HomeSportsMessi Tour: హైదరాబాద్‌లో మెస్సీ మ్యానియా.. ఫోటోకు లక్షల ఖర్చు!

Messi Tour: హైదరాబాద్‌లో మెస్సీ మ్యానియా.. ఫోటోకు లక్షల ఖర్చు!

Messi Tour: సాకర్‌ దిగ్గజం లియోనెల్ మెస్సీ రాకతో హైదరాబాద్‌ మొత్తం ఫుట్‌బాల్ ఫీవర్‌లో మునిగిపోయింది. అభిమానుల కల నిజమయ్యే క్షణాలు ఆసన్నమయ్యాయి. మెస్సీ ఇవాళ సాయంత్రం 4 గంటలకు కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు.

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో వందమంది ప్రత్యేక అభిమానులతో మెస్సీ ఫోటో సెషన్‌లో పాల్గొననున్నారు. అయితే మెస్సీతో ఫోటో దిగాలంటే ఒక్కొక్కరికి దాదాపు పది లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండటంతో ఈ ఈవెంట్‌ హాట్ టాపిక్‌గా మారింది.

అనంతరం సాయంత్రం 6.30 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. సాయంత్రం 7 గంటలకు అక్కడ నిర్వహించనున్న ఫుట్‌బాల్ క్లినిక్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్‌గా నిర్వహిస్తున్నారు.

7 గంటల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్లేయర్ హోదాలోనే ఈ మ్యాచ్‌లో పాల్గొనడం విశేషం. మెస్సీ టీమ్‌, రేవంత్ రెడ్డి టీమ్‌ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7.30 గంటలకు ప్రత్యేక మ్యాచ్ ప్రారంభమవుతుంది.

సింగరేణి RR జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా, అపర్ణ జట్టు తరఫున మెస్సీ బరిలోకి దిగనున్నారు. మెస్సీతో పాటు అతని సన్నిహిత మిత్రులు రోడ్రిగో, లూయిస్ సురేజ్ కూడా ఈ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. అయితే మ్యాచ్ చివరి ఐదు నిమిషాల్లో మాత్రమే మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్‌లోకి వచ్చి ఆడనున్నారు.

మ్యాచ్ ముగిసిన అనంతరం విజేత జట్టుకు ‘GOAT ట్రోఫీ’ని మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి ప్రదానం చేస్తారు. ఈవెంట్ పూర్తయ్యాక మెస్సీ తిరిగి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ముంబైకి బయల్దేరనున్నారు. ఈ మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

అయితే మెస్సీ టూర్ కేవలం వినోదంగా కాకుండా రాజకీయ వివాదాలకు కూడా దారి తీసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘పొలిటికల్ ఫుట్‌బాల్’ మొదలైంది. మెస్సీతో కొన్ని నిమిషాలు ఫుట్‌బాల్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డి వంద కోట్లకు పైగా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. సింగరేణి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది.

ఈ ఆరోపణలకు నిరసనగా హైదరాబాద్‌లోని సింగరేణి కార్యాలయం వద్ద బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే మెస్సీ రాకను కావాలనే రాజకీయంగా వివాదం చేస్తున్నారని మెస్సీ టూర్ చీఫ్ కోఆర్డినేటర్ పార్వతీరెడ్డి కౌంటర్ ఇచ్చారు. సింగరేణి కాలరీస్ స్పాన్సర్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. క్రీడల అభివృద్ధికి ఎవరైనా ముందుకు రావొచ్చని వ్యాఖ్యానించారు. మెస్సీ రాకతో భారత్‌లో ఫుట్‌బాల్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఆమె స్పష్టం చేశారు.

మెస్సీ క్రేజ్‌తో హైదరాబాదీ ఫ్యాన్స్‌లో ఉత్సాహం తారస్థాయికి చేరింది.

ఇవీ చదవండి: Gold Rate Today: తిరిగి రెట్టించిన వేగంతో పెరుగుతున్న బంగారం ధరలు – హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే
Telangana Rising Global Summit 2025 : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025: రెండు రోజులు ఏం జరిగిందంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు