HomeAndhra PradeshAndhra News: లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్‌.. నేరాల చిట్ట చూసి షాక్‌ అయిన...

Andhra News: లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్‌.. నేరాల చిట్ట చూసి షాక్‌ అయిన పోలీసులు!

Andhra News: లేడీ డాన్ అరుణ వ్యవహారం పోలీసు శాఖను కుదిపేస్తోంది. ఆమె కార్యకలాపాలపై అనుమానం రావడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టగా, విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులతో సన్నిహితంగా మెలుగుతూ, అదే పరిచయాలను ఆసరాగా చేసుకుని బ్లాక్‌మెయిల్ స్థాయికి ఎదిగినట్టు దర్యాప్తులో తేలింది. అంతేకాదు, పలు సెటిల్మెంట్ వ్యవహారాల్లో కూడా ఆమె కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు.

రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ ఇప్పించడంలో అరుణ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పెరోల్ వచ్చిన నాలుగు రోజుల్లోనే అధికారులు దాన్ని రద్దు చేసి శ్రీకాంత్‌ను తిరిగి జైలుకు పంపించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అరుణను అరెస్ట్ చేసి లోతుగా విచారణ చేపట్టగా, మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి.

సూళ్లూరుపేట కేంద్రంగా అరుణ పలు అక్రమ సెటిల్మెంట్‌లకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. వెంకటగిరికి చెందిన ఓ వ్యక్తిని గంజాయి రవాణా, వ్యభిచార గృహాల నిర్వహణకు ఒత్తిడి చేసినట్లు బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. అలాగే సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యేతో అరుణ సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినట్టు పోలీసులు గుర్తించారు.

దర్యాప్తులో భాగంగా కాల్ డేటాను పరిశీలించగా, రౌడీ షీటర్లు, జైలు ఉన్నతాధికారులు, రాజకీయ నేతలతో అరుణ తరచూ ఫోన్‌లో మాట్లాడినట్లు తేలింది. ఈ అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. అనంతరం ఆమెను నెల్లూరు జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

రిపీటెడ్‌గా నేరాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్లపై కఠినంగా వ్యవహరిస్తున్న ఎస్పీ అజిత్‌.. అరుణపై కోవూరు, నవాబ్‌పేట, వేదయాపాలెం పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదు కావడంతో పీడీ యాక్ట్‌ను ప్రయోగించినట్లు సమాచారం. అరుణ బయటకు వస్తే మళ్లీ నేరాల్లో పాల్పడే అవకాశం ఉందనే అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నారని పోలీసులు చెబుతున్నారు.

చట్ట ప్రకారం రెండేళ్ల కాలంలో ఐదుకు పైగా నేరాలు చేసిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించే అవకాశం ఉంటుంది. పీడీ యాక్ట్ అమల్లో ఉంటే ఏడాది పాటు బెయిల్ ఉండదు, ఎవ్వరిని కలిసేందుకు కూడా అనుమతి ఉండదు. బెయిల్ కోసం నేరుగా హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. అలాగే ములాఖాత్‌కు కూడా హోం ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి తప్పనిసరి. దీంతో అరుణ నేర కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో బ్రేక్ పడే అవకాశముందని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి: Konaseema Crime : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు.. కోనసీమలో కిలాడీ లేడీ..!
Andhra Pradesh: అమాయకంగా కనిపిస్తారు… కానీ దొంగతనాల్లో మామూలు వారు కారు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు