Vijayawda : విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో పర్యటించి డయేరియా బాధితులను వైఎస్సార్ సీపీ నాయకులు పరామర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. విజయవాడ నగరంలో ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం మండిపడింది. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో డయోరియాతో వణికిపోతున్న న్యూ రాజరాజేశ్వరీ పేటలో పార్టీ ప్రతినిధి బృందం పర్యటించింది.
అక్కడి రోగులను, స్థానికులను పరామర్శించి, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యశిబిరం, అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించింది. దాదాపు ఏడు వందలకు పైగా డయోరియా కేసులు నమోదైన నేపథ్యంలో మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించి, అత్యవసర వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని పార్టీ ప్రతినిధి బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. నామమాత్రపు వైద్య సేవలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తింది.
ఈ ప్రతినిధి బృందంలో ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాశ్, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్‌మోహన్ రావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర నాయకులు షేక్ ఆసిఫ్, వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తదితరులు ఉన్నారు. అనంతరం వారు అక్కడే మీడియాతో మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారంటే…
నాయకుల మనసంతా విజయవాడ ఉత్సవ్ మీదనే : దేవినేని అవిశాశ్
ఐదు రోజులుగా విజయవాడ ప్రజలు డయేరియాతో ఇబ్బంది పడుతున్నారు. హెల్త్ క్యాంపులు తూతూమంత్రంగా నిర్వహిస్తుండటంతో బాధితులు ప్రైవేటు ఆస్పత్రుల్ని నమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బాధితులు లక్షల్లో ఖర్చు పెట్టి అప్పుల పాలవుతున్నారు. అయినా బాధితులను ఆదుకోవడానికి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, స్థానిక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు బాధ్యత తీసుకోవడం లేదు. ఏటా విజయవాడ నగరంలో డయేరియా కేసులు ప్రబలుతున్నా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎంతసేపటికీ విజయవాడ ఉత్సవ్ పేరుతో భూములు దోచుకోవడం, కమీషన్లు తీసుకోవడం మీదనే కూటమి నాయకుల శ్రద్ద కనిపిస్తోంది.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం : డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి
కాలనీలో ఏ ఇంటికి వెళ్లినా అక్కడికి సరఫరా చేస్తున్న కలుషిత తాగునీటిని బాటిళ్లతో చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకీ డయేరియా కేసుల సంఖ్య పెరుగుతున్నా ఇప్పటికీ కార్పొరేషన్ నుంచి ఇదే నీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీరు ఇంత దారుణంగా కనిపిస్తున్నా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పానీ పూరీలు తినడం వల్ల, గణేశ్ నిమజ్జనం సదర్భంగా ఫుడ్ పాయిజన్ అయిందనీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కట్టుకథలు అల్లడం సిగ్గుచేటు. మీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 270 మంది బాధితులున్నట్టు చెబుతున్నా రెండు వీధుల్లోనే 700 మందికి పైగా బాధితులను మేం గుర్తించాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇంటింటికీ సురక్షిత మంచి నీటిని ఉచితంగా సరఫరా చేయాలి.
తాగునీటిని పరీక్ష చేయకుండా సరఫరా : మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్ రావు
గతేడాది కూటమి ప్రభుత్వంలో విజయవాడలో ఇదే తరహాలో డయేరియా కేసులు నమోదయ్యాయి. ఈసారి అదే పరిస్థితులు నెలకొన్నాయి. రాజధానిగా చెప్పుకునే విజయవాడలో వరుసగా ఇలాంటి పరిస్థితులు రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు. గ్రామ సచివాలయాల్లో వాటర్ టెస్టింగ్ కిట్లు ఇచ్చి ఎప్పటికప్పుడు తాగునీటిని టెస్టు చేసేవాళ్లం. ఇప్పుడా పరిస్ధితులు కనిపించడం లేదు. 40 అర్బన్ హెల్త్ సెంటర్లు, 5 వేల మంది శానిటరీ వర్కర్లు, 225 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉండి కూడా ఈ పరిస్థితులు ఉన్నాయంటే ప్రజారోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని చెప్పడానికి ఇంతకన్నా రుజువులు ఇంకేం కావాలి?
అంబులెన్స్‌లు లేవు, పిల్లల డాక్టర్లు లేరు : మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
డయేరియా కేసులు ప్రబలిన నేపథ్యంలో ఐదు రోజులుగా బాధితుల పక్షాన వైయస్సార్సీపీ పోరాడుతోంది. వారికి సరైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చాం. ఈ రోజుకీ కారణాలను చెప్పడానికి ప్రభుత్వానికి ధైర్యం చాలడం లేదు. కాలనీలో పర్యటిస్తుంటే బాధితుల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఇప్పటికీ ఎన్యుమరేషన్ పూర్తి చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఒక కాలనీలో ప్రబలిన డయేరియా కేసుల్ని నియంత్రణ చేయలేకపోయిన ప్రభుత్వం రానున్న దసరా ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. వైద్యారోగ్యశాఖ మంత్రి అవగాహన లేకుండా బుడమేరు గురించి మాట్లాడుతూ ప్రజల్ని మరింత భయాందోళనకు గురిచేస్తున్నారు. ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రి సత్యకుమార్ తక్షనం రాజీనామా చేయాలి.
ఇవీ చదవండి: Vijayawada : డయేరియా చికిత్స అందించడంలో ప్రభుత్వం విఫలం : మేయర్ రాయన భాగ్యలక్ష్మి
Palnadu: గురజాలలో దారుణ పరిస్థితులు.. డయేరియా బాధితులను ఆదుకోవాలి
