తీసుకుంటారు.

ఈ ఏడాది ఆస్కార్ పోటీలకు భారత్ నుంచి మొత్తం ఐదు సినిమాలు ఎంపికయ్యాయి. తన్వీ ది గ్రేట్‌, సిస్టర్ మిడ్‌నైట్‌, కాంతార ఛాప్టర్ 1, మహావతార్ నరసింహా చిత్రాలతో పాటు ఇప్పటికే ‘హోమ్‌బౌండ్’ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో టాప్-15 షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకుని అంచనాలు పెంచింది. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో భారతీయ సినిమా చేరింది.

గతేడాది విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ కూడా ఆస్కార్ పోటీలకు అర్హత సాధించింది. ఈ సినిమా బెస్ట్ పిక్చర్ కేటగిరీలో పోటీ పడనుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

నూతన దర్శకుడు అభిషన్ జీవింత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్థిక కష్టాల కారణంగా శ్రీలంక నుంచి తమిళనాడుకు వలస వచ్చిన ఒక కుటుంబం ఎదుర్కొనే భావోద్వేగాలు, సంఘర్షణలను హృద్యంగా తెరపై ఆవిష్కరించారు. ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా, పలువురు స్టార్ హీరోలు, దర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.

మే 1, 2025న థియేటర్లలో విడుదలైన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’, బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమా అక్కడ కూడా రికార్డు స్థాయి వ్యూస్‌తో సత్తా చాటింది. తాజాగా ఆస్కార్ రేసులో చోటు దక్కడంతో చిత్ర బృందంలో ఉత్సాహం మరింత పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల నుంచి మొత్తం 317 సినిమాలు ఆస్కార్ పోటీలకు దరఖాస్తు చేసుకోగా, వాటిలో 201 చిత్రాలను మాత్రమే తుది పోటీకి ఆస్కార్ కమిటీ ఎంపిక చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’కు చోటు దక్కడం భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణంగా మారింది.

ప్రస్తుతం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉండటంతో మరింత మంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఇవీ చదవండి: Modi new year wishes: నాటు.. నాటు.. పాటకు ఆస్కార్‌ అవార్డుతో దేశం ఉర్రూతలూగింది.. ప్రధాని మోదీ న్యూ ఇయర్ విషెస్
Modi new year wishes: నాటు.. నాటు.. పాటకు ఆస్కార్‌ అవార్డుతో దేశం ఉర్రూతలూగింది.. ప్రధాని మోదీ న్యూ ఇయర్ విషెస్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు