HomeAndhra PradeshLokesh with Modi : ప్రధానితో లోకేష్ భేటీ.. కీలక బాధ్యతలు, అరెస్టుల గురించేనా?

Lokesh with Modi : ప్రధానితో లోకేష్ భేటీ.. కీలక బాధ్యతలు, అరెస్టుల గురించేనా?

Lokesh with Modi : ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేష్ అపాయింట్ మెంట్ ఖరారైంది. రేపు సాయంత్రం ప్రధానమంత్రితో లోకేష్ (Lokesh with Modi) సమావేశం కానున్నారు. ఈ మేరకు అనంతపురంలో పర్యటన రద్దు చేసుకున్న లోకేష్.. హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. ఇవాళ అనంతపురంలో రెన్యూ శంకుస్థాపన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈలోగా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో రేపు ఢిల్లీ పయనమయ్యేందుకు లోకేష్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయంగా కీలక చర్చ జరుగుతోంది.

రేపు ఢిల్లీలో మంత్రి లోకేష్ పర్యటించనున్న నేపథ్యంలో పొలిటికల్ ఎనలిస్టులు ఆసక్తికర అంశాలను లేవనెత్తుతున్నారు. ప్రధాని అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో రేపు లోకేష్ హస్తినకు వెళ్తున్నారు. అయితే, అధికారికంగా చెబుతున్న సమాచారం చూస్తే… గతంలో ప్రధాని మోదీ విశాఖ, అమరావతిలో పర్యటన సమయంలో లోకేష్ ను తనను వచ్చి కలవాల్సిందిగా ఆహ్వానించారని చెబుతున్నారు. అందుకోసమే మోదీని కలిసేందుకు లోకేష్ వెళ్తున్నట్లు టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతోంది.

కీలక బాధ్యతలు?
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం యాక్టివ్ గా కొనసాగుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించాలనే చర్చ నడుస్తోంది. అందుకు ఉదాహరణలుగా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. దావోస్ పర్యటన సందర్భంగా సహచర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. అలాగే కాబోయే లోకేష్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని చాలా మంది డిమాండ్లు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా లోకేష్ సైతం.. కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీలో ఒక సభ్యుడు మూడు సార్లు మాత్రమే పదవిలో ఉండాలని, ఆ మేరకు ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెబుతున్నారు.

అంటే దాని ఉద్దేశం వెనుక పార్టీలో యువ నాయకత్వం పెంపొందించాలనేది అని లోకేష్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి బాధ్యతలు చేపట్టారని, ఇక లోకేష్ కు అవకాశం ఇవ్వాలని టీడీపీలో చాలా మంది కోరుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల జరిగిన ఎన్నికల ముందు నుంచే లోకేష్ పార్టీపై పట్టు సాధిస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా అన్ని విధాలా అర్హుడని, ఇదే సరైన సమయమని టీడీపీలో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

మహానాడు వేదికగా ప్రకటన?
టీడీపీ మహానాడు కడపలో నిర్వహించనున్నారు. వైయస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ పట్టు సాధించింది. కడప ఎమ్మెల్యే సైతం టీడీపీ హస్తగతమైంది. ఈ నేపథ్యంలోనే రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో జెండా పాతాలని టీడీపీ అధిష్టానం ఆరాటపడుతోంది. ఇటీవల పరిణామాలు కూడా కడపలో చాలా జరుగుతున్నాయి. కడప మేయర్ పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన్ను పదవి నుంచి తొలగిస్తూ నిన్ననే ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అక్కడి ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి, మేయర్ సురేష్ బాబుకు పొసగడం లేదన్నది బహిరంగ సత్యమే. ఈ నేపథ్యంలో కడపపై పట్టు నిలుపుకునేందుకు అక్కడే మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహానాడు సమావేశాల్లోనే లోకేష్ కు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పొలిటికల్ సర్కిళ్లలో గుసగుసలు చర్చ జరుగుతోంది.

రెండు అంశాలపై మోదీతో చర్చలు?
రేపు ప్రధానితో లోకేష్ భేటీ నేపథ్యంలో ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి. మొదటిది తెలుగుదేశం పార్టీని లోకేష్ లీడ్ చేయడం గురించి, రెండోది రాష్ట్రంలో కీలక నేత అరెస్టు గురించి ప్రధానికి సమాచారం ఇచ్చేందుకేనన్న చర్చ జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వంలో అనేక స్కాములంటూ కీలక నేతలందరినీ వరుసబెట్టి అరెస్టులు చేస్తున్నారు. కోర్టుల చుట్టూ, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే విపక్ష పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా చాలా వరకు సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలోనే ముఖ్య నాయకుడి అరెస్టు గురించి ప్రధాని మోదీకి వివరాలు చెప్పేందుకు లోకేష్ వెళ్తున్నాడని చర్చ జరుగుతోంది.

అధికార మార్పిడిపైనా రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. త్వరలో ఏపీలో అధికార మార్పిడి అంటే.. ముఖ్యమంత్రి లేదా మంత్రివర్గ విస్తరణ జరిగే చాన్స్ ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోకేష్ కు డిప్యూటీ సీఎం స్థాయి ఇస్తారని, లేదా ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశాలూ లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. ప్రధానితో భేటీ తర్వాత జరిగే పరిణామాలను బట్టి ఏపీలో రాజకీయంగా పెను ప్రకంపనలు జరిగే అవకాశం పుష్కలంగా ఉందంటున్నారు రాజకీయ పండితులు.

ఇవీ చదవండి: Lokesh Red Book: రెడ్ బుక్‌లో మూడో ఛాప్టర్ త్వరలోనే ఓపెన్ చేస్తాం
Nara Lokesh with Satya Nadella: సత్య నాదెళ్లతో నారా లోకేష్ భేటీ.. ఏం మాట్లాడారంటే
Nara Lokesh in USA: ఏవియేషన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఆహ్వానం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు